Begin typing your search above and press return to search.

కేర‌ళ జ‌ర్నీ ప్లాన్ ఎందుకు మారిందో చెప్పారు

By:  Tupaki Desk   |   18 May 2018 9:43 AM GMT
కేర‌ళ జ‌ర్నీ ప్లాన్ ఎందుకు మారిందో చెప్పారు
X
క‌ర్ణాట‌క కాంగ్రెస్‌.. జేడీఎస్ ఎమ్మెల్యేల్ని కేర‌ళ‌కు త‌ర‌లించ‌నున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జ‌రిగిపోయిన‌ట్లుగా ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు చెప్పారు. కానీ.. కేర‌ళ వెళ్లాల్సిన కాంగ్రెస్‌.. జేడీఎస్ ఎమ్మెల్యేలు అనూహ్యంగా హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. ఎందుకిలా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

కేర‌ళ పెట్టాల్సిన క్యాంప్ రాజ‌కీయం హైద‌రాబాద్‌ కు త‌ర‌లించ‌టానికి కార‌ణం లేక‌పోలేదు. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ నేత గులాం న‌బీ అజాద్ స్వ‌యంగా వెల్లడించారు. త‌మ ఎమ్మెల్యేల్ని బీజేపీ వ‌ర్గాలు భ‌య‌భ్రాంతుల‌కు గురి చేయ‌టంతో తాము తొలుత కేర‌ళ వెళ్లాల‌నుకున్న‌ట్లు చెప్పారు.

అయితే.. బెంగ‌ళూరు నుంచి కొచ్చికి వెళ్లేందుకు విమాన ప్ర‌యాణానికి అనుమ‌తి ఇవ్వ‌లేద‌న్నారు. దీంతో.. రోడ్డు మార్గంలో హైద‌రాబాద్‌ కు తీసుకొచ్చిన‌ట్లుగా అజాద్ చెప్పారు. ప్ర‌జాస్వామ్యాన్ని బీజేపీ అప‌హాస్యం చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. హైద‌రాబాద్ లో నిర్వ‌హిస్తున్న క్యాంప్ ను కాంగ్రెస్ నేత‌లు స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

ఎమ్మెల్యేల్లో ఎక్కువ‌మంది ఉన్న పార్క్ హ‌య‌త్ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత టి. సుబ్బిరామిరెడ్డిది కాగా.. మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు ఉన్న తాజ్ కృష్ణ‌.. నోవాటెల్ లు సుబ్బిరామిరెడ్డి బంధువ‌ర్గానికి చెందిన‌వేన‌ని చెబుతున్నారు. త‌మ‌కు చెందిన హోట‌ళ్ల‌తో పాటు.. ర‌క్ష‌ణ ప‌రంగా ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వ‌న్న ఉద్దేశంతోనే క్యాంపు రాజ‌కీయం హైద‌రాబాద్‌ కు మారిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. త‌మ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేల్ని బీజేపీ ప్ర‌లోభ‌పెట్టేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లుగా అజాద్ వెల్ల‌డించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో ఈ రాత్రి త‌ర్వాత హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరుకు వెళ్ల‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. ఎమ్మెల్యేల్ని ఎలా త‌ర‌లించాల‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.