Begin typing your search above and press return to search.

బాబుకు ఎందుకంత ప్రేమ..!

By:  Tupaki Desk   |   1 Sep 2018 4:34 AM GMT
బాబుకు ఎందుకంత ప్రేమ..!
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి నందమూరి కుటుంబంపై ఎందుకంత ప్రేమ పుట్టింది. హఠాత్తుగా ఆయన గొప్ప మానవతావాదిగా... కుటుంబ సభ్యునిగా మారిపోయారు...? ఈ అంశమే తెలుగు రాష్ట్రాల ప్రజలను వేధిస్తోంది. తన బావమరిది హరిక్రిష్ణకు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ప్రత్యేక హెలీకాఫ్టర్‌ లో తన కుమారుడు - ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కలిసి కామినేని ఆసుపత్రికి చేరుకున్నారు చంద్రబాబు నాయుడు. అక్కడి నుంచి హరిక్రిష్ణ పార్దీవ దేహానికి అంతిమ సంస్కారం జరిగే వరకూ చంద్రబాబు నాయుడు అక్కడే ఉన్నారు. అన్నీ తానే అయి చకచకా పనులు చేపట్టారు. ఎన్నడూ లేనిది హరిక్రిష్ణ పాడెను కూడా భుజానికెత్తుకున్నారు. ఇంట్లో అందరిని ఓదారుస్తూనే పరామర్శకు వచ్చిన అతిరథ మహారధులను భౌతిక కాయం వద్దకు స్వయంగా తీసుకువెళ్లారు. హరిక్రిష్ణ మరణవార్త తెలియగానే ఆంద్రప్రదశ్‌లో రెండు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను సగం వరకూ అవనతం చేయాలని ఆదేశించారు. ఇలా అన్ని పనులు తానే అయి చేశారు. తమ కుటుంబ సభ్యుడే అయినా ఏ శుభ - అశుభ కార్యాలలోనూ చంద్రబాబు నాయుడు ఇంతలా కలిసిపోలేదు. ఇదే విషయంపై నందమూరి కుటుంబంలో కూడా చర్చ జరుగుతోందని సమాచారం.

ఏ పని చేసినా తనకు కలిసి వచ్చేలా చేయడం చంద్రబాబు నాయుడి నైజం. ఇప్పుడు హరిక్రిష్ణ విషయంలో కూడా అదే జరిగి ఉంటుందని అంటున్నారు రాజకీయ విశ్లేఫకులు. హరిక్రిష్ణ మరణం తర్వాతే ఆయనకు ప్రజల్లో ఉండే హరిక్రిష్ణ అంటే ఎంతటి అభిమానం ఉందో అర్ధం అయ్యిందంటున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలను హరిక్రిష్ణ మరణం కలచి వేసింది. ఆయన ముక్కుసూటి మనిషి కావడంతో తెలుగు ప్రజలు ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇది గమనించిన చంద్రబాబు నాయుడు భవిష్యత్ రాజకీయాలను ద్రష్టిలో ఉంచుకుని ఇలా వ్యవహరించారని పరిశీలకులు అంటున్నారు. తన తండ్రికి ఉన్న ఫాలోయింగ్ చూపిన జూనియర్ ఎన్టీఆర్ - కల్యాణ్ రాంలకు కూడా భవిష్యత్ పట్ల ఓ స్పష్టత వస్తుందని పరిశీలకుల అభిప్రాయం. తన తన కుమారుడు లోకేష్‌ ను రాజకీయంగా కీలకం చేయాలనుకుంటున్న చంద్రబాబు నాయుడు తన ఆలోచనలకు హరిక్రిష్ణ కుమారులు అడ్డుతగిలే అవకాశం ఉందనే భావించే ఈ రెండు రోజులు కుటుంబ మనిషిగా వ్యవహరించారంటున్నారు. గత కొంతకాలంగా చంద్రబాబు నాయుడు పట్ల హరిక్రిష్ణ ఆగ్రహంగా ఉన్నారు. ఈ విషయం తన కుమారులిద్దరికి తెలుసునని - దీంతో భవిష్యత్‌ లో జూనియర్ ఎన్టీఆర్ - కల్యాణ్ రామ్‌ ల నుంచి తనకు ఇబ్బందులు వస్తాయేమోనని చంద్రబాబు నాయుడు ఆందోళనలో ఉన్నారని పరిశీలకుల అభిప్రాయం. చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా తనకు కలిసి వచ్చేలాగే చూసుకుంటారని - హరిక్రిష్ణ మరణాన్ని కూడా అలాగే చూసి ఉంటారనేది వారి అభిప్రాయం.