Begin typing your search above and press return to search.

చెన్నై వరదల గుట్టు విప్పేశారు

By:  Tupaki Desk   |   1 Jan 2016 6:34 AM GMT
చెన్నై వరదల గుట్టు విప్పేశారు
X
లక్షలాది మంది చెన్నై వాసులకు పీడకలగా మారి.. తమ జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనంత చేదు గురుతుల్ని మిగిల్చిన వరదల గుట్టు తేల్చారు. ఇంత భారీగా వరదలు పోటెత్తటానికి కారణం 2015లో ఏర్పడిన అతి శక్తివంతమైన ఎల్ నినోగా తేల్చారు. భారీ వర్షాలు కారణంగా పెద్ద ఎత్తున వర్షపు నీరు జమ కావటం.. అవి వెళ్లే మార్గాలు అక్రమ కట్టడాల కారణంగా వెళ్లలేక.. నీరు నిలిచిపోవటంతో.. లక్షలాది మంది ప్రజలు నానా యాతన పడాల్సి వచ్చింది. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా పెద్ద ఎత్తున నష్టాల్ని చవిచూడాల్సి వచ్చింది.

ఆధునిక భారతంలో ఒక ప్రకృతి విపత్తు.. అందునా భారీ వర్షాల కారణంగా ఒకేసారి 400కు పైగా ప్రజలు మరణించటం లేదనే చెప్పాలి. అలాంటి దురదృష్టకర పరిస్థితులతో పాటు.. చెన్నైలోని ప్రతిఒక్కరి మీదా ఆర్థిక భారాన్ని మిగిల్చిన ఈ భారీ వర్షాలకు అసలుసిసలు కారణం ఎల్ నినోగా తేల్చారు. ఫ్రాన్స్ కు చెందిన వాతావరణ కేంద్రం చేసిన అధ్యయనం ఈ విషయాల్ని వెల్లడించింది.

చెన్నైలోని భారీ వర్షంతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా ఎదురైన వాతావరణ విపత్తులకు కారణం ఎల్ నినోగా తేల్చారు. కొన్ని చోట్ల భయంకరమైన ఎండ.. దీంతో వర్షం జాడ లేకుండా పోవటంతో కరవు రక్కసి జూలు విదల్చటం చేస్తే.. మరికొన్ని చోట్ల భారీ వర్షాలతో ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేసిన పరిస్థితి. అంతేకాదు.. 2015 సంవత్సరాన్ని అత్యంత వేడి సంవత్సరంగా కూడా తేల్చారు.

ఎల్ నినో గురించి ఏడాది ముందే అంచనా వేసినా.. అది ఇంత పెద్ద స్థాయిలో ప్రభావం చూపిస్తుందని మాత్రం అనుకోలేదు. దీని తీవ్రత ఎంత దారుణంగా ఉందంటే.. ఓపక్క వర్షాలు లేక.. ఎండలతో చెమటలు పట్టిస్తుంటే.. మరోవైపు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని లేహ్ ప్రాంతంలో మైనస్ 16.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతతో ఎముకలు కొరికేసే చలితో జనాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇలా.. ఓవైపు ఎండ.. మరోవైపు భారీ వర్షాలు.. ఇంకోవైపు తీవ్రమైన చలితో ప్రజల్ని చంపేసే పరిస్థితులు నెలకొన్నాయి. మనిషి చేసిన తప్పులు.. అదే మనిషిని ఎంతగా వేధిస్తున్నాయో కదూ.