Begin typing your search above and press return to search.

అది కానీ నిరూపిస్తే రాజీనామా అంటున్న జగన్

By:  Tupaki Desk   |   4 Sep 2015 7:05 AM GMT
అది కానీ నిరూపిస్తే రాజీనామా అంటున్న జగన్
X
ఏపీ అసెంబ్లీ సమావేశాలు యథావిధిగా హాట్.. హాట్ గా సాగుతున్నాయి. గత ఐదురోజుల మాదిరే.. అధికార.. విపక్షాల మధ్య వాద ప్రతివాదనలు.. ఆరోపణలు.. ప్రత్యారోపణలు చోటు చేసుకుంటున్నాయి. నాలుగు రోజులుగా అనుసరించిన వ్యూహానికి భిన్నంగా ఏపీ విపక్షం ‘‘ఓటుకు నోటు’’ కేసును తెరపైకి తీసుకొచ్చింది.

ఈ సందర్భంగా అధికార.. విపక్షాల మధ్య మాటలు తూటాల్లా పేలాయి. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. జగన్ కు ఫోన్ చేశారని.. వారిద్దరూ కలిసి ఏపీ ప్రభుత్వంపై కుట్ర పన్నుతున్నారంటూ చెలరేగిపోయారు. ఈ ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన జగన్.. తనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఫోన్ చేసినట్లు నిరూపిస్తే.. తాను రాజీనామా చేస్తానని.. ఒకవేళ నిరూపించని పక్షంలో చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు.

ఓటుకు నోటు కేసుకు సంబందించిన ఛార్జ్ షీట్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు 22 సార్లు ప్రస్తావించారన్నారు. ఆడియో టేపులో ఉన్నది చంద్రబాబు గొంతు అవునా? కాదా? అన్న తన ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు. తాను అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్నకు కూడా ఏపీ ముఖ్యమంత్రి సమాధానం చెప్పటం లేదంటూ జగన్ మాట్లాడుతుండగా మైక్ కట్ చేసిన స్పీకర్.. ఫ్రశ్నోత్తరాలకు వెళదామని చెప్పటంతో సభలో గందరగోళం చోటు చేసుకుంది.

విపక్ష నేత చేసిన ఆరోపణలకు సమాధానం చెబుతామంటూ ఏపీ అధికారపార్టీ సభ్యులు పట్టుబట్టటంతో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన.. జగన్ ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అక్రమాస్తులకు సంబంధించిన కేసులన్నీ హైదరాబాద్ లో ఉన్న నేపథ్యంలో.. వాటి నుంచి రక్షణ పొందేందుకే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో జగన్ చేతులు కలిపారంటూ ఆరోపించారు. దీనికి విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించటంతో సభలో గందరగోళం చోటు చేసుకుంది. దీంతో.. స్పీకర్ సభను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.