Begin typing your search above and press return to search.

నోట్ల వినియోగం పెరిగింది…దొంగనోట్లు కూడా.. ఆర్బీఐ నివేదిక!

By:  Tupaki Desk   |   30 Aug 2019 1:30 AM GMT
నోట్ల వినియోగం పెరిగింది…దొంగనోట్లు కూడా.. ఆర్బీఐ నివేదిక!
X
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వార్షిక నివేదికలో ఆసక్తిదాయకమైన విషయాలను పేర్కొంది. డీ మానిటైజేషన్ తర్వాత దేశంలో నగదు వినియోగం విషయంలో చాలా మార్పులు వచ్చాయని అంతా అనుకుంటుంటే.. అలాంటిదేవీ లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది!

డీ మానిటైజేషన్ జరిగి దాదాపు మూడేళ్లు కావొస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ పేర్కొన్న విషయాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది దేశంలో కరెన్సీ వినియోగం మళ్లీ బాగా పెరుగుతోంది అనేది. డిజిటల్ లావాదేవీల పెరగడం సంగతేమోకానీ..గత ఏడాది కాలంలో ఆరు శాతానికి మించి నోట్ల మార్పిడి పెరిగిందని ఆర్బీఐ పేర్కొంది. డీ మానిటైజేషన్ తర్వాత మొదటి ఏడాదితో పోలిస్తే రెండో ఏడాది నోట్ల వాడకం పెరగగా, గత ఏడాది కాలంగా అది మరింతగా పెరిగిందని పేర్కొంది ఆర్బీఐ.

2018 -19 లో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల పరిమాణం 6.2శాతం పెరిగినట్టుగా ఆర్బీఐ ప్రకటించింది. ప్రత్యేకించి ఐదు వందల రూపాయల నోట్ల చలామణి బాగా పెరిగింది. మారకంలో ఉన్న నోట్లలో రెండు వేల రూపాయల, ఐదు వందల రూపాయల నోట్ల పరిమాణమే ఎనభై శాతానికి మించి ఉందని ఆర్బీఐ వివరించింది.

ఇక మరో అంశం దొంగనోట్లు. అవి కూడా మార్కెట్ లోకి భారీగా వచ్చాయని ఆర్బీఐ ధ్రువీకరించింది. డీ మానిటైజేషన్ తర్వాత వచ్చిన కొత్త నోట్లకు నకిలీలు తయారు చేయడం కష్టమని కొంతమంది చెప్పుకొచ్చారు. కొత్త నోట్లను తెచ్చింది దొంగ నోట్లకు చెక్ చెప్పడానికే అని తేల్చారు. అయితే మళ్లీ పాతరీతిన యథాతథంగా నకిలీ నోట్లు మారకంలోకి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధ్రువీకరిస్తూ ఉండటం గమనార్హం!