Begin typing your search above and press return to search.

అసలు ఎన్టీఆర్ చేసిన తప్పేంటి?

By:  Tupaki Desk   |   23 Oct 2018 4:32 AM GMT
అసలు ఎన్టీఆర్ చేసిన తప్పేంటి?
X
అరవింద సమేత’ ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన తన బాబాయి నందమూరి బాలకృష్ణ గురించి చాలా తక్కువ మాటల్లోనే గొప్పగా చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్. బాలయ్యకు నేరుగా తండ్రి స్థానం ఇచ్చాడు. ఈ వేడుకకు బాలయ్య రావడం చాలా ప్రత్యేకం అన్నట్లు మాట్లాడాడు. మామూలుగా తన సినిమాలకు సంబంధించిన వేడుకల్లో సుదీర్ఘంగా మాట్లాడే ఎన్టీఆర్.. ఈ వేడుకలో మాత్రం బాలయ్యను గౌరవిస్తూ తన ప్రసంగాన్ని నాలుగు నిమిషాల్లో ముగించాడు. ఈ వేడుకలో మాట్లాడాల్సింది ఆయన అంటూ మైకు బాలయ్యకు ఇచ్చేశాడు. ఐతే 18 నిమిషాల పాటు సుదీర్ఘంగా మాట్టాడిన బాలయ్య తారక్ గురించి ఏదో మొక్కుబడిగా ఒకసారి ప్రస్తావించాడంతే. యూనిట్లో అందరి గురించి మాట్లాడి.. తారక్ గురించి మాత్రమే నామమాత్రంగా అలా ప్రస్తావించడం అతడి అభిమానుల్ని బాధించింది.

బాలయ్య మొత్తం ప్రసంగం చూస్తే.. హరికృష్ణ మరణం నేపథ్యంలో వచ్చిన సానుభూతిని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మలుచుకోవడానికే ఈ వేడుకకు వచ్చాడేమో అనిపించింది జనాలకు. సరిగ్గా బాలయ్య ఈ వేడుకకు రావడానికి ముందే ఆయన తనయురాలు.. చంద్రబాబు కోడలు అయిన నారా బ్రాహ్మణి.. ‘అరవింద సమేత’ చూసి ఎన్టీఆర్ నటనను పొగడ్డం.. అతడికి దసరా కానుక పంపడం గురించి వార్తలు రావడం ఆశ్చర్యం కలిగించింది. ఇదంతా చూస్తుంటే.. రాబోయే ఎన్నికల్లో ఎన్టీఆర్ ను పార్టీ కోసం వాడుకోవడానికే పావులు కదుపుతున్నారేమో అనిపిస్తోంది. 2009 ఎన్నికల కోసం తారక్ ను వాడుకుని వదిలేసినట్లే.. మరోసారి చేస్తారేమో అని అతడి అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

ఎన్టీఆర్ కు నందమూరి కుటుంబం అనేది ఒక బలహీనత. చిన్నతనం నుంచి ఆ కుటుంబం నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ పొందని నేపథ్యంలో తనకంటూ ఒక గుర్తింపు వచ్చాక.. వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. బాలయ్య బాబాయి ప్రస్తావన వస్తే అతను చాలా ఎమోషనల్ అయిపోయేవాడు. ఆయన ప్రేమ కోసం తపించేవాడు. ఐతే ఎన్టీఆర్ హీరోగా పెద్ద రేంజికి వెళ్లడం.. బాలయ్య వరుస ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న సమయంలో తాను హిట్లు కొట్టి అభిమానులు జావగారిపోకుండా.. జారిపోకుండా చేయడంలో కీలకంగా ఉన్నాడు. దీంతో ఒక సమయంలో బాలయ్య సహా నందమూరి కుటుంబం అతడిని చేరదీసినట్లే కనిపించింది. కానీ బాలయ్య మళ్లీ ఫామ్ అందుకున్నాక పరిస్థితులు మారాయి. 2009 ఎన్నికల్లో తారక్ ఏమీ ఆశించకుండా పార్టీ కోసం ప్రచారం చేశాడు. ఆ సమయంలో ప్రమాదానికి గురైనప్పటికీ ఆసుపత్రి బెడ్ మీది నుంచి కూడా ప్రచారం చేసిపెట్టాడు. ఇంతా చేస్తే.. ఓటమి తాలూకు క్రెడిట్ అతడి ఖాతాలో ప్రయత్నం చేశారు.

ఇక గత ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచాక ఎన్టీఆర్ ను ఎలా తీసి పడేశారో.. తర్వాతి కొన్నేళ్లలో తెలుగుదేశం వాళ్లే అతడిని ఎలా తొక్కే ప్రయత్నం చేశారో.. అతడి సినిమాలకు వ్యతిరేకంగా ఎలా వ్యతిరేక ప్రచారం చేశారో అందరికీ తెలుసు. కానీ ఎన్టీఆర్ ఎప్పుడూ సంయమనం కోల్పోలేదు. ఒక టీవీ ఛానల్ లో ఎన్టీఆర్ ని ఉద్దేశించి పిల్ల కాకి అనే ప్రోగ్రామ్ కూడా వచ్చింది ... ఆ విషయాన్ని ఎన్టీఆర్ ఫాన్స్ ఎవరు మర్చిపోరు. అయినా తారక్ మాత్రం ఎఫ్పుడైనా మీడియా వాళ్లు బాలయ్య గురించి అడిగితే మంచి మాటలే చెప్పాడు. తమ మధ్య ఏ విభేదాలు లేవన్నాడు. బాబాయిని గౌరవిస్తూనే వచ్చాడు. కానీ అవతలి వైపు నుంచి మాత్రం ఇలాంటి పరిణతి కనిపించలేదు. అతడి పట్ల ప్రేమాభిమానాలు లేవు. తన తండ్రి మరణం నేపథ్యంలో బాలయ్య అంత్యక్రియల సమయంలో అండగా నిలవడంతో తారక్ కరిగిపోయి మళ్లీ బాబాయికి చేరువయ్యే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే బాలయ్యను ‘అరవింద సమేత’ విజయోవత్సవ వేడుకకు పిలిచి గౌరవించాడు. కానీ బాలయ్య తీరు చూస్తే మనస్ఫూర్తిగా ఈ వేడుకకు వచ్చినట్లు కనిపించలేదు. మరోవైపు ఆయన రాక వెనుక వేరే ఉద్దేశాలు కూడా ఉన్నాయేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ విషయంలో బాలయ్య-చంద్రబాబు ఏం చేయబోతున్నారో అని అతడి డైహార్డ్ ఫ్యాన్స్ కలవరపడుతున్నారు.