Begin typing your search above and press return to search.

ఉత్తరకొరియాపై ట్రంప్ రెక్కీ

By:  Tupaki Desk   |   7 Nov 2017 5:30 PM GMT
ఉత్తరకొరియాపై ట్రంప్ రెక్కీ
X
ఆసియా దేశాల్లో పర్యటన పేరుతో ఉత్తర కొరియా చుట్టూ ఉన్న దేశాల్లో పర్యటిస్తూ రెక్కీ నిర్వహిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆ దేశానికి హెచ్చరికలు జారీ చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉ.కొరియా పొరుగునే ఉన్న దక్షిణకొరియాకు మంగళవారం చేరుకున్న ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడు మూన్‌ జే యిన్‌ తో సమావేశమయ్యారు. అనంతరం సంయుక్తంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ట్రంప్‌ ఉత్తర కొరియాపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర కొరియాతో అణుయుద్ధం వస్తే తమ పూర్తి సైనికశక్తిని వినియోగించి అణిచేస్తామని అన్నారు.

ఉత్తర కొరియా నియంత కిమ్‌ బెదిరింపు ధోరణిని నియంత్రించేందుకు యావత్‌ సైనికశక్తిని ఉపయోగించేందుకు సిద్ధమని - కిమ్‌ బెదిరింపులకు భయపడబోమని ట్రంప్ స్పష్టం చేశారు. సతీమణి మెలానియా ట్రంప్‌తో కలిసి దిగిన ట్రంప్‌ కు అధికారులు రెడ్‌ కార్పెట్‌ తో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక హెలీకాఫ్టర్‌ లో బయల్దేరి ఆ దేశంలోని అతిపెద్ద యూఎస్‌ మిలటరీ బేస్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ మూన్‌తో కలిసి అమెరికా - దక్షిణ కొరియా సైనికులతో సమావేశమయ్యారు. ఉత్తరకొరియా అంశంపై వారితో చర్చించారు.

కాగా, ఐదు దేశాల పర్యటనలో భాగంగా తొలుత జపాన్‌ కు వెళ్లిన ట్రంప్‌ సోమవారం జపాన్‌ ప్రధాని షింజో అబేతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉత్తరకొరియాపై వ్యూహాత్మక సహనం నశిస్తోందంటూ ఆయన వ్యాఖ్యానించారు. తగిన గుణపాఠం చెప్పక తప్పదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసియా దేశాల్లో పర్యటిస్తూ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలపై ఉ.కొరియా నుంచి ఇంకా స్పందన రానప్పటికీ ఆ దేశం కూడా సీరియస్ గానే ఉన్నట్లు అర్థమవుతోంది. తాము కూడా అమెరికా బెదిరింపులకు ఏమాత్రం బెదరబోమని గతంలోనే ఉ.కొరియా తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.