Begin typing your search above and press return to search.

బాబు కాపు పాలిటిక్సు షురూ..

By:  Tupaki Desk   |   5 March 2017 6:57 AM GMT
బాబు కాపు పాలిటిక్సు షురూ..
X
కాపుల ఉద్యమాన్ని సమర్థంగా ఎదుర్కోలేకపోతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆ వర్గాన్ని ఎలాగైనా ప్రసన్నం చేసుకుని ముద్రగడ వల్ల తమకు వచ్చిన వ్యతిరేకత నుంచి బయటపడాలని ట్రై చేస్తున్నారు. అందుకు యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది. కాపుల ఉద్యమానికి ప్రధాన కేంద్రంగా నిలిచిన తూర్పు గోదావరి జిల్లా నుంచే ఈ యాక్షన్ ప్లాన్ అమలుకు ఆయన తెర తీశారు. ఇందుకు ఎమ్మెల్సీ ఎన్నికలనే వేదిక చేసుకున్నారు. అందులో భాగంగానే కాపు నేత - మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. కాపు ఉద్యమనేత - మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు చెక్ పెట్టే వ్యూహంలో భాగంగానే చిక్కాలను ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎంపిక చేసినట్టు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

నిజానికి తూర్పుగోదావరికి జిల్లాకే చెందిన ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప - ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు తదితరులు కమ్మ సామాజికవర్గానికి చెందిన సిటింగ్ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు వైపే మొగ్గు చూపారు. బొడ్డుకు మరోసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అధినేతకు స్వయం గా చెప్పారు. వీరితోపాటు జిల్లాకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు బొడ్డుకు అనుకూలంగా వ్యవహరించారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన మరో నేత - టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ పేరు కూడా ఎమ్మెల్సీ పదవికి ప్రధానంగా వినిపించింది.

అయితే చిత్రంగా చివరి నిముషంలో చిక్కాల అభ్యర్ధిత్వాన్ని చంద్రబాబు తెరపైకి తెచ్చారు. కాపు ఉద్యమం బలంగా సాగుతున్న తూర్పు గోదావరి జిల్లాలో అదే సామాజికవర్గానికి పెద్దపీట వేయడం ద్వారా సదరు సామాజికవర్గాన్ని పార్టీ వైపు తిప్పుకోవచ్చన్న వ్యూహంతో, చివరి వరకు వినిపించని చిక్కాల పేరును అనూహ్యంగా చంద్రబాబు తెరపైకి తేవడం పార్టీ వర్గాలను విస్మయానికి గురి చేసింది. కాపులకు పెద్దపీట వేశారన్న ప్రచారం ప్రజల్లోకి వెళ్లాలంటే చిక్కాలకు ఇవ్వడమే మంచిదని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమైంది.

చంద్రబాబు నెక్స్టు స్టెప్ గా ఎమ్మెల్యేల కోటాలోనూ కాపులకు ప్రయారిటీ ఉంటుందని... మంత్రివర్గ విస్తరణలోనూ కాపులకు ప్రయారిటీ దక్కే ఛాన్సుందని తెలుస్తోంది. మరి చంద్రబాబు గాలాలకు కాపులు పడతారో లేదో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/