Begin typing your search above and press return to search.

బెజ‌వాడ‌లో కేసీఆర్‌ ను బాబు ఎందుకు క‌ల‌వ‌లేదు?

By:  Tupaki Desk   |   28 Jun 2018 10:21 AM GMT
బెజ‌వాడ‌లో కేసీఆర్‌ ను బాబు ఎందుకు క‌ల‌వ‌లేదు?
X
కేసీఆర్ మొక్కుల ప్రోగ్రాంలో భాగంగా మ‌రోసారి ఏపీకి రావాల్సి వ‌చ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డితే తాను చెల్లిస్తాన‌న్న మొక్కుల కోసం గ‌తంలో ఒక‌సారి తిరుమ‌ల‌కు వ‌చ్చిన కేసీఆర్‌.. తాజాగా బెజ‌వాడ‌కు వ‌చ్చి క‌న‌క దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకొని మొక్కు చెల్లించుకున్నారు.

కేసీఆర్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఇద్ద‌రు క‌లుసుకుంటారా? అన్న సందేహం చాలామందికి వ‌చ్చింది. కానీ.. కేసీఆర్ బెజ‌వాడ‌కు వ‌చ్చిన రోజున‌.. చంద్ర‌బాబు శ్రీ‌కాకుళం జిల్లా ప‌ర్య‌ట‌న పెట్టుకోవ‌టంపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేసీఆర్‌ తో భేటీ కాకుండా ఉండేందుకే బాబు ఇలా చేశార‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

విభ‌జ‌న త‌ర్వాత ఇరువురు చంద్రుళ్లు ఎక్క‌డ క‌లిసినా.. మీడియా వారి విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవ‌టం.. ప్ర‌జ‌లు ఆస‌క్తిగా గ‌మ‌నించ‌టం తెలిసిందే. ఇటీవ‌ల ఢిల్లీలో జ‌రిగిన నీతి ఆయోగ్ స‌మావేశంలో చంద్రుళ్లు ఇద్ద‌రు క‌ల‌వ‌క‌పోవ‌టం.. బాబు వేరుగా.. కేసీఆర్ వేరుగా ఉండ‌టం చూసిన‌ప్పుడు ఇద్ద‌రి దారులు వేరయ్యాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మైంది.

గ‌తంలో మోడీ స్నేహితుడి హోదాలో చంద్ర‌బాబు ఉంటే.. తాజాగా సీన్ రివ‌ర్స్ అయి.. కేసీఆర్ మోడీకి ర‌హ‌స్య స్నేహితుడిగా మారిన‌ట్లుగా టాక్ న‌డుస్తోంది. ఓవైపు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ పెద్ద పెద్ద మాట‌లు చెబుతూనే.. మ‌రోవైపు మాత్రం అందుకు భిన్నంగా మోడీతో కేసీఆర్ స‌న్నిహితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్పాలి.

గ‌తంలో కేసీఆర్‌ కు అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు ముప్ప‌తిప్ప‌లు పెట్టిన మోడీ.. తాజాగా చ‌డీచ‌ప్పుడు చేయ‌కుండా కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌ కు అపాయింట్ మెంట్ ఇవ్వ‌టం.. బ‌య్యారంలో ఉక్కు ప‌రిశ్ర‌మ‌కు అనుమ‌తి ఇస్తే.. తాము స‌గం డ‌బ్బులు భ‌రిస్తామ‌ని నేరుగా ఆయ‌న‌కే చెప్ప‌టం చూసిన‌ప్పుడు టీఆర్ ఎస్‌.. బీజేపీ మ‌ధ్య బంధం మ‌రింత బ‌ల‌ప‌డిందా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు.

ఇదిలా ఉంటే.. మోడీతో కేసీఆర్ బంధం బ‌ల‌ప‌డే కొద్దీ.. బాబుతో స్నేహం అంతే స్థాయిలో బ‌ల‌హీన ప‌డుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఏపీ ప్ర‌త్యేక హోదా కోసం పార్ల‌మెంటు స‌మావేశాల స‌మ‌యంలో వైఎస్సార్ కాంగ్రెస్.. టీడీపీ చేసిన నిర‌స‌న‌ల‌కు చెక్ చెప్పేలా టీఆర్ ఎస్ ఎంపీలు వ్య‌వ‌హ‌రించార‌న్న విమ‌ర్శ ఉంది. చంద్రుళ్ల మ‌ధ్య గ్యాప్ కు ఇదో కార‌ణ‌మైతే.. తాజాగా మోడీకి కేసీఆర్ స‌న్నిహితం అవుతున్నార‌న్న మాట‌తో పాటు.. రాజ‌కీయంగా ఇరువురి దారులు వేర‌య్యాయ‌ని.. అందుకే ఏపీకి వ‌చ్చిన కేసీఆర్‌ను చూసుకునే బాధ్య‌త త‌న మంత్రివ‌ర్గంలోని మంత్రికి అప్ప‌గించిన చంద్ర‌బాబు.. త‌న దారిన తాను శ్రీ‌కాకుళం వెళ్లార‌ని చెబుతున్నారు. కేసీఆర్ ఏపీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఇద్ద‌రు చంద్రుళ్లు మ‌ళ్లీ క‌లుస్తార‌ని ఆశించిన వారికి ఆశాభంగం క‌లిగింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.