Begin typing your search above and press return to search.

ఆ విష‌యం త‌ప్ప‌.. పాక్ తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం!

By:  Tupaki Desk   |   17 Aug 2016 3:23 PM GMT
ఆ విష‌యం త‌ప్ప‌.. పాక్ తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం!
X
ఆగ‌స్టు 15న ఢిల్లీలోని ఎర్ర‌కోట‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జెండా ఎగ‌రేసి జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌సంగంలో పాకిస్థాన్ ప్ర‌స్థావ‌న తెచ్చారు. కశ్మీరుతోపాటు ఇత‌ర ప్రాంతాల్లో పాక్ సాగిస్తున్న ద‌మ‌కాండ‌ను ఎండ‌గ‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే, ప్ర‌ధాని ప్ర‌సంగం త‌రువాత భార‌త్ - పాక్ ల చ‌ర్చ‌ల ప్ర‌క్రియ‌లో కీల‌క మ‌లుపు చోటు చేసుకుంది. కాశ్మీరు అంశ‌మై చ‌ర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌నీ, చ‌ర్చ‌ల‌కు రండీ అంటూ పాక్ విదేశాంగ మంత్రి అజీజ్ ఆహ్వానం పంపిన సంగ‌తి తెలిసిందే. ఐక్యరాజ్య స‌మితి తీర్మానాన్ని పాటిస్తూ క‌శ్మీర్ ప్రాంత స‌మ‌స్య‌పై ఇరు దేశాలూ చ‌ర్చించి, ఒక ఆమోద యోగ్య‌మైన తీర్మానానికి వ‌ద్దామ‌ని పాక్ ప్ర‌తిపాదించింది. ఈ ఆహ్వానంపై భార‌త ప్ర‌భుత్వం స్పందించింది. సీమాంత‌ర ఉగ్ర‌వాదంపై చ‌ర్చ‌లు జ‌రిపేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని భార‌త్ స‌మాధానం ఇచ్చింది. అయితే, కశ్మీరు అంశంపై మాత్రం మ‌న‌దేశం ఆచితూచి జావాబు చెప్పంది!

క‌శ్మీర్ ప్రాంతం భార‌త్‌ లోని అంత‌ర్భాగం - కాబ‌ట్టి దీని గురించి త‌మ‌తో (పాక్‌ తో) ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌లు జ‌ర‌పాల్సిన అవ‌స‌రం మాకు లేదంటూ ధీటుగా స్పందించింది. ఈ మేర‌కు పాక్ లోని భార‌త హైక‌మిష‌న‌ర్ గౌత‌మ్ బంబావాలే ఒక లేఖ‌ను బుధ‌వారం నాడు పాక్ విదేశాంగ కార్య‌ద‌ర్శికి పంపారు. సీమాంతర ఉగ్ర‌వాదాన్ని అరిక‌ట్టేందుకు భార‌త్ చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని, దీనిపై చ‌ర్చించేందుకు ఇస్లామాబాద్ వ‌ర‌కూ భార‌త్ వ‌స్తుంద‌ని ఆ లేఖ‌లో పేర్కొన్నారు.

భార‌త్ వ్యూహాత్మ‌కంగానే స్పందించ‌ద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆక్ర‌మిత కశ్మీరు - బెలుచీస్థాన్‌ - గిల్లిట్ ప్రాంతాల్లో కూడా పాకిస్థాన్ ద‌మ‌న‌కాండ‌ను కొన‌సాగిస్తోంది. దీన్ని ఎత్తి చూపాల‌న్న ఎత్తుగ‌డ‌తోనే పాక్ ఆహ్వానంపై భార‌త్ ఆ విధంగా స్పందించింద‌ని అంటున్నారు. ఈ ఉద్దేశంతోనే పంద్రాగ‌స్టు నాడు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా జాతిని ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ పాకిస్థాన్ వైఖ‌రిపై విమ‌ర్శ‌లు చేశారు. క‌శ్మీరు యువ‌త గురించి కూడా మాట్లాడారు. క‌శ్మీరులో యువ‌త‌ను పెడ‌తోవ ప‌ట్టిస్తున్న‌వారిని ఉపేక్షించేది లేద‌ని విమ‌ర్శిస్తూనే... జ‌న జీవ‌న స్ర‌వంతిలోకి వ‌చ్చేందుకు సిద్ధ‌మైన వారికి అన్ని ర‌కాలుగా సాయం అందుతుంద‌న్న సంకేతాలు కూడా ఇచ్చారు. కాగా, ఈ వ్యూహాత్మ‌క స్పంద‌న‌పై పాకిస్థాన్ నుంచి ప్ర‌తిస్పంద‌న రావాల్సి ఉంది.