Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ కు బుట్టా ఎందుకు హ్యాండ్ ఇస్తున్నారు?

By:  Tupaki Desk   |   16 Oct 2017 9:55 AM GMT
జ‌గ‌న్‌ కు బుట్టా ఎందుకు హ్యాండ్ ఇస్తున్నారు?
X
అధినేత మీద అంతులేని విశ్వాసాన్ని.. న‌మ్మ‌కాన్ని ప్ర‌ద‌ర్శించ‌టం రాజ‌కీయ‌నేత‌ల‌కు తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీదు. పార్టీలో ఉన్నంత కాలం కుక్క కంటే విశ్వాసవంతుల‌మ‌న్న‌ట్లుగా ఉండే నేత‌లు.. ఒక్క‌సారి పార్టీ మారాల‌ని డిసైడ్ అయ్యాక ఎలా త‌యార‌వుతారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

ఒక‌ప్పుడు గ‌తంలో జ‌రిగిన ముచ్చట్ల మీద మాట్లాడటం చాలా ఇబ్బందిగా ఉండేది. సాక్ష్యాలు ఎప్ప‌టిక‌ప్పుడు జ‌నాల ముందుకు తేవ‌టం మ‌హా క‌ష్టంగా ఉండేది. ఇప్పుడా ఇబ్బంది లేదు. ఎంచ‌క్కా యూట్యూబ్‌ ను ఒక్క‌సారి క్లిక్ చేసి.. మ‌నం అనుకున్న‌ది టైప్ చేసి సెర్చ్ కొడితే.. బోలెడ‌న్ని వీడియోలు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యే ప‌రిస్థితి.

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కాళ్ల‌కు మొక్కుతున్న మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ తెలుగు దేశంలో ఉన్న‌ప్పుడు.. ఇదే కేసీఆర్ ను ఎంత‌లేసి మాట‌ల‌న్న‌ది యూట్యూబ్ లో క‌నిపిస్తుంటుంది. ఒక్క త‌ల‌సాని ఏంటి? పార్టీ మారిన ప్ర‌తి ఒక్క‌రికి సంబంధించిన వీడియోలు బోలెడ‌న్ని యూట్యూబ్‌ లో అందుబాటులో ఉన్నాయి. ఈ ముచ్చ‌ట‌ను కాస్త ప‌క్క‌న పెడితే.. తాజా జంపింగ్ నేత‌గా క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక వార్త‌ల్లోకి వ‌చ్చేశారు.

నిజానికి బుట్టా పార్టీ మార‌త‌ర‌న్న మాట ఇప్పుడేం కొత్త కాదు. ఆ మాట‌కు వ‌స్తే.. ఎంపీగా గెలిచిన ఆమె తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. కానీ.. జ‌గ‌న్‌పార్టీ నుంచి జంప్ అయి అధికార తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోతార‌న్న వార్త‌తోనే.. తెలుగు రాష్ట్రాల్లో ఆమె సుప‌రిచితుల‌య్యారు. అప్పుడే బుట్టా రేణుక గురించి అంద‌రికి తెలిసింది.

అది మొద‌లు.. త‌ర‌చూ ఆమె పార్టీ మార‌తార‌న్న వార్త మీడియాలో వ‌స్తూనే ఉంది. వార్త రావ‌టం.. ఆమె ఖండించ‌టం జ‌రిగేది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఆమె పార్టీ మార‌తారంటూ వ‌చ్చే వార్త‌ల్ని అచ్చేయ‌ని జ‌గ‌న్ మీడియా.. ఆమె పార్టీ మార‌న‌ని చేసే ప్ర‌క‌ట‌న‌ను మాత్రం ప్ర‌ముఖంగా అచ్చేయ‌టం అల‌వాటుగా ఉండేది. అందుకు భిన్నంగా ఇటీవ‌ల అంద‌రి కంటే ముందుగా జ‌గ‌న్ మీడియానే.. బుట్టా రేణుక జంప్ కావ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నట్లు పేద్ద వార్త‌ను ప్ర‌చురించారు.

