Begin typing your search above and press return to search.

బాల‌య్య ఖ‌మ్మం టూర్ వెనుక ప‌క్కా ప్లాన్

By:  Tupaki Desk   |   6 Oct 2018 8:09 AM GMT
బాల‌య్య ఖ‌మ్మం టూర్ వెనుక ప‌క్కా ప్లాన్
X
ఖ‌మ్మం జిల్లాలో బాల‌య్య టూర్ ఆస‌క్తిక‌రంగా సాగింది. ఉన్న‌ట్లుండి.. పెద్ద‌గా ప్ర‌చార ఆర్భాటం లేకుండా.. ఉత్సాహ‌పూరిత వాతావ‌ర‌ణంలో సాగిన బాల‌కృష్ణ టూర్ వెనుక అస‌లు క‌థ వేరే ఉందంటున్నారు. ఖ‌మ్మం జిల్లా టీడీపీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చేందుకు భారీ వ్యూహాన్ని విజ‌య‌వంతంగా న‌డిపించిన వైనంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది.

ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు కేసీఆర్ తెర తీసిన నేప‌థ్యంలో.. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లకు ఎక్కువ రోజులు లేని ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. పార్టీలో వెనుక‌టి ఉత్సాహ‌న్ని తీసుకొచ్చేందుకు టీడీపీ సీనియ‌ర్ నేత‌లు వేసిన భారీ ప్లాన్లో భాగ‌మే బాల‌కృష్ణ తాజా ప‌ర్య‌ట‌న‌గా చెబుతున్నారు.

బ‌లం ఉన్నా ఉంద‌ని బాహాటంగా చెప్పుకోలేని ప‌రిస్థితి ఉండ‌టం.. నిండా నిరాశ‌తో నిండిన క్యాడ‌ర్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకు వ‌చ్చేందుకు వీలుగా బాల‌కృష్ణ టూర్ ను డిజైన్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఎన్నిక‌ల వేళ ఖ‌మ్మం జిల్లాలో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు వీలుగా.. స‌త్తుప‌ల్లి నుంచి మ‌ధిర వ‌ర‌కూ ప‌లుచోట్ల ఎన్టీఆర్ విగ్ర‌హాల ఓపెనింగ్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు.

ఎవ‌రూ వేలెత్తి చూపించ‌లేని రీతిలో ఉన్న ఈ ప‌ర్య‌ట‌న‌లో ఎన్టీఆర్ కుమారుడు క‌మ్ టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ స్వ‌యంగా హాజ‌రు కావ‌టం.. త‌న తండ్రి విగ్ర‌హాన్ని ప్రారంభించ‌టం చేశారు. ప‌నిలో ప‌నిగా.. ఎన్టీఆర్ హ‌యాంలో జ‌రిగిన అభివృద్ధి గురించి జ‌రిగిన విష‌యాల్ని జ‌రిగిన‌ట్లు చెప్పుకొచ్చారు. పార్టీ జెండా కంటే.. ఎన్టీఆర్ అజెండానే ఎక్కువ‌గా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ.. త‌న తాజా ప‌ర్య‌ట‌న‌తో నిద్రాణంలో ఉన్న టీడీపీ క్యాడ‌ర్ లో కొత్త ఉత్స‌హాన్ని నింప‌ట‌మే కాదు.. ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌య్యేలా చేశార‌ని చెప్పాలి.

టీడీపీకి ఉన్న ఒకే ఒక్క తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర ప్రాతినిధ్యం వ‌హించే స‌త్తుప‌ల్లితో పాటు.. పార్టీ బ‌లంగా ఉండే నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ క్యాడ‌ర్లోనూ.. నేత‌ల్లో ఉత్సాహం ఉర‌క‌లెత్తేలా చేయ‌టానికి.. ఎన్నిక‌ల వేళ‌.. స‌మ‌ర స్ఫూర్తిగా ముందుకు న‌డ‌వ‌టానికి వీలుగా బాల‌య్య తాజా టూర్ ఎంతో సాయం చేసింద‌న్న మాట వినిపిస్తోంది. బాల‌య్య తాజా టూర్ వెనుక టీడీపీ సీనియ‌ర్ నేత‌లు నామా నాగేశ్వ‌ర‌రావు.. సండ్ర వెంక‌ట వీర‌య్య త‌దిత‌రులు ఉన్న‌ట్లు చెబుతున్నారు. టూర్ స‌క్సెస్ ఫుల్ కావ‌టంపై తెలంగాణ టీడీపీ నేత‌లు ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉండ‌టం కనిపిస్తోంది.