Begin typing your search above and press return to search.

బాబు మాటల్ని బాలయ్య లైట్ తీసుకుంటున్నారా?

By:  Tupaki Desk   |   19 Jan 2020 5:25 AM GMT
బాబు మాటల్ని బాలయ్య లైట్ తీసుకుంటున్నారా?
X
ఏపీ రాజధాని విషయంలో టీడీపీ అధినేత.. ఏపీ విపక్ష నేత చంద్రబాబు చేస్తున్న ఆందోళన విషయంలో ప్రజల్లోనే కాదు.. సొంత వాళ్లు కూడా స్పందించటం లేదా? అంటే అవునన్న సమాధానం వినిపిస్తోంది. గడిచిన నెల రోజులకే పైనే అమరావతి మీద చంద్రబాబు చేస్తున్న ఆందోళనలు అన్ని ఇన్ని కావు. రాజధాని తరలింపుపై ఏపీ సర్కారు యోచిస్తుందే తప్పించి.. ఇంకా ఫైనల్ గా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయానికి తనదైన రాజకీయాన్ని అద్దేసిన చంద్రబాబు వరుస పెట్టి ఆందోళనల్ని నిర్వహిస్తున్నారు.

జోలె పట్టి నిరసనలకు నిధులు వసూలు చేస్తున్నారు. ఎంత ప్రయత్నించినా రాజధాని గ్రామాల్లో తప్పించి.. అమరావతిపై బాబు చేస్తున్న ఆందోళనలకు ఇతర జిల్లాల నుంచి సానుకూల స్పందన రాని పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఈ ఆందోళనలు మరింత పెంచేందుకు వీలుగా తన వియ్యంకుడు.. పార్టీ ఎమ్మెల్యే బాలయ్యను రంగంలోకి దింపాలని బాబు డిసైడ్ అయ్యారు. దీనికి తగ్గట్లే బాలయ్య టూర్ ప్రోగ్రాంను ఖరారు చేసి మీడియాకు రిలీజ్ చేశారు కూడా.

బాలకృష్ణ సీన్లోకి వచ్చి తనదైన శైలిలో మాట్లాడితే.. అంతో ఇంతో మైలేజీ ఉంటుందన్న ఆలోచనలో బాబు ప్లాన్ చేస్తే.. ఊహించని రీతిలో బాబుకు సొంత వియ్యంకుడుకమ్ బావమరిది షాకిచ్చారని చెప్పాలి. పదహారు నుంచి పద్దెనిమిది వరకూ తుళ్లూరు.. మందడం.. నిడమర్రు.. పెదపరిమి.. రాయపూడి.. పెనుమాక.. ఉండవల్లి.. కృష్ణాయపాలెం ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించాలని భావించారు. ఏమైందో కానీ.. బాలయ్య రాలేదు. ఆయన ఎప్పుడు పాల్గొంటారన్న దానిపై తాజాగా సమాచారం బయటకు రాని పరిస్థితి.

బాలయ్య ర్యాలీలు రద్దు అయ్యాయా? లేదా? అన్న విషయం మీద టీడీపీ నేతలు సైతం చెప్పలేకపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను ర్యాలీ చేపట్టకపోతేనే బాగుంటుందన్న ఆలోచనలో బాలకృష్ణ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ కారణంతోనే ఆందోళన కార్యక్రమానికి డుమ్మా కొట్టారని చెబుతున్నారు. రాజకీయ వాతావరణం తమకు ఏ మాత్రం అనుకూలంగా లేనివేళ.. ఆందోళనల్లో పాల్గొని అభాసు పాలయ్యే కన్నా వాయిదా వేసుకోవాలని బాలయ్య డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. అయితే.. ఆయన చేత ఏదోలా అమరావతి ఆందోళనల్లో భాగస్వామ్యం చేయాలని బాబు పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.