Begin typing your search above and press return to search.

జల్లికట్టు మాటే బాబుకు నచ్చట్లేదెందుకు?

By:  Tupaki Desk   |   27 Jan 2017 4:52 AM GMT
జల్లికట్టు మాటే బాబుకు నచ్చట్లేదెందుకు?
X
జల్లికట్టు అన్న మాట వినిపిస్తే చాలు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిరాకు వచ్చేస్తోంది. విలేకరుల సమావేశంలో ఏ ప్రశ్న అడిగినా ఓకే. కానీ.. జల్లికట్టు అన్న మాటతో ప్రశ్న వేస్తుంటే చాలు.. చంద్రబాబు మోములో మార్పు వచ్చేస్తోంది. ప్రశ్న ఏమిటన్నది కూడా ఆలోచించకుండా ఆవేశ పడుతున్న వైనం రోజురోజుకి పెరుగుతోంది. జల్లికట్టు అంటే బాబుకు ఎందుకంత నచ్చట్లేదన్నది ఇప్పుడు ప్రశ్న గా మారింది.

నిజమే.. బాబు లాంటి మైండ్ సెట్ ఉన్న వారికి జల్లికట్టు పదం ఇప్పుడసలు నచ్చదు. ఎందుకంటే నిన్నటి వరకూ జల్లికట్టు అన్నది సంప్రదాయ క్రీడ. కానీ.. ఇప్పుడది తన తీరును మార్చేసుకుంది. జల్లికట్టు ఆట కోసం యావత్ తమిళనాడు ఏకమైంది. జల్లికట్టు కోసం కలిసికట్టుగా వ్యవహరించి.. కేంద్రాన్ని తన మాట వినేలా చేసింది. మరింత కలికట్టుతనం బాబు లాంటి నేతకు ఎందుకు నచ్చుతుంది?

అధికారం అనేది అయితే గియితే తన చేతుల్లోనే ఉండాలి. ప్రతి పనికి వచ్చే క్రెడిట్ తన ఖాతాలోనే పడాలి తప్పించి.. ఇంకెవరికీ పోకూడదన్న వైఖరి ఉండే చంద్రబాబుకు.. జల్లికట్టు లాంటి సమిష్టి విజయానికి ఆయన ఎందుకు ఇష్టపడతారు? తమ వైరుధ్యాలు వదిలేసి.. ఐకమత్యంతో.. చైతన్య స్ఫూర్తిని ప్రదర్శించి తమ డిమాండ్లను సాధించుకునే తీరు బాబు లాంటి నేతకు ఎందుకు నచ్చతుంది?

ఏదైనా చేస్తే తానే చేయాలి. దానికి జనమంతా అబ్బురపడిపోవాలి. మా బాబు కారణ జన్ముడు. ఆయన పుణ్యాన మేమంతా బతుకుతున్నామని కీర్తించాలి. అంతేకానీ.. ఆత్మగౌరవంతో వ్యవహరిస్తాం. అనుకున్నది సాధిస్తాం లాంటి మాటలు ఆయనకు అస్సలు నచ్చవు. అలాంటి చైతన్యం అందరిలోకి వస్తే తాను చెప్పే కట్టుకథల్ని నమ్మే వారు ఎవరూ ఉండరు కదా.

అందుకే.. కలిసికట్టుగా రాజకీయ విభేదాల్ని విడిచిపెట్టి మరీ సాధించుకున్న జల్లికట్టు లాంటివి బాబుకు నచ్చే అవకాశం ఎంతమాత్రం ఉండదు. ఆయనకు.. ఆయన పరివారానికి జల్లికట్టు అంటే ఎద్దుల ఆట మాత్రమే. అవసరమైతే.. దాన్ని తమకు తగ్గట్లుగా మార్చుకొని పందుల ఆటగా మార్చుకొని ఆడుకోవాలన్న సూచన చేస్తారే కానీ.. తమ మనోభావాల్ని దెబ్బ తీసే కేంద్రం మెడలు వంచే ప్రక్రియగా అస్సలు చూడరు. ఒకవేళ చూస్తే.. ఆయన చంద్రబాబు కారన్న వాస్తవాన్ని తాజాగా మరోసారి రుజువు చేశారని చెప్పాలి. అందుకే.. జల్లికట్టు మాట వింటేనే చంద్రబాబు ఒళ్లు జల్లుమంటుంది. ప్రజల్లో చైతన్యం వచ్చేసి.. కలసికట్టుగా ఉంటే.. తన ఆటలు సాగవన్న విషయం గుర్తుకు వస్తుంది. మరి.. ఇలాంటప్పుడు జల్లికట్టు మాట ఎందుకు నచ్చుతుంది చెప్పండి?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/