Begin typing your search above and press return to search.

ఇంతకూ ఎన్ని పాతనోట్లు డిపాజిట్ అయ్యాయి!

By:  Tupaki Desk   |   28 Dec 2016 9:53 AM GMT
ఇంతకూ ఎన్ని పాతనోట్లు డిపాజిట్ అయ్యాయి!
X
నవంబరు 8న ప్రధాని మోడీ ప్రకటించిన నోట్ల రద్దు గురించి తాజాగా ఒక కీలకమైన విషయంపై తీవ్రమైన చర్చ నడుస్తుంది. నోట్ల రద్దు వల్ల దేశంలోని నల్లధనానికి చావు దెబ్బ అని, డిసెంబరు 30 తర్వాత ఆ నోట్లను గంగా నదిలో పాడేసుకుంటారని, ఈ దెబ్బతో నల్లబాబులు విలవిల్లాడతారని చెప్పుకొచ్చారు. ఇంతకూ నోట్లరద్దు నిర్ణయం అనంతరం ఎంతమంది నల్లబాబులు ఇబ్బందిపడ్డారు.. సామాన్యులు ఎంతవరకూ ఇబ్బందిపడ్డారు.. నేటికీ ఏటిఎం లలో నగదు పెట్టడంలో ఎందుకు విఫలమయ్యారు.. ఇప్పటికీ బ్యాంకుల ముందు క్యూలు ఎందుకుంటున్నాయి.. జనవరి 1 తర్వాత అయినా నగదు విత్ డ్రాస్ లో షరతులు ఉండవని ఎందుకు చెప్పలేకపోతున్నారు వంటి సంగతులు కాసేపు పక్కనపెడితే తాజాగా వార్తల్లో నలుగుతున్న ఒక విషయం ఆర్థికరంగ నిపుణులకు - విశ్లేషకులకు షాక్ కలిగిస్తుందనే చెప్పాలి.

అదేమిటంటే... ఇప్పటివరకూ బ్యాంకుల్లో ఎన్ని పాత నోట్లు డిపాజిట్ అయ్యాయి అనేది! అవును... పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడానికి గడువు ఎల్లుండితో ముగుస్తోన్న తరుణంలో ఇప్పటివరకు బ్యాంకుల్లో ఎన్ని నోట్లు డిపాజిట్‌ అయ్యాయి అన్న విషయంపై చర్చ మొదలైంది.. అయితే ఈ విషయంపై ఆర్బీఐ మాత్రం మౌనాన్నే తన బాషగా చేసుకుంది.

డిసెంబర్‌ 10 వరకు బ్యాంకుల్లో డిపాజిట్ అయిన సొమ్ము 12.44 లక్షల కోట్లుగా ఆర్బీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే డిసెంబర్ 10 అనంతరం జరిగిన డిపాజిట్లపై మాత్రం ఆర్బీఐ ఏమాత్రం స్పందించడం లేదు. ఆ సంగతి అలా ఉంటే... నవంబర్‌ 8న రద్దయిన నోట్ల విలువ 14.2 లక్షల కోట్లు కాగా, డిసెంబర్‌ 10 నాటికే 12 లక్షల కోట్లు డిపాజిట్‌ అయ్యింది. దీంతో కేంద్రం ముందుగా ఊహించిన "సుమారు 2 లక్షల కోట్ల వరకు బ్యాంకుల్లో డిపాజిట్‌ కాదు" అనే అంచనా తప్పిందనే అనుకోవాలి! ఈ క్రమంలో రద్దయిన 14.2 లక్షల కోట్ల నోట్ల కంటే అధికంగా బ్యాంకుల్లో డిపాజిట్‌ లు జరిగాయా అనే కొత్త అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీంతో కొత్త సమస్యలు వచ్చి పడ్డట్లూయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలా కానిపక్షంలో రద్దైన 14.2 లక్షల కోట్లు తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్ అయిపోయి అయినా ఉండొచ్చని అంటున్నారు. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగి ఉంటుందని, అందుకే ఆర్బీఐ మౌనం పాటిస్తూ ఆ వివరాలు వెల్లడించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!! అదే జరిగితే నోట్ల రద్దు అనే నిర్ణయ ఫలితం..?


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/