Begin typing your search above and press return to search.

బాబు ఢిల్లీ టూర్ వెనుక కారణం ఇదేనా?

By:  Tupaki Desk   |   14 April 2019 10:50 AM GMT
బాబు ఢిల్లీ టూర్ వెనుక కారణం ఇదేనా?
X
ఏపీలో ఎన్నికలు పూర్తి అయ్యాయి. పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న చంద్రబాబు శనివారం ఢిల్లీకి వెళ్లటం.. కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలవటం.. ఏపీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై మాట్లాడటం తెలిసిందే. వీవీ ప్యాట్లలో ఏడు సెకన్లు ఉండాల్సిన స్లిప్పులు మూడు సెకన్లు మాత్రమే ఉన్నాయని.. దీంతో తాము వేసిన ఓటు ఎవరికి పడిందన్న విషయాన్ని చాలామంది చూసుకోలేదన్న వాదనను తెర మీదకు తెచ్చారు.

పోలింగ్ పూర్తి అయిన తర్వాత చంద్రబాబు ఎందుకింత హడావుడి చేస్తున్నారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. చౌకబాబు రాజకీయాలు చేస్తున్నట్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. తాజాగా కేటీఆర్ సైతం ఇదే తరహాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబు తీరు మరోలా ఉంది. శనివారం కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసి ఏపీలో జరిగిన ఎన్నికల మీద ఫిర్యాదు చేసిన ఆయన.. ఆదివారం మరో కార్యక్రమానికి తెర తీశారు.

వివిధ పార్టీలకు చెందిన నేతలతో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈవీఎంల మీద తనకున్న అనుమానాల్ని తెర మీదకు తేవటమే కాదు.. వీవీ ఫ్యాట్లలో 50 శాతం స్లిప్పుల్ని లెక్కించాలన్న డిమాండ్ ను ఆయన తెర మీదకు తెచ్చారు. బాబు ఢిల్లీ టూర్ ఎందుకు? చిల్లర వేషాలు వేస్తున్నారన్న రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు భిన్నంగా బాబు ప్లానింగ్ ఉన్నట్లుంది. ఈవీఎంల విషయంలో తనకున్న అనుమానాల్ని దేశం మొత్తాన్ని అలెర్ట్ చేయటం బాబు ఉద్దేశంగా చెప్పక తప్పదు.

తొలిదశలో పోలింగ్ జరిగింది ఏపీ.. తెలంగాణలోనే. మిగిలిన రాష్ట్రాల్లో చాలా తక్కువ నియోజకవర్గాల్లోనే పోలింగ్ జరిగింది. ఈవీఎంల మీద అనుమానాలు పెంచటం.. మోడీ సర్కారు చేతిలో కేంద్ర ఎన్నికల సంఘం ఆటవస్తువులా మారిందన్న భావనను పెంచేలా చేయటం బాబు ఉద్దేశంగా కనిపిస్తోంది. ఏపీలో జరిగిన ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం తమకు వ్యతిరేకంగా వ్యవహరించిందన్న ఆరోపణను ఇప్పటికే సంధించిన చంద్రబాబు.. తన అనుమానం నిజం అన్న భావన కలిగించేందుకు పలు అంశాల్ని తెర మీదకు తెచ్చారు.

తెలంగాణలో లక్షలాది ఓట్లు తొలగింపుపై సింఫుల్ గా సారీ చెప్పటం ఏమిటి? ఏపీలో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపునకు ప్లాన్ చేసి ఫారం 7ను పెద్ద ఎత్తున ఇచ్చిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలతో పాటు.. పలు అంశాల్ని ఇప్పుడాయన తెర మీదకు తెచ్చారు.

ఒకవిధంగా చూస్తే.. బాబు తన టార్గెట్ ను మోడీ మీదకు మళ్లించటమే కాదు.. కేంద్ర ఎన్నికల సంఘం మీద ఒత్తిడిని పెంచే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారని చెప్పాలి. ఎన్నికలు అయిపోయాయి.. ఫలితాలు వచ్చే వరకూ వెయిట్ చేయటం తప్పించి మరింకేమీ చేయలేరనుకునే వేళ.. తనకు లభించిన సమయాన్ని మోడీని టార్గెట్ చేసేందుకు బాబు ప్లాన్ చేసినట్లుగా చెప్పక తప్పు. మరి.. దీనికి మోడీ బ్యాచ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.