Begin typing your search above and press return to search.

ఆహా : మ‌రో స‌మ్మెకు సిద్ధంగా ఉండుండ్రి ? గెట్ రెడీ !

By:  Tupaki Desk   |   7 Feb 2022 9:42 AM GMT
ఆహా : మ‌రో స‌మ్మెకు సిద్ధంగా ఉండుండ్రి ? గెట్ రెడీ !
X
ఉద్యోగుల‌తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అన్న జోక్ ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతోంది.ఎందుకంటే ఇప్ప‌టిదాకా ఉద్యోగులు చెప్పిన‌వేవీ కూడా అమ‌లుకు నోచుకోలేద‌ని పేర్కొంటూ కొంద‌రు తీవ్ర స్థాయిలో ర్యాడిక‌ల్ లాంగ్వేజ్ లో ప్ర‌భుత్వం పై విరుచుకు ప‌డుతున్నారు. కానీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాను చేయ‌గ‌లిగినంతా చేశాన‌ని, వేత‌నాల‌కు సంబంధించి కొత్త స‌వ‌ర‌ణల ఫ‌లితంగా ఖ‌జానాకు ప‌ద‌కొండు వేల కోట్ల‌కు పైగా భారం ప‌డుతుంద‌ని స్ప‌ష్టంగానే చెబుతున్నారు.అయిన‌ప్ప‌టికీ ఉద్యోగులు,ముఖ్యంగా ఉపాధ్యాయులు సీఎం తీరుపై విరుచుకుప‌డుతున్నారు.

ఇప్పుడీ ఉద్య‌మ ఉప్పెన లేదా సంబంధిత ఉద్ధృతి స‌చివాల‌యం దాటి, గుంటూరు దాటి శ్రీ‌కాకుళం వ‌ర‌కూ వ‌చ్చేసింది.అందుకే ఇప్ప‌టికిప్పుడు మ‌ళ్లీ ప‌రిష్కారాలు వెతికే ప‌నిలో ప్ర‌భుత్వం చేయాల‌ని ఉపాధ్యాయులు సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర ప‌ద‌జాలంతో పోస్టులు పెడుతున్నారు. నిన్న‌టి వేళ ఉద్యోగ సంఘాల‌తో మంత్రుల క‌మిటీ చేసిన చ‌ర్చ‌లు స‌ఫ‌లీకృతం అయ్యాయ‌ని అంతా భావించినా కూడా ఇప్పుడు మాత్రం ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్లు రోడ్డెక్క‌బోతున్నారు.ఇప్ప‌టికే కాంట్రాక్టు లెక్చ‌రర్లు మీడియా ముందుకు వ‌చ్చి తమ గోడు వినిపించారు. ఒకవేళ వీరంతా రోడ్డెక్కితే కాంట్రాక్టు, మ‌రియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌తో పాటు ఇంకొంద‌రు దిగువ స్థాయి ఉద్యోగులు కూడా గ‌ళం క‌ల‌ప‌వ‌చ్చు. ఇంకా చెప్పాలంటే సీపీఎస్ ఉద్యోగులు కూడా ఇదే అదునుగా త‌మ గొంతుక వినిపించేందుకు అవ‌కాశాలే ఎక్కువగా ఉన్నాయి.

మ‌రోవైపు నిన్న‌టి వేళ ఉద్యోగ సంఘ నాయ‌కులు సీఎంను క‌లిసి ధ‌న్య‌వాదాలు తెలిపిన త‌రువాత కొత్త విధి విధానాలు అనుస‌రించి ప్ర‌తి ఐదేళ్ల‌కూ పీఆర్సీ వేయాల్సి ఉన్నందున వ‌చ్చే ఏడాది మ‌రో పీఆర్సీకి ప్ర‌భుత్వం సిద్ధం కానుంద‌ని చెప్పారు. పైకి ఈ మాట తేలిక‌గానే ఉన్నా ఆర్థికంగా ఇలాంటి నిర్ణ‌యాలు మ‌ళ్లీ మ‌ళ్లీ ప్ర‌భుత్వానికి పెను భారం కానున్నాయి. వాస్త‌వానికి ఇప్పుడు అమలు చేయాల‌నుకుంటున్న పీఆర్సీ 11వ‌ది.. కొత్త‌ది 12వ‌ది. 11వ వేత‌న స‌వ‌ర‌ణ క‌మిటీ అన్న‌ది 2018 మే నుంచి అమల్లోకి వ‌చ్చింది.

దీని గ‌డువు వ‌చ్చే ఏడాది మే నెల‌తో ముగియ‌నుంది.దీంతో మ‌రో పీఆర్సీ కి ఉద్యోగులు పంతం ప‌ట్టే అవ‌కాశాలే మెండు. దీనిపై ఇప్ప‌టి నుంచి ప్ర‌భుత్వ వ‌ర్గాలలో క‌ల‌వ‌రం రేగుతోంది. ఇప్ప‌టికే ఆర్థికంగా భారం అయినా 11వ పీఆర్సీని ఓకే చేశామ‌ని,కొత్త పీఆర్సీ అంటూ రేప‌టి వేళ ఉద్యోగులు హ‌డావుడి చేస్తే క‌ష్ట‌మేన‌ని ఇంకొంద‌రు అధికార పార్టీ ప్ర‌తినిధులు ఆందోళ‌న చెందుతున్నారు.ఈ ద‌శ‌లో పీఆర్సీ పై మ‌ళ్లీ మ‌ళ్లీ ర‌గ‌డ నెల‌కొన‌డం ఖాయ‌మ‌నే తేలిపోయింది.