Begin typing your search above and press return to search.

ఓపీఎస్ విధానంతో ఆర్థిక భారం తప్పదంటున్న ఆర్బీఐ..!

By:  Tupaki Desk   |   19 Jan 2023 4:30 AM GMT
ఓపీఎస్ విధానంతో ఆర్థిక భారం తప్పదంటున్న ఆర్బీఐ..!
X
పాత పింఛను విధానం (ఓపీఎస్) విధానంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో అమలు చేసిన ఓపీఎస్ విధానాన్ని కొన్ని రాష్ట్రాలు తిరిగి అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ ఆ రాష్ట్రంలో ఉద్యోగులకు ఓపీఎస్ విధానం అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఓపీఎస్ విధానంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఓపీఎస్ విధానాన్ని తిరిగి అమలు చేసినట్లయితే ఆ రాష్ట్రాలు భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక మోయడం తప్పదని హెచ్చరించింది. దీని వల్ల ఆయా రాష్ట్రాల రాబడుల వ్యయాల మధ్య సమతౌల్యం దెబ్బతిని ఆర్థిక వ్యవస్థలు ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది.

'రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు 2022-23 బడ్జెట్ పరిశీలన' పేరుతో ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలో ఈ వ్యాఖ్యలు చేసింది. ఇటీవలే హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం పాత పింఛన్ విధానానికి ఆమోదం తెలిపింది. అధికార కాంగ్రెస్ ఎన్నికల హామీని నెరవేర్చే క్రమంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. తొలి కేబినెట్ సమావేశంలోనే ఓపీఎస్ ను తిరిగి ప్రారంభించేందుకు ఏకగ్రీవంగా తీర్మానించారు.

పాత పెన్షన్ విధానం పునరుద్ధరించే విషయంలో తాము విస్తృతంగా అధ్యయనం చేసినట్లు హిమచల్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఆర్థిక విభాగాలకు చెందిన అధికారులు పాత పింఛన్ తిరిగి అమలు చేసే విషయంలో కొన్ని మినహాయింపులు అమలు చేయాలని సూచించామని అయితే ఆ సమస్య పరిష్కారమైందని పేర్కొన్నారు.

ప్రస్తుతం కొత్త పెన్షన్ స్కీమ్ (ఎన్‌పిఎస్)లో ఉన్న ఉద్యోగులందరికీ ఓపీఎస్ వర్తించనుంది. ఉద్యోగులతో సంప్రదింపులు జరిపి విధివిధానాలు ప్రకటించనున్నారు. హిమచల్ మాదిరిగానే రాజస్థాన్.. చత్తీస్ ఘడ్.. ఝార్ఖండ్ రాష్ట్రాలు సైతం తమ రాష్ట్రంలోని ఉద్యోగులకు ఓపీఎస్ ను ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నాయి.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి.. పింఛను నిధి నియంత్రణ అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ)కు ఇప్పటికే తెలియజేశాయి. పంజాబ్ లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సైతం ఓపీఎస్ కు సంబంధించి గత ఏడాది నవంబర్లో ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఏది ఏమైనా ఓపీఎస్ విధానంపై ఆర్బీఐ హెచ్చరికల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపై విభిన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.