Begin typing your search above and press return to search.

బాబు సుడిగాలి ప‌ర్య‌ట‌న వెనుక సీక్రెట్ రివీల్!

By:  Tupaki Desk   |   18 May 2019 4:49 AM GMT
బాబు సుడిగాలి ప‌ర్య‌ట‌న వెనుక సీక్రెట్ రివీల్!
X
ముఖ్య‌మంత్రి హోదాలో వెళ్లి క‌ల‌వ‌టం వేరు.. ఓట‌మిపాలైన అధికార‌ప‌క్ష అధినేత‌గా వెళ్లి చ‌ర్చ‌లు జ‌ర‌ప‌టం వేరు. ఈ సూక్ష్మాన్ని గుర్తించిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న కొత్త రోల్ ను తానే డిజైన్ చేసుకున్నార‌ని చెప్పాలి. ఏపీలో అధికారం చేజారిపోవటం ఖాయ‌మ‌న్న విష‌యాన్ని గుర్తించిన ఆయ‌న‌.. తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏపీలో చ‌క్రం తిప్ప‌టానికి ఏమీ లేన‌ప్పుడు.. త‌న‌కున్న ఇమేజ్ ను పెట్టుబ‌డిగా పెట్టి.. కేంద్రంలో తాను కోరుకున్న ప్ర‌భుత్వం వ‌చ్చేందుకు తెగ ట్రై చేస్తున్నారు.

ఎన్నిక‌ల పోలింగ్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేయ‌టం.. మ‌రో వారం వ్య‌వ‌ధిలో ఫ‌లితాలు వ‌చ్చేస్తున్న వేళ‌..జాతీయ స్థాయిలో ఎన్డీయే కూట‌మికి వ్య‌తిరేకంగా జ‌ట్టు క‌ట్టేందుకు వీలుగా చంద్ర‌బాబు పావులు క‌దుపుతున్నారు. యూపీఏలో భాగ‌స్వామి అయిన బాబు.. అందులో చేరేందుకు ఇష్ట‌ప‌డ‌ని వ‌ర్గాల్ని ఆక‌ర్షించేందుకు కొత్త ప‌ల్ల‌విని అందుకున్నారు. ఎన్డీయేత‌ర ప్ర‌భుత్వ ఏర్పాటే త‌న ల‌క్ష్యంగా మిత్రుల‌కు చెబుతున్నారు.

మోడీ స‌మ్మోహ‌నాస్త్రం పెద్ద‌గా లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తున్న వేళ‌.. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే స్థానాలు రావ‌ని.. మిత్ర‌ప‌క్షాల అవ‌స‌రం కీల‌కంగా మారుతుంద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అటు ఎన్డీయే కానీ ఇటు యూపీఏకు మిత్రులుగా లేని వారిని ఒక వేదిక మీద‌కు తీసుకురావటం ద్వారా జాతీయ‌స్థాయిలో త‌న రోల్ కీల‌క‌మ‌న్న విష‌యాన్ని బాబు చెప్ప‌క‌నే చెప్పేస్తున్నార‌ని చెప్పాలి. ఫ‌లితాలు రాక ముందే ఎందుకంటే.. దీనికో కార‌ణం లేక‌పోలేదు.

ఇప్పుడంటే బాబును ఏపీ సీఎంగా చూస్తారు. ఆ హోదాలో ఆయ‌న ప‌లువురిని క‌లుస్తున్నారు. అదే.. ఫ‌లితాలు వెల్ల‌డయ్యాక ఓట‌మిపాలైన బాబు చ‌క్రం తిప్పుతానంటే ఎవ‌రూ ఒప్పుకోరు. అదే సీఎంగా ఉన్న‌ప్పుడే చ‌క్రం తిప్పి.. మిత్రుల్ని ఒక కూట‌మిగా మార్చ‌గ‌లిగితే.. త‌మ‌ను క‌లిపిన బాబు ఓడినా.. అంతో ఇంతో గౌర‌విస్తార‌న్న ఆశే.. బాబు చేత భారీ క‌స‌ర‌త్తు చేసేలా చేస్తుందంటున్నారు.

తాజాగా ఎన్డీయేత‌ర కూట‌మి కోసం టూర్ చేస్తున్నారు చంద్ర‌బాబు. తాజా సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లో తొలుత ఢిల్లీకి వెళ్లిన బాబు ఇప్ప‌టికే.. సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి.. ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. ఈ రోజు కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ.. ఎన్సీపీ నేత శ‌ర‌ద్ ప‌వార్ తో చ‌ర్చ‌లు జ‌ర‌పనున్నారు. అనంత‌రం ల‌క్నో చేరుకొని ఎస్పీ అధినేత అఖిలేశ్‌.. బీఎస్పీ అధినేత్రి మాయావ‌తిని క‌ల‌వ‌నున్నారు.ఎన్నిక‌ల ఫ‌లితాల వెల్ల‌డికి ముందే ఒక సూత్ర‌ప్రాయ ఒప్పందానికి చేయించాల‌న్న‌ది బాబు ప‌ట్టుద‌ల‌గా చెబుతున్నారు. ఇప్ప‌టికే కాంగ్రెస్‌.. టీడీపీతో స‌హా మ‌రో 17 పార్టీల‌తో వివిధ అంశాల‌పై నాలుగు సార్లు మీటింగ్ ను విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తున్న వేళ‌.. ఎన్డీయేత‌ర కూట‌మి ఏర్పాటు పెద్ద కష్టం కాదంటున్నారు. సొంత రాష్ట్రంలో ఓట‌మి ఎదురైనా.. ఢిల్లీలో ఏదోలా చ‌క్రం తిప్పాల‌న్న అతృత‌ను బాబు ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లుగా చెప్ప‌క‌తప్ప‌దు. మ‌రి.. బాబు ప్ర‌య‌త్నాలు ఎంత‌వ‌ర‌కు ఫ‌లిస్తాయో చూడాలి.