Begin typing your search above and press return to search.

టీడీపీ ఎంపీల్లో పార్లమెంటేరియన్లే లేరా?

By:  Tupaki Desk   |   17 July 2018 2:30 PM GMT
టీడీపీ ఎంపీల్లో పార్లమెంటేరియన్లే లేరా?
X
విభజన హామీలు సాధించుకోవడం.. కేంద్రంపై ఒత్తిడి తేవడం - కమిట్ చేయించడం.. ఓవరాల్‌ గా ఈ పార్లమెంటు సమావేశాలను సద్వినియోగం చేసుకోవడంపై తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టింది. అయితే... దీనికోసం ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ఆయన బద్ధవిరోధి కాంగ్రెస్ పార్టీ మాజీ నేత - మాజీ పార్లమెంటేరియన్ ఉండవల్లి అరుణ్ కుమార్ సలహాలిచ్చారు. రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి లోక్ సభలో - రాజ్యసభలో ఏమేం చేయాలో సలహాలిచ్చారు. అంతేకాదు... విభజన సమయంలో కేంద్రం వ్యవహరించిన తీరు చెల్లదంటూ అందుకు ఆధారంగా పలు పత్రాలు కూడా చంద్రబాబుకు ఆయన అందించారు. ఇదంతా చూస్తే ఏమనిపిస్తోంది.. తెలుగుదేశం పార్టీ ఎంపీల్లో ఉండవల్లి కంటే మొనగాళ్లు లేరా.. వారు పార్లమెంటేరియన్లు కారా.. వారిలో పసలేకపోవడం వల్లే ఉండవల్లిని ఆశ్రయించాల్సిన పరిస్థితి చంద్రబాబుకు వచ్చిందా అన్నది అంతటా చర్చనీయమవుతోంది.

40 ఏళ్ల అనుభవం ఉన్న నేత నడిపిస్తున్న పార్టీ... ఎన్నోసార్లు రాష్ట్రాన్ని ఏలిని పార్టీ అయిన తెలుగుదేశం నుంచి ప్రస్తుతం లోక్ సభలో 15 మంది ఎంపీలున్నారు - వారు కాక విపక్ష వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన మరో ముగ్గురు కూడా టీడీపీతోనే ఉన్నారు. ఇక రాజ్యసభలోనూ టీడీపీకి 5గురు ఎంపీలున్నారు. మొత్తం కలిపితే 23మంది లెక్కతేలుతున్నారు. మరి ఇంతమంది ఎంపీలుండగా తనను నిత్యం విమర్శించే ఉండవల్లి సలహాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబు తన టీంతో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

రాష్ట్ర విభజన జరిగిన 2014లో రాజ్యాంగానికి విరుద్ధంగా - లోక్‌ సభ నిబంధనలకు వ్యతిరేకంగా విభజన జరిగిందని.. సాక్షాత్తూ ప్రధానమంత్రి మోడీ ఈ విషయాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 7న పార్లమెంటులో ప్రస్తావించారని.. దీంతో... ప్రధాన మంత్రే రాష్ట్రానికి అన్యాయం జరిగినట్లు చెప్పారు కాబట్టి దానిపై షార్ట్‌ నోటీసు ద్వారా వివరణ కోరవచ్చని ఉండవల్లి సూచించారు. ఇదే అత్యంత కీలకమైన సూచన. ప్రధానమంత్రి పార్లమెంటులో మాట్లాడిన అనంతరం ఈ విషయంపై ఉండవల్లి చంద్రబాబుకు లేఖ రాశారు. అయితే.. ఉండవల్లితో ఉన్న పెళుసైన సంబంధాల కారణంగా చంద్రబాబు దాన్ని పట్టించుకోలేదు. కానీ.. ఉండవల్లి జులై 7న మరోలేఖ రాశారు. దీనిపై స్పందించిన సీఎం అందుకు సంబంధించిన అఫిడవిట్లను ఈ-మెయిల్‌ కు పంపాల్సిందిగా ఉండవల్లిని కోరారు. దీంతో ప్రధానమంత్రి - రాష్ట్రపతి కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లను ఈ-మెయిల్‌ ద్వారా పంపించారు ఉండవల్లి. అవన్నీ చూశాక.. చంద్రబాబుకు ఉండవల్లి అవసరం కనిపించినట్లుంది... వెంటనే ఆయన్నుపిలిచి మాట్లాడారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై అనుసరించాల్సిన వ్యూహం - జీరో అవర్‌ - షార్ట్‌ నోటీసులు ద్వారా రాష్ట్ర విభజన అంశాలను ప్రస్తావించేందుకు సమావేశాలను సద్వినియోగం చేసుకోవడం ఎలాగో చంద్రబాబుకు ఉండవల్లి వివరించారట. పనిలోపనిగా చంద్రబాబు ఉండవల్లితో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు వ్యూహాలపై కూడా చర్చించినట్లు సమాచారం.