Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేగా పోటీకి రెడీ.. టీడీపీ ఫైర్ బ్రాండ్ సంకేతాలు...!

By:  Tupaki Desk   |   5 Jan 2023 4:45 AM GMT
ఎమ్మెల్యేగా పోటీకి రెడీ.. టీడీపీ ఫైర్ బ్రాండ్ సంకేతాలు...!
X
నేను మాత్రం ఎందుకు పోటీ చేయ‌కూడ‌దు.. అనేస్తున్న టీడీపీ ఫైర్ బ్రాండ్‌. నిత్యం మీడియాలో ఉంటూ.. వైసీపీపైనా.. ఆ పార్టీ అధినేత సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించే మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న తాజాగా త‌న మ‌న‌సులో ఉన్న మాట‌ను బ‌య‌ట పెట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ప్ర‌త్యక్ష రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా న‌ని.. పోటీ చేస్తాన‌ని.. చెప్పారు. అంతేకాదు.. అసెంబ్లీలోనే వైసీపీ భ‌ర‌తం ప‌డ‌తాన‌ని కూడా ప్ర‌క‌టించారు.

ఈ ప‌రిణామాల‌తో టీడీపీకి మ‌రో నేత దొరికాడని ఆనందించాలి. కానీ, ప‌రిస్థితి అయితే అలా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. ఈయ‌న‌కు 'పేప‌ర్ పులి' మాట పార్టీలోనే ఉంది. 2000 సంవత్స‌రంలో పార్టీ జెండా ప‌ట్టుకుని కార్య‌కర్త మాదిరిగా టీడీపీలోకిప్ర‌వేశించిన బుద్దా వెంక‌న్న‌.. 2009 వ‌ర‌కు సాధార‌ణ కార్య‌క‌ర్త‌గానే ఉన్నారు. అప్ప‌ట్లో దుర్గగుడి వ‌ద్ద ఫ్లైవోవ‌ర్ నిర్మాణానికి సంబంధించి కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో ఆయ‌న రాజ‌కీయంగా ఎలివేట్ అయ్యారు.

ఈ ఫ్లైవోవ‌ర్‌ను మ‌లుపు తిప్పే క్ర‌మంలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను ఆయ‌న రాజ‌కీయంగా వాడుకు న్నారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. ఉద్య‌మాల బాట‌ప‌ట్టారు. ఈ క్ర‌మంలోనే తొలిసారి 2012లో విజ‌య‌వాడ న‌గ‌ర పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. 2014లో పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌..బీసీ వ‌ర్గానికి(న‌గ‌రాలు కులం) ఒక సీటును ఇవ్వాల‌ని చంద్ర‌బాబు యోచించిన‌ప్పుడు.. బుద్దాకు అవ‌కాశం ఇచ్చారు.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఒక వార్డు స‌భ్యుడిగా కానీ, కార్పొరేట‌ర్‌గా కానీ, ప్ర‌జ‌ల మ‌ధ్య గెలిచి ఉండ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే, 2019 ఎన్నిక‌ల్లోనే ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని భావించారు. కానీ, అప్ప‌టికే వైసీపీ నాయ‌కుడు, అప్ప‌టి ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ టీడీపీలో చేర‌డంతో ఆయ‌న‌కు అవ‌కాశం ఇచ్చింది పార్టీ. దీంతో సైలెంట్ అయ్యారు.

ఇక‌, ఇప్పుడు 2024 ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ నియ‌జ‌క‌వ‌ర్గం కోసం.. ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్న మాట వాస్త‌వ‌మే అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌డం అంటే.. కోరి ఒక సీటును వ‌దులుకోవ‌డ‌మేన‌ని అంటున్నారు పార్టీ నాయ‌కులు. ఎందుకంటే.. ఎంత మీడియాముందు అరుపులు కేక‌ల‌తో సంల‌చ‌నం సృష్టించినా.. ప్ర‌జ‌ల మ‌ధ్య బ‌లం లేని నాయ‌కుడుగా బుద్దా వెంక‌న్న పేరు తెచ్చుకోవ‌డ‌మే దీనికి కార‌ణం. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.