Begin typing your search above and press return to search.

అజిత్ పవార్ వెన్నుపోటు వెనుక అసలు కథ ఇదేనా?

By:  Tupaki Desk   |   24 Nov 2019 2:30 PM GMT
అజిత్ పవార్ వెన్నుపోటు వెనుక అసలు కథ ఇదేనా?
X
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌కు ఢోకా ఇస్తూ అజిత్ పవార్ బీజేపీకి జైకొట్టడం వెనుక అసలు కారణం పుత్ర ప్రేమని తెలుస్తోంది. పవార్ కుటుంబం నుంచే కొత్త వ్యక్తుల ప్రాబల్యం పెరుగుతుండడంతో తనకు, తన కుమారుడికి భవిష్యత్తులో ప్రయారిటీ తగ్గుతుందన్న ఆందోళనతో ఆయన ఈ స్టెప్ వేశారన్న ప్రచారం ఒకటి మహారాష్ట్ర రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.

శరద్ పవార్‌కు స్వయానా అన్న కొడుకు అజిత్ పవార్. శరద్ పవార్‌కు కొడుకులు లేరు. కుమార్తె సుప్రియా సూలె రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆమె ఎంపీగా ఎక్కువగా దిల్లీకే పరిమితమయ్యారు. పైగా ఆమె కుటుంబం కూడా సింగపూర్‌లో స్థిరపడింది. ఆమె రాష్ట్ర రాజకీయాల్లోకి రారని కూడా శరద్ పవారే స్వయంగా పలుమార్లు చెప్పారు. దాంతో శరద్ పవార్ తరువాత అజితే ఆ పార్టీలో పవర్ సెంటర్‌గా ఉండేవారు. గత 30 ఏళ్లుగా శరద్ పవార్‌కు వెన్నంటే ఉంటూ అజిత్ పార్టీని చూసుకున్నారు. శరద్ జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉన్నా రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అజిత్ పనిచేశారు. దాంతో శరద్ రాజకీయ వారసుడు అజితేనని అంతా అనుకునేవారు. అయితే ఇటీవల శరద్‌ రాజకీయాల నుంచి తప్పుకొంటానని చెబుతున్న సమయంలోనే సుప్రియా సూలే చురుగ్గా వ్యవహరించడం మొదలుపెట్టారు. అంతేకాదు... సుప్రియా చొరవతో శరద్ మరో అన్న అప్పా సాహెబ్ కొడుకు రాజేంద్ర పవార్ కుమారుడు రోహిత్‌ రాజకీయాల్లోకి వచ్చారు.

అజిత్ కుమారుడు పార్థ పవార్ మొన్నటి ఎన్నికల్లో మావల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటే తొలుత పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది. చివరకు అజిత్ పట్టుపట్టడంతో టికెట్ ఇచ్చారు. అదసమయంలో రోహిత్ పవార్‌కు జామ్‌ఖేడ్‌ అసెంబ్లీ నుంచి టికెట్‌ ఇచ్చారు. అజిత్ కుమారుడు పార్థ ఓడిపోగా.. రోహిత్‌ గెలిచారు.

ఈ పరిణామాలన్నీ అజిత్ పవార్‌కు రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలు రేపాయని చెబుతున్నారు. శరద్ పవార్ తదనంతరం తనతో పాటు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకూ ఇబ్బంది వస్తుందన్న ఆందోళనతో ఆయన పార్టీని చీల్చినట్లుగగా చెబుతున్నారు. సుప్రియ అండతో రోహిత్‌ రాష్ట్రరాజకీయాల్లో తనకు కూడా పోటీగా మారే ప్రమాదముందని ఆయన భావించడంతోనే వేరు కుంపటి పెట్టి బీజేపీతో కలిశారంటున్నారు.