Begin typing your search above and press return to search.

పొత్తు ప‌క్కా అంటూ బాబు భ‌రోసా ఎందుకు?

By:  Tupaki Desk   |   2 March 2018 4:48 AM GMT
పొత్తు ప‌క్కా అంటూ బాబు భ‌రోసా ఎందుకు?
X
ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేవు. ముందుస్తు ముచ్చ‌ట కూడా వెన‌క్కి వెళ్లిపోయిన‌ట్లే. మ‌రి.. ఎప్పుడో జ‌రిగే ఎన్నిక‌ల్లో పొత్తు ప‌క్కా అంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు తెలంగాణ‌లో అదే ప‌నిగా ఎందుకు చెబుతున్న‌ట్లు. గ‌తంలో వారానికి ఒక రోజు తెలంగాణ పార్టీ కోసం కేటాయిస్తాన‌ని చెప్పిన చంద్ర‌బాబు ఇప్పుడు నెల‌కోసారి దృష్టి సారిస్తాన‌ని చెబుతున్న వైనం తెలిసిందే. పార్టీ నేత‌ల‌తో భేటీ సంద‌ర్భంగా పొత్తుల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వ‌ట‌మే కాదు.. తెలుగు త‌మ్ముళ్ల‌కు హుషారు పుట్టించేలా మాట్లాడ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

వచ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వంద‌శాతం పొత్తు ప‌క్కా అన్న మాట చంద్ర‌బాబు నోటి నుంచి రావ‌టం చూస్తే.. ఆయనీ విష‌యంలో ఫుల్ క్లారిటీతో ఉన్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. పొత్తులపై తుది నిర్ణ‌యాన్ని అప్ప‌టి జాతీయ‌.. రాష్ట్ర రాజ‌కీయాల ప‌రిస్థితుల‌కు అనుగుణంగా తీసుకుందామ‌ని చెబుతున్న ఆయ‌న‌.. బీజేపీతో మాత్రం పొత్తు లేద‌న్న విష‌యాన్ని అదే ప‌నిగా స్ప‌ష్టం చేయ‌టం గ‌మ‌నార్హం.

బీజేపీతో పొత్తు ఉంటే పార్టీకి ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న విష‌యం బాబుతో పాటు త‌మ్ముళ్ల‌కు కూడా తెలుసు. పొత్తుపై క‌మ‌ల‌నాథులు ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న‌లు చేసిన నేప‌థ్యంలో.. వాటిని కోట్ చేస్తూ బీజేపీతో రాం రాం మ‌న్న మాట‌ను స్ప‌ష్టం చేసేశారు చంద్ర‌బాబు.

ఇంత‌కీ బాబు నోటి నుంచి పొత్తు మాట అదే ప‌నిగా ఎందుకు వ‌స్తున్న‌ట్లు? అన్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానం వ‌స్తోంది. తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి ఇప్పుడెలా ఉంద‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఒక‌ప్పుడు తెలంగాణ‌లో బ‌ల‌మైన నేత‌లు.. క్యాడ‌ర్ ఉన్న స్థాయి నుంచి ప‌ట్టుమ‌ని పాతిక‌మంది పేరున్న నేత‌లు లేని ప‌రిస్థితి. అంద‌రూ పోగా మిగిలిన వారు చాలా త‌క్కువ‌. వారిలో కూడా రేపో.. మాపో బుట్టా.. త‌ట్టా స‌ర్దేసుకుందామ‌ని రెఢీ అయినోళ్లే ఎక్కువ‌.

ఇలాంటివేళ‌.. పొత్తు మాట బాబు నోటి రాకుంటే ఉగాది పండ‌గ త‌ర్వాత వెళ్లిపోవాల‌ని భావిస్తున్న త‌మ్ముళ్ల‌కు బ్రేకులు వేసేందుకు.. వారి కాళ్ల‌కు ఆశ‌ల బంధ‌నాలు త‌గిలించేందుకే బాబు నోటి నుంచి పొత్తు మాట వ‌చ్చింద‌ని చెబుతున్నారు. బాబు తాజా మాట‌లు చూస్తే టీఆర్ఎస్ తో పొత్తు ఎక్కువ‌గా ఉంద‌న్న సంకేతాన్ని ఇవ్వ‌క‌నే ఇచ్చేశారు. పార్టీ స‌మావేశాల్లో ఆయ‌న మాట్లాడిన మాట‌లు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవ‌కాశం లేద‌నే మాట‌ను చెప్పేయ‌గా.. ఇక మిగిలింది టీఆర్ ఎస్ మాత్ర‌మే.

బాబుతో పొత్తుకు టీఆర్ ఎస్ కు అభ్యంత‌ర‌మేమీ ఉండ‌దు. ఆ మాట‌కు వ‌స్తే.. బాబుకే ఇబ్బంది అంతా. గులాబీ ద‌ళంతో జ‌ట్టు క‌డితే.. అందుకు సంబంధించిన వివ‌ర‌ణ ఏపీ ప్ర‌జ‌ల‌కు బాబు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. పొత్తు మాట‌తో పార్టీ ఉనికిని నిల‌పాల‌న్న త‌ప‌న‌తోనే అదే ప‌నిగా బాబు ప్ర‌స్తావించార‌ని చెబుతున్నారు. పొత్తు పుణ్య‌మా అని నాలుగు ప‌ద‌వులు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో పాటు.. ఎన్నిక‌ల వేళ టికెట్ల సాధ‌న‌కు కొంత ఈజీ అవుతుంద‌న్న ఆలోచ‌నను త‌మ్ముళ్లు చేస్తార‌న్న భావ‌న‌తోనే బాబు ప్ర‌స్తావించి ఉంటార‌ని చెబుతున్నారు. ఏమైనా.. బాబు నోటి నుంచి అదే ప‌నిగా వ‌చ్చిన పొత్తు మాట వెనుక విష‌యం చాలా లోతుగా ఉంద‌న్న అభిప్రాయాన్ని తెలుగు త‌మ్ముళ్లు న‌మ్ముతున్న‌ట్లు క‌నిపిస్తోంది. బాబుకు కావాల్సింది కూడా అదేగా!