Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ కు షాక్‌..కూట‌మికి బ్రేక్‌..ఆ ఇద్ద‌రి ప్ర‌త్యేక జ‌ట్టు

By:  Tupaki Desk   |   5 Jan 2019 4:57 PM GMT
కాంగ్రెస్‌ కు షాక్‌..కూట‌మికి బ్రేక్‌..ఆ ఇద్ద‌రి ప్ర‌త్యేక జ‌ట్టు
X
టార్గెట్ పార్ల‌మెంటు ఎల‌క్ష‌న్స్ అనే అజెండాతో సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా మహాకూటమి ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కూటమిలో భాగస్వామ్యం అవుతారని భావించిన ఎస్పీ - బీఎస్పీలు కాంగ్రెస్‌ కు షాకిచ్చాయి. దేశంలో అత్యధిక లోక్‌ సభ స్థానాలు ఉత్తరప్రదేశ్‌ లోనే ఉన్నాయి. ప్రధాన ప్రాంతీయ పార్టీలైన ఎస్పీ - బీఎస్పీ మాత్రమే కూటమిగా ఏర్పడి సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచేందుకు నిర్ణయించాయి. సమాజ్‌ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ - బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు.

ఢిల్లీలో స‌మాజ్‌ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ - బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు యూపీలో కూటమిగా ఏర్పడాలని నిర్ణయించిన ఇరువురు నేతలు సీట్ల పంపకాలపై చర్చించారు. ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న వీరిద్దరూ యూపీలో బీజేపీ జోరును అడ్డుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. కొద్దిరోజులుగా రహస్య మంతనాలు జరుపుతున్న వీరిద్దరి మధ్య తాజాగా సీట్ల పొత్తు కొలిక్కి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్ నేతృత్వం వహించే కూటమికి దూరంగా ఉండటానికి ఆయా పార్టీల అధినేతలు మెగ్గుచూపారు. 80 ఎంపీ సీట్లున్న యూపీలో ఎస్పీ - బీఎస్పీ కలిసి పోటీ చేయనుండటంతో రాహుల్ గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్‌ కు ఇది భారీ ఎదురుదెబ్బేన‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు.

సమారు గంటన్నరకు పైగా జరిగిన సమావేశం న్యూఢిల్లీలోని మాయావతి నివాసంలో జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఎస్పీ జనరల్ సెక్రటరీ - అఖిలేష్ యాదవ్ సన్నిహితుడు రామ్ గోపాల్ యాదవ్ చర్చలో పాల్గొన్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ లో రెండు పార్టీల పొత్తు దాదాపు ఖరారు కాగా సీట్ల పంపకాలపై త్వరలో ఒక ప్రకటన విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రెండు పార్టీలు సమాన సీట్లలో పోటీచేయనుండగా పశ్చిమ యూపీలో బలంగా ఉన్న ఆర్‌ఎల్డీ లాంటి చిన్న పార్టీలను కలుపుకొని ఎన్నికల బరిలో నిలువనున్నాయి.