ఎప్పుడు బ‌ట్టా జంప్ కారంటూ వార్త‌లు వేసే జ‌గ‌న్ మీడియా అందుకు భిన్నంగా జంప్ కానున్న‌ట్లుగా క్వ‌శ్చ‌న్ మార్క్ వేసి మ‌రీ అచ్చేయ‌టం చూసిన‌ప్పుడు బుట్టావారు త‌ట్టాబుట్టా స‌ర్దేసుకొని.. సైకిల్ ఎక్కేసేందుకు స‌రంజామాను సిద్ధం చేసుకున్న విష‌యం అర్థ‌మైంది.

మొన్నామ‌ధ్య జ‌రిగిన జ‌గ‌న్ పార్టీ ప్లీన‌రీ సంద‌ర్భంగా అధినేత‌పై అంతులేని విశ్వాసాన్ని ప్ర‌ద‌ర్శించి..త‌న‌ను ఎంపీ చేసిన పార్టీకి ద్రోహం చేయ‌నంటే చేయ‌నంటూ ఆమె చెప్పిన మాట‌లు విన్న‌ప్పుడు రేణుక‌మ్మ మీద చాలామందికి న‌మ్మ‌కం క‌లిగింది. మ‌రి.. ఆ న‌మ్మ‌కాన్ని దెబ్బ తీసేలా ఎందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. ఉన్న‌ట్లుండి సైకిల్ ఎక్కేయాల‌న్న నిర్ణయానికి ఎందుకు వ‌చ్చార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

రేణుక‌మ్మ పార్టీ మార‌టానికి మూడు ప్ర‌ధాన‌మైన కార‌ణాలుగా చెబుతున్నారు. అందులో మొద‌టిది.. త్వ‌ర‌లో జ‌గ‌న్ పాద‌యాత్ర జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో పార్టీకి బ‌ల‌మైన ప‌ట్టు ఉంద‌న్న‌ట్లుగా ఉన్న జిల్లాకు చెందిన కీల‌క‌మైన ఎంపీ పార్టీ మారిపోవ‌టం ద్వారా.. నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయ‌ట‌మ‌ని చెప్పాలి. . మేం విజిలేస్తే వ‌చ్చేయ‌టానికి విపక్ష పార్టీలో చాలామందే ఉన్నార‌న్న సంకేతాన్ని ఇచ్చే వీలుంది కాబ‌ట్టి.. ఇప్పుడే రావాల‌న్న ఒత్తిడికి ఓకే అన్నట్లు చెబుతున్నారు. ఇక‌.. రెండో కార‌ణం రేణుక‌మ్మ భ‌ర్త వ్యాపార‌వేత్త‌.. ఆయ‌న వ్యాపార ప్ర‌యోజ‌నాల‌కు రంగం సిద్ధం కావ‌టం.. వాట‌న్నింటికి ఇప్పుడైతే స‌రైన స‌మ‌యం అని భావించ‌టంగా చెబుతారు. ఈ రెండు కార‌ణాల‌తో పాటు మ‌రో ముఖ్య‌మైన కార‌ణం ఏమంటే.. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో క‌ర్నూలు ఎంపీ సీటుకు టికెట్ కోసం జ‌గ‌న్ పార్టీ నుంచి స్ప‌ష్ట‌మైన హామీ ఇవ్వ‌క‌పోవ‌టం.. అధినేత సైతం అసెంబ్లీకి వెళ్లాల‌ని కోర‌టంపై ఆమె గుర్రుగా ఉన్నార‌ట‌. అసెంబ్లీ వ‌ద్దు.. పార్ల‌మెంటే ముద్దు అని తేల్చి చెప్పార‌ట‌. అయితే.. చూద్దామ‌న్న మాటే కానీ.. క‌న్ఫ‌ర్మ్ చేయ‌క‌పోవ‌టంతో రేణుక‌మ్మ డైల‌మాలో ప‌డ్డార‌ని.. ఇదే స‌మ‌యంలో బాబు అండ్ కో నుంచి క‌ర్నూలు ఎంపీకి టికెట్ ఇస్తామంటూ స్ప‌స్ట‌మైన హామీ ఇవ్వ‌టంతో.. పార్టీ మారేందుకు రేణుక‌మ్మ రెఢీ అయిపోయిన‌ట్లుగా చెబుతున్నారు.