Begin typing your search above and press return to search.

బాబుకు డిజైన్లు అందుకే న‌చ్చ‌ట్లేద‌ట‌

By:  Tupaki Desk   |   15 Sep 2017 6:11 AM GMT
బాబుకు డిజైన్లు అందుకే న‌చ్చ‌ట్లేద‌ట‌
X
అంత‌ర్జాతీయంగా పేరొందిన ఒక సంస్థ‌.. ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించే ప్రాజెక్టు విష‌యంలో ఎంత కేర్ ఫుల్ గా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. మ‌రి.. అలాంటి సంస్థ ఏపీ రాష్ట్ర రాజ‌ధానిలో నిర్మించే అసెంబ్లీ.. హైకోర్టు భ‌వ‌నాల డిజైన్ల విషయంలో ఎంత జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుంటారు. క‌ళ్లు చెదిరిపోయేలా ఉన్న న‌మూనాలు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అస్స‌లు న‌చ్చ‌లేదు. ఎందుక‌లా జ‌రిగింది? అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న డిజైన్లు బాబుకు న‌చ్చ‌క‌పోవ‌టం వెనుక అస‌లు క‌థేంది? అన్న విష‌యంలోకి వెళితే..

అమ‌రావ‌తిలో నిర్మించే అసెంబ్లీ.. హైకోర్టు భ‌వ‌నాల‌కు సంబంధించి లండ‌న్‌కు చెందిన నార్మ‌న్ ఫోస్ట‌ర్ అండ్ పార్ట‌న‌ర్స్ సంస్థ డిజైన్ల‌ను సిద్ధం చేసింది. వాటిని ప్ర‌ద‌ర్శించారు. ఈ డిజైన్ల‌ను చూసిన చంద్ర‌బాబు పెద‌వి విరిచారు. అసంతృప్తి వ్య‌క్తం చేశారు. త‌న ఆలోచ‌న‌ల్ని అందిపుచ్చుకోలేక‌పోతున్నార‌ని.. తానెన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోలేకపోతున్నారంటూ ఆగ్ర‌హంగా వ్యాఖ్యానించ‌టం అక్క‌డి వారిని షాక్‌ కు గురి చేసింది.

డిజైన్ల‌లో కొన్ని అంశాలు బాగున్నా.. రెండు భ‌వ‌నాల బాహ్య రూపం అంత గొప్ప‌గా ఉండ‌టం లేద‌ని నార్మ‌న్ పోస్ట‌ర్ ప్ర‌తినిధుల‌కు బాబు స్ప‌ష్టం చేయ‌టంతో వారు తెల్ల‌ముఖం వేయాల్సి వ‌చ్చింది. మ‌రింత స‌మ‌యం తీసుకొని అద్భుత‌మైన డిజైన్లు సిద్ధం చేయాల‌ని బాబు చెప్ప‌టంతో ఈ నెల 30 జ‌ర‌గాల్సిన కొత్త హైకోర్టు.. అసెంబ్లీ భ‌వ‌నాల శంకుస్థాప‌న వాయిదా వేశారు.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి వ‌ద్ద నుంచి స‌ల‌హాలు తీసుకోవాల‌ని.. అవ‌స‌ర‌మైతే రాజ‌మౌళిని లండ‌న్‌ కు పంపి డిజైన్ల రూప‌క‌ల్ప‌న‌లో స‌ల‌హాలు.. సూచ‌న‌లు ఇవ్వాల‌ని చెప్ప‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. త‌దుప‌రి డెడ్ లైన్‌ ను అక్టోబ‌రు 25కు మార్చారు. ఆ డేట్‌ కి తానే లండ‌న్‌కు వెళ్లి ఫోస్ట‌ర్ కార్యాల‌యాన్ని.. నార్మ‌న్ ఫోస్ట‌ర్ సంస్థ రూపొందించిన డిజైన్ల‌ను చూస్తాన‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.

ఇంత‌కీ.. చంద్ర‌బాబుకు న‌చ్చేలా డిజైన్ల‌ను త‌యారు చేయ‌టంతో నార్మ‌న్ ఫోస్ట‌ర్ సంస్థ ఎందుకు విఫ‌ల‌మ‌వుతుంద‌న్న విష‌యంపై తెలుగుదేశం పార్టీకి చెందిన కొంద‌రు నేత‌లు చేసిన లోగుట్టు వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. డిజైన్ల‌ను ఓకే చేస్తే.. వెంట‌నే నిర్మాణ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టాల‌ని.. అందుకు త‌గిన నిధులు ఇప్పుడు ఏపీ స‌ర్కారు వ‌ద్ద లేవ‌ని.. అందుకే ఇలాంటి వ్యాఖ్య‌లు వస్తున్నాయ‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. ఇప్పుడే కాదు.. మ‌రికొంత కాలం వ‌ర‌కూ బాబుకు డిజైన్లు న‌చ్చే అవ‌కాశం లేద‌ని.. ఒక‌వేళ న‌చ్చినా.. నిర్మాణ ప‌నులు మాత్రం ఈ ఏడాదికి మొద‌ల‌య్యే అవ‌కాశం లేద‌ని.. వ‌చ్చే ఏడాదిలో స్టార్ట్ అవ్వొచ్చ‌న్నారు. ఏదో జ‌రుగుతుంద‌న్న భావ‌న క‌లిగించ‌టంతో పాటు.. నిర్మాణాల‌కు తాను సిద్ధ‌మైనా.. అద్భుత‌మైన డిజైన్లు రాక‌నే ప‌నులు ఆగుతున్నాయ‌న్న భావ‌న క‌లిగించ‌ట‌మే బాబు ఆలోచ‌న‌గా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. బాబు కోరుకునే అద్బుతాన్ని ఆవిష్క‌రించ‌టానికి అధికారులు.. నార్మ‌న్ ఫోస్ట‌ర్ సంస్థ‌ల‌కు చుక్క‌లు క‌నిపించ‌టం ఖాయ‌మంటున్నారు.