Begin typing your search above and press return to search.

ప్రీ లాంచ్ రియల్ బుడగ పేలనుందా?

By:  Tupaki Desk   |   31 July 2022 8:30 AM GMT
ప్రీ లాంచ్ రియల్ బుడగ పేలనుందా?
X
రూ.60 లక్షల ఫ్లాట్ రూ.40 లక్షలకే ఇస్తాం. కాకుంటే.. అనుమతులు రాక ముందే.. ఆ మాటకు వస్తే లే ఔట్ వేయకముందే.. కాగితాల మీద కలల ఇంటిని చూపించి డబ్బులు దండుకోవటమే ప్రీలాంచ్ ఆఫర్ గా చెప్పాలి. ఇలాంటివి బడా బడా సంస్థలు భారీగా హైదరాబాద్ లో ప్రాజెక్టులు చేపట్టాయి. దాదాపు మూడేళ్ల నుంచి సాగుతున్న ఈ దందా ఎప్పుడో ఒకప్పుడు కొంప ముంచుతుందన్న ఆందోళనలు ఇప్పుడు నిజమయ్యాయి. తాజాగా అమీన్ పూర్ లో సాహితి ఇన్ ఫ్రా సంస్థ.. ఇదే రీతిలో మూడేళ్ల క్రితం సొంతింటి కలల్ని చూపించి భారీగా డబ్బులు లాగేసింది. ముందుచూపు ఉన్నప్పటికీ.. ఊరించే ఆఫర్ ను వదులుకోకూడదన్న మధ్యతరగతి జీవుల ఆశతో డబ్బులు కట్టేసి ఇప్పుడు కిందా మీదా పడుతున్నారు.

సాహితి ఇన్ ఫ్రాకు లక్షలాది రూపాయిలు చెల్లించి.. ఏళ్లకు ఏళ్లుగా ఎదురుచూస్తున్నా.. చెప్పిన రీతిలో నిర్మాణాలు మొదలు కాకపోవటంతో ఆందోళనకు గురైన బాధితులు తాజాగా సదరు సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లోన సాహితి ఇన్ ఫ్రాటెక్ వెంచర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ సాహితి సర్వనీ ఎలైట్ పేరుతో పది టవర్లను నిర్మిస్తున్నట్లుగా పేర్కొంది. ఇందులో భాగంగా ప్రీలాంచ్ ఆఫర్ అంటూ మూడేళ్ల క్రితం ప్లాట్లను అమ్మటం మొదలు పెట్టింది. కొవిడ్ పేరుతో పనులు ప్రారంభించలేదు. ఆ తర్వాత పత్తా లేదు. ఎప్పుడు అడిగినా సమాధానం సరిగా రాకపోవటంతో.. కొనుగోలుదారులంతా బాధితుల సంఘంగా ఏర్పడి సంస్థ ప్రతినిధుల్ని నిలదీశారు.

ఈ రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని టీటీడీ బోర్డు మెంబరు లక్ష్మీనారాయణ కావటం గమనార్హం. ఆగస్టు ఆరున లక్ష్మీనారాయణతో బాధితులకు సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే.. మూడేళ్ల నుంచి సాహితి సంస్థ తమను మోసం చేస్తోందని ఇప్పటివరకు రూ.1500 కోట్లు వసూలు చేసినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఈ ప్రీలాంచ్ ఆఫర్ దందా ఎలా నడుస్తుందన్న విషయంలోకి వెళితే.. భారీ ఎత్తున భవన సముదాయాల్ని నిర్మిస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రకటలు వేస్తారు. మార్కెట్ ధరతో పోలిస్తే యాభై శాతం తక్కువ ధరకు ఇస్తున్నట్లుగా ఊరిస్తారు.

కాకుంటే.. ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టక ముందే అనుకున్న మొత్తంలో యాభై శాతం తీసుకొని.. మిగిలిన మొత్తాన్ని ప్రాజెక్టు శంకుస్థాపనకు ముందే తీసేసుకుంటారు. ఇలా చేయటం ద్వారా తమకు నిర్మాణ వ్యయం తగ్గుతుందని.. భూమి కొనుగోలు చేసిన సమయంలో డబ్బుల కోసం ఇబ్బందులు తప్పుతాయని చెబుతారు. ఇంత చేసిన దానికి ప్రతిఫలంగా తాము తక్కువ ధరకు ప్లాట్ ను ఇస్తున్నట్లు చెబుతారు. ప్రీలాంచ్ ను పరిమిత కాలంలో పూర్తి చేస్తున్నట్లుగా చెప్పి.. కొద్దిమందికే అని చెప్పి భారీగా వసూళ్లు చేపడతారు.

ప్రీలాంచ్ ఆఫర్ కింద చాలానే సంస్థలు ఇలా డబ్బులు వసూలు చేస్తున్నాయి. అందరూ ఇలానే చేస్తారని చెప్పట్లేదు కానీ.. ఇలాంటి ఆఫర్లతో రిస్కు చాలా ఎక్కువనే చెప్పాలి. అన్ని బాగుంటే సరి. లేదంటే మొత్తానికే మోసం వస్తుందని చెబుతారు. హైదరాబాద్ లో ఇలాంటి ప్రీలాంచ్ ఆఫర్ల కింద భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లుగా రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి తీరు ఏ మాత్రం మంచిది కాదంటున్నారు. మూడు..నాలుగేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారం రానున్న రోజుల్లో సాహితీ సంస్థ మాదిరి మరిన్ని సంస్థలకు చెందిన బాధితులు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

దీనికి కారణం.. నిర్మాణ వ్యయం పెరిగిపోవటం.. ముందుగా అనుకున్న ప్రకారం ఆదాయం లేకపోవటం.. చేతిలో నగదు నిల్వలు తక్కువగా ఉండటంతో పాటు.. తాము వెంచర్ వేసే భూమికి సంబంధించిన లీగల్ సమస్యలతో పాటు.. పరిష్మన్ల విషయంలో వచ్చే తేడాలతో సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో రియల్ సంస్థలు.. జనాల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బును మరికొన్ని చోట్ల భూములు కొనుగోలు చేసి.. వాటికి వచ్చే డిమాండ్ ఆధారంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచన చేస్తారు. ఈ అంచనాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా.. మొదటికే మోసం వచ్చే పరిస్థితి.