Begin typing your search above and press return to search.

ఆర్బీఐ వరాలు: క్రెడిట్ కార్డు బకాయిలు కట్టక్కర్లేదా?

By:  Tupaki Desk   |   27 March 2020 10:50 AM GMT
ఆర్బీఐ వరాలు: క్రెడిట్ కార్డు బకాయిలు కట్టక్కర్లేదా?
X
దేశంలో కరోనా విపత్తు నిర్వహణ చర్యలను కేంద్రం వేగవంతం చేసింది. ప్రధాని మోడీ లాక్ డౌన్ ప్రకటించి ప్రజల కోసం 1.7 లక్షల కోట్ల ప్యాకేజీని నిన్న ప్రకటించారు. ఇక శుక్రవారం కేంద్ర బ్యాంకు ఆర్బీఐ వేతన జీవులకు, ప్రజలకు గొప్ప ఊరటనిచ్చింది. కీలక వడ్డీ రేట్లపై ముందస్తు కోత విధించడంతో పాటు అన్ని రకాల రుణాలపై మూడు నెలల పాటు మారటోరియం విధించింది. దీంతో మూడు నెలలపాటు గృహ , ఇతర రుణాలను తీసుకున్న వినియోగదారులకు ఈఎంఐ చెల్లింపుల నుంచి మూడు నెలల పాటు ఆర్బీఐ మినహాయింపునిచ్చింది. అంతేకాదు.. సదురు ఖాతాలను ఎన్.పీ.ఏలుగా పరిగణించ రాదని కూడా ఆయా బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలకు ఆర్బీఐ ఆదేశాలిచ్చింది.

ప్రస్తుతం 90 రోజులకు పైగా ఈఎంఐలు కట్టక పోయినా.. రుణాలు చెల్లించక పోయినా ఆ బ్యాంకు ఖాతాను ఎన్.పీ.ఏ గా పరిగణించి బ్యాంకులు ఇబ్బందిపెడతాయి. భవిష్యత్తులో రుణాలు కూడా ఇవ్వరు. అప్పుపుట్టడం కష్టమవుతుంది. కానీ తాజాగా ఆర్బీఐ నిర్ణయం వినియోగదారులకు గొప్ప ఊరటనిచ్చింది.

అయితే ఈఎంఐలు , రుణాల చెల్లింపునకు ఊరటనిచ్చిన ఆర్బీఐ క్రెడిట్ కార్డు రుణాల పరిస్థితిపై మాత్రం ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. దీనిపై పలువురు ఆర్బీఐని వివరణ కోరగా క్లారిటీ ఇచ్చింది.

క్రెడిట్ కార్డు రుణాలు, బకాయిలకు మూడు నెలల మారటోరియం వర్తించదని స్పష్టం చేసింది. ఆయా చెల్లింపులను వినియోగదారులు తప్పకుండా చెల్లించాలని బాంబు పేల్చింది. దీంతో ఐటీ సహా పెద్ద ఉద్యోగాలు చేస్తూ క్రెడిట్ కార్డులు తీసుకున్న వారందరికీ ఆర్బీఐ షాక్ ఇచ్చినట్టు అయ్యింది.

ప్రస్తుతం ఆర్బీఐ సడలింపు కేవలం గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, విద్యారుణాలు లాంటి టర్మ్ లోన్స్ పరిధిలోకి వస్తాయని ఆర్బీఐ తెలిపింది. దీంతో ఈ కష్టకాలంలో తమకూ ఊరట అని చంకలు గుద్దుకున్న క్రెడిట్ కార్డు వినియోగదారులు లబోదిబోమంటున్నారు.