Begin typing your search above and press return to search.

కేసీఆర్ డైలీ ప్రెస్ మీట్ వెనుక అసలు రహస్యం అదేనా?

By:  Tupaki Desk   |   9 Nov 2021 7:41 AM GMT
కేసీఆర్ డైలీ ప్రెస్ మీట్ వెనుక అసలు రహస్యం అదేనా?
X
ప్రజలు తనను నమ్మి అధికారాన్ని చేతికి ఇచ్చారని.. తెలంగాణ రక్షకుడి గా వ్యవహరిస్తానని.. ప్రజల కోసం తన ప్రాణాల్ని సైతం పణం గా ఇచ్చేందుకు తాను సిద్ధమని తరచూ చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్.. అందుకు భిన్నం గా మంత్రుల కు సైతం కలవలేని సిత్రమైన పరిస్థితి ఉంటుంది. ఆయన ఎవరి మీదనైనా టార్గెట్ చేయాలంటే.. ఆ వెంటనే సామాన్యుడు సైతం ఆయన్ను కలుసుకోగలుగుతారు. అంతేనా.. ఆయన ఎవరి మీద నైనా మాటల టార్గెట్ చేయాలని డిసైడ్ అయితే.. ఏపీ నుంచి ఆయనకు పలువురు ఫోన్లు చేస్తుంటారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఫోన్ నెంబరు తెలంగాణ ప్రజల కంటే కూడా ఏపీ లోని వారి వద్దే ఎక్కువగా ఉంటుందా? అన్న సందేహం కలిగేలా ఆయన మాటలు ఉంటాయి. ఏదైనా జరిగిన వెంటనే ఏపీ ప్రజలు తమ కు ఎవరూ లేరన్నట్లుగా గులాబీ బాస్ కేసీఆర్ కు ఫోన్ చేసి తాము ఇవ్వాల్సిన ఫీడ్ బ్యాక్ ను ఇచ్చేసే ధోరణి తరచూ షాకులు ఇస్తూ ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్న బీజేపీ అంతు చూసేందుకు తాను రోజువారీగా ప్రెస్ మీట్ పెడుతున్నానని.. తానే స్వయం గా రంగం లోకి దిగినట్లుగా ఆయన తన గురించి చెప్పుకున్నారు.

అమావాస్యకు.. పౌర్ణానికి ఒక సారి కూడా ప్రెస్ మీట్ పెట్టేందుకు ఆసక్తి చూపని కేసీఆర్.. అందుకు భిన్నంగా గడిచిన రెండు రోజులు గా మీడియా భేటీని నిర్వహించటమే కాదు.. ఇవాళ (మంగళవారం) కూడా ప్రెస్ మీట్ ఖాయమంటున్నారు. రోజు వారీగా మీడియా తో మాట్లాడటానికి పెద్ద గా ఇష్టపడని కేసీఆర్.. తన తీరుకు భిన్నంగా రోజువారీ ప్రెస్ మీట్లను ఎందుకు పెడుతున్నట్లు? అన్న ప్రాథమిక ప్రశ్న పలువురిని తొలిచేస్తుంది. దీనికి చాలా సింఫుల్ కారణమంటున్నారు.

ఎవరెన్ని చెప్పినా.. ఆఖర కు కేసీఆర్ చెప్పినా సరే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత గులాబీ దళాల్ని నిస్సత్తువ ఆవహించింది. ప్రజల్లో తమ గ్రాఫ్ పడిపోతుందన్న సందేహం కలిగింది. ఇంతకాలం తమ అందరికి సూపర్ బాస్ అయిన కేసీఆర్ ను చూసుకొని గులాబీ దళం ధీమా గా ఉండేది. హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరు ఫలితం వెలువడిన తర్వాత గులాబీ దళంలో కొత్త దిగులు మొదలైనట్లుగా చెబుతున్నారు. దీనికి తోడు భారీ స్థాయిలో నిర్వహించాలని భావించిన విజయగర్జన సభ తేలిపోయే ప్రమాదం ఉందన్న విషయాన్ని గ్రహించారు.

అందుకే తానే రంగం లోకి దిగి.. రాజకీయ ప్రత్యర్థుల్ని రోజువారీగా కడిగిపారేసేలా సంచలన వ్యాఖ్యలు చేయటం ద్వారా.. గులాబీ బ్యాచ్ లో ధైర్యాన్ని నింపటమనే ప్రాథమిక లక్ష్య సాధన కోసమే ఈ మీడియా భేటీలని చెబుతున్నారు. ఇప్పటికే ఒకసారి వాయిదా వేసి.. ఈ నెలాఖరుకు నిర్వహించే విజయ గర్జన సభకు భారీగా జన సమీకరణ చేసేందుకు వీలుగా నేతల్లో హుషారును నింపటం.. తనను తప్పు పట్టే విపక్షాలకు మూకుమ్మడి పంచ్ లు ఇచ్చేలా వ్యాఖ్యలు చేయటం ద్వారా గులాబీ పార్టీని ఫాలో అయ్యే వారికి ఎదురయ్యే ప్రశ్నలకు తగిన సమాధానాల్ని తన ప్రెస్ మీట్ ద్వారా ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ రోజు వారీ ప్రెస్ మీట్ల సందడి విజయ గర్జన సభ వరకు సాగే అవకాశం ఉందంటున్నారు. ఏ పనిని రోటీన్ లో భాగంగా చేసుకోవటం అలవాటు లేని గులాబీ బాస్.. రోజు వారీ ప్రెస్ మీట్ లను మాత్రం నిర్వహించగలుగుతారా?