Begin typing your search above and press return to search.

స్థ‌లం లేక నోట్ల ప్రింటింగ్ త‌గ్గించార‌ట‌

By:  Tupaki Desk   |   9 Nov 2017 10:37 AM GMT
స్థ‌లం లేక నోట్ల ప్రింటింగ్ త‌గ్గించార‌ట‌
X
కొన్ని మాట‌లు వింటే మ‌రీ.. అంత ఎట‌కారంగా క‌నిపిస్తున్నామా? అనుకోకుండా ఉండ‌లేం. తాజాగా అలాంటి విష‌య‌మే ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. చెవిలో ఎంత కాలీఫ్ల‌వ‌ర్లు పెట్టుకున్నా చెప్పలేని మాట‌ను సింఫుల్ గా చెప్పేసిన తీరు చూస్తే.. ఓర్నీ యేషాలో అనుకోవాల్సిందే. ఆర్‌ బీఐ నోట్ల ముద్ర‌ణ‌ను త‌గ్గించింద‌ట‌. కార‌ణం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.

గ‌డిచిన ఐదేళ్ల‌తో పోలిస్తే.. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో క‌రెన్సీ నోట్ల ముద్ర‌ణ కోసం త‌క్కువ‌గా ఆర్డ‌ర్ పెట్టిన‌ట్లుగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎందుకిలా? అంటే.. కొత్త‌గా ప్రింట్ చేసే క‌రెన్సీ నోట్ల‌ను భ‌ద్ర‌ప‌రిచేందుకు త‌గినంత స్థ‌లం లేక‌నే అన్న మాట‌ను చెబుతున్నార‌ట‌. గ‌డిచిన ఐదేళ్లుగా స‌గ‌టున 2500 కోట్ల చొప్పున నోట్ల‌ను ఆర్ బీఐ ప్రింట్ చేస్తే.. 2016-17లో 2800 కోట్ల నోట్ల‌ను ముద్రించింది. అయితే.. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం (2017-18) 2100 కోట్ల నోట్ల‌కు మాత్ర‌మే ఆర్ బీఐ ఆర్డ‌ర్ ఇచ్చిన‌ట్లుగా బ‌య‌టకు వ‌చ్చింది.

అన‌ధికారికంగా వ‌చ్చిన ఈ స‌మాచారంలో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఎందుకు త‌క్కువ నోట్ల‌ను ముద్రిస్తున్నారంటే.. పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో నోట్ల‌ను ఉంచాల్సిన స్థ‌లం నిండిపోయింద‌ని.. కొత్త నోట్ల‌ను పెట్ట‌టానికి స్థ‌లం లేక‌పోవ‌టంతో నోట్ల ప్రింటింగ్‌ ను త‌గ్గించిన‌ట్లుగా చెప్పార‌ట‌. ఓవైపు నోట్ల కొర‌త‌తో బ్యాంకుల ఏటీఎంలు మూసివేసిన వైనం అన్నిచోట్ల క‌నిపిస్తుంటే.. స్థ‌లం లేదంటూ ప్రింటింగ్ త‌గ్గించ‌టం చూస్తే.. ఏం స‌మాధానం చెప్పాలో అర్థం కాని ప‌నిగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.