Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ తో పొత్తుపై బాబు క్లారిటీ.. తొంద‌ర‌ప‌డ్డారా?

By:  Tupaki Desk   |   26 Aug 2018 5:26 AM GMT
కాంగ్రెస్ తో పొత్తుపై బాబు క్లారిటీ.. తొంద‌ర‌ప‌డ్డారా?
X
కొన్ని విష‌యాల్లో తొంద‌ర‌ప‌డ‌కూడ‌దు. కానీ.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం కొన్నిసార్లు అదే ప‌నిగా త‌ప్పులు చేయ‌టం క‌నిపిస్తుంటుంది. రాజ‌కీయాల్లో తాను సీనియ‌ర్ ని అని గొప్ప‌లు చెప్పుకునే బాబు.. మోడీ కంటే తానే ముందు ముఖ్య‌మంత్రి అయ్యాన‌ని చెబుతారు. ఎవ‌రు ముందు సీఎం అయ్యార‌న్న‌ది కాదు.. తిరుగులేని అధినాయ‌కుడిగా ఎవ‌రున్నార‌న్న‌ది ముఖ్యం.

సీనియ‌ర్.. జూనియ‌ర్ అన్నట్లుగా అన‌వ‌స‌ర‌మైన మాట‌ల్ని ప్ర‌స్తావిస్తూ . మోడీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ బాబు త‌ప్పులు చేయ‌టం క‌నిపిస్తుంది. తాను మోడీ కంటే ముందే సీఎం అయ్యాన‌ని ప్ర‌స్తావించే ఆయ‌న‌.. మోడీలా పీఎం ఎందుకు కాలేదు? ఆ స‌త్తా లేక‌నే కాలేదా? అని ప్ర‌శ్నిస్తే ఏం స‌మాధానం చెప్ప‌గ‌ల‌రు? ఇలాంటి అన‌వ‌స‌ర‌మైన మాట‌లు మాట్లాడి తిట్లు తినే అల‌వాటు బాబులో పుష్క‌లంగా ఉంద‌ని చెప్పాలి.

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో బాబు ఒంట‌రిగా ఎన్నిక‌ల‌కు వెళితే రెండు ర‌కాలుగా న‌ష్ట‌పోవ‌టం ఖాయం. ఏపీలో ఇప్ప‌టికే బ‌లంగా మారిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుణ్య‌మా అని బాబుకు కొత్త భ‌యం ప‌ట్టుకుంది. ఈ కార‌ణంతోనే ఆయ‌న ముంద‌స్తు వెళ్ల‌టానికి ఎంత‌మాత్రం సాహ‌సించ‌టం లేదు. ఆ మాట‌కు వ‌స్తే తెలంగాణ‌లోనూ త‌న ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెరిగే అవ‌కాశం ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించిన కేసీఆర్ తెలివిగా ముంద‌స్తుకు వెళుతున్నారు.

ఏపీలో ఇప్ప‌టికే ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త జోరుగా ఉన్న నేప‌థ్యంలో ముంద‌స్తుకు వెళ్లే ధైర్యం బాబు చేయ‌లేక‌.. షెడ్యూల్ ప్ర‌కార‌మే ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌ని చెబుతున్న వైనం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఏపీలో కాంగ్రెస్ తో జ‌త క‌డితే ప్ర‌జ‌లు ఛీ కొట్టటం ఖాయం. అదే సూత్రాన్ని తెలంగాణ‌కు అప్లై చేస్తే.. పార్టీ స‌ర్వ‌నాశ‌నం కావ‌టం త‌ప్ప‌దంటున్నారు. ఎందుక‌లా అంటే.. ఇప్ప‌టికే కేసీఆర్ పుణ్య‌మా అని టీడీపీ పూర్తిగా నిర్వీర్య‌మైన ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. ఉనికి కోస‌మైనా కాంగ్రెస్ తో జ‌త క‌ట్టాల్సి ఉంది.

తెలంగాణ‌లో ఉన్న టీడీపీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ తో జ‌త క‌లిస్తే టీఆర్ ఎస్ కు చుక్క‌లు చూపించే వీలుంది. అదే స‌మ‌యంలో క‌నీసం ప‌ది సీట్ల‌లో అయినా టీడీపీ నేత‌లు ఎమ్మెల్యేలు అయ్యే అవ‌కాశం ఉంటుంది. తెలంగాణ‌లో పార్టీ బ‌ట్ట‌క‌ట్టే అవ‌కాశం ఉంటుంది. అయితే.. కాంగ్రెస్ తో పొత్తు విష‌యంపై తెలుగు త‌మ్ముళ్లు తొంద‌ర‌ప‌డి చేసిన ప్ర‌క‌ట‌న‌ల‌తో డిఫెన్స్ లో ప‌డ్డ చంద్ర‌బాబు.. ఒత్తిడికి గురై తాము కాంగ్రెస్ తో పొత్తుకు నో అని ప్ర‌క‌టించేశారు. ఇది బాబు సెల్ఫ్ గోల్ గా అభివ‌ర్ణిస్తున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు కానీ లేకుంటే ఆ పార్టీ ఉనికి సైతం ప్ర‌శ్నార్థ‌క‌మ‌వుతుంద‌న్న మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ తో పొత్తు విష‌యాన్ని తొంద‌ర‌ప‌డి తేల్చేయ‌టం ద్వారా బాబు దిద్దుకోలేని త‌ప్పు చేస్తున్నార‌న్న మాట వినిపిస్తోంది.