Begin typing your search above and press return to search.

బాబు అనుభవం ఇంతేనా..ఎక్కడి గొంగళి అక్కడే!

By:  Tupaki Desk   |   11 March 2019 4:37 AM GMT
బాబు అనుభవం ఇంతేనా..ఎక్కడి గొంగళి అక్కడే!
X
తనది నలభై యేళ్ల అనుభవం అని చంద్రబాబు నాయుడు చెప్పుకోని రోజు అంటూ ఉండదు. ఇలా చెప్పుకోవడమే కాదు..ఇదే ముఖ్యమంత్రి కావడానికి అర్హత అని బాబు చెప్పుకొంటూ ఉంటారు. కనీసం ఎమ్మెల్యేగా గెలవని తన కొడుకును మంత్రిగా చేసుకోవచ్చు కానీ.. ఐదేళ్లు ఎంపీగా - ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు అని కూడా బాబు అనేస్తూ ఉంటారు! అయితే బాబు అనేస్తే సరిపోదు కదా. జనాలు అనుకోవాలి! ఈ సారి ఒంటరి పోరు చేసి నెగ్గితే అప్పుడు తెలుస్తుంది చంద్రబాబుకు. ప్రజలు ఏమనుకుంటారనే అంశం గురించి!

ఇక తన అనుభవం గురించి రోజూ తప్పకుండా చెప్పుకునే చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు తన పార్టీలో పరిస్థితులను చక్కబెట్టుకోకపోవడం - చక్కబెట్టుకోలేకపోతున్నట్టుగా కనిపిస్తుండటం విశేషం. ఎన్నికల నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీలో పరిస్థితి ఏమిటి? మరో వారం రోజుల్లో నామినేషన్లు వేయాల్సిన నేపథ్యంలో తెలుగుదేశం కథేంటి? అనేది పరిశీలిస్తే.. ఆశ్చర్యం కలిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల ఖరారు పూర్తి కాలేదు. తెలంగాణ ఎన్నికలు కాగానే.. విడుదల అవుతుందని చెప్పిన తొలి జాబితా ఇప్పటికి విడుదల కాలేదు. జనవరిలో విడుదల అని చెప్పిన ఈ జాబితాను మరో రెండు మూడురోజుల్లో విడుదల చేయనున్నారట! తొలి జాబితా విడుదల కాకపోవడం పెద్ద విడ్డూరం కాదు కానీ - తెలుగుదేశం పార్టీలో కొన్ని అనూహ్యమైన పేర్లు ఇప్పుడు అభ్యర్థిత్వాల విషయంలో తెర మీదకు వస్తున్నాయి.

నామినేషన్లకు వారం రోజులు ఉన్న నేపథ్యంలో.. పార్టీకి బద్ధ విరోధులను తీసుకుని వారి చేత పార్టీ తరఫున నామినేషన్ వేయించే ఆలోచన చేస్తున్నారట చంద్రబాబు. ఇటీవలే అమలాపురం ఎంపీ రవీంద్ర బాబు రాజీనామా చేసి వెళ్లిపోయారు కదా.. ఆ స్థానంలో అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ను తీసుకుని పోటీ చేయించాలని బాబు అనుకుంటున్నారట!

హర్షకుమార్ దశాబ్దాల రాజకీయంలో తెలుగుదేశం పార్టీ వ్యతిరేకి. గత ఎన్నికలప్పుడు కూడా తెలుగుదేశంలోకి వెళ్లలేదు ఆయన. ఐదేళ్లలో కూడా చంద్రబాబు పాలనను తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు. హర్షకుమార్ పై గతంలో టీడీపీ కూడా అదే రీతిన విరుచుకుపడింది. అలాంటిది ఇప్పుడు ఆయనకే టీడీపీ దక్కే పరిస్థితి కనిపిస్తోందట! అది కూడా వారం రోజుల్లో నామినేషన్ల నేపథ్యంలో హర్షకుమార్ ను తెరమీదకు తెస్తున్నారట!

కేవలం ఆ నియోజకవర్గంలోనే కాదు.. చాలా ఎంపీ టికెట్ల విషయంలో చంద్రబాబు నాయుడు అభ్యర్థుల వెదుకులాటను కొనసాగిస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యేల టికెట్ల విషయంలో కూడా ఇంకా కొత్త కొత్త పేర్లు తెలుగుదేశంలో ఈ వారంలో తెరమీదకు రాబోతున్నాయట. నలభై యేళ్ల అనుభవం అని చెప్పే చంద్రబాబు.. కార్యకర్తలకు విస్మయాలను కలిగించే నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఈ వారం రోజుల్లో.. వారు కాచుకోవాలిక!