Begin typing your search above and press return to search.

శ్రీ‌దేవిని తేవ‌టానికి 24 గంట‌ల‌పైనే ఎందుకు ప‌ట్టింది?

By:  Tupaki Desk   |   25 Feb 2018 10:39 PM GMT
శ్రీ‌దేవిని తేవ‌టానికి 24 గంట‌ల‌పైనే ఎందుకు ప‌ట్టింది?
X
శ్రీ‌దేవి మ‌ర‌ణ‌వార్త‌ను యావ‌ద్దేశానికి తెలిసిన కాసేప‌టికే భార‌త రాష్ట్రప‌తి ఆమె కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని ప్ర‌క‌టించారు. ప్ర‌ధాని మోడీ సైతం స్పందించారు. బాధతో గొంతు పెగ‌ల్లేద‌న్నారు. వారిద్ద‌రేనా ఏంటి? దేశంలోని ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు.. గ‌వ‌ర్న‌ర్లు.. ఇలా ఒక‌రేంటి? ఇద్ద‌రేంటి? ప‌్ర‌ముఖ‌లంతా త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసిన వారే. శ్రీ‌దేవి మ‌ర‌ణానికి త‌ల్ల‌డిల్లిన వారే.

ఇదంతా ఎందుకు చెప్ప‌టం ఎందుకంటే.. చ‌నిపోయింది మామూలు వ్య‌క్తి కాదు. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి. కానీ.. ఆమె చ‌నిపోయింది దుబాయ్ కావ‌ట‌మే ఇప్పుడొచ్చిన చిక్కంతా. వేరే వాళ్ల కోసం వాయువేగంతో ప‌ని చేసే ల‌క్షణం భార‌తీయుల‌కు ఉంటుంది? కానీ.. భార‌తీయుల కోసం.. వారి ప్ర‌ముఖుల కోసం వేరే దేశాలు అంత‌లా ఉరుకులు ప‌రుగులు తీయ‌టం క‌నిపించ‌దు. అయితే.. ఇప్ప‌టికి అందుతున్న స‌మాచారం ప్ర‌కారం దుబాయ్ లోని భార‌త రాయ‌బార కార్యాల‌యం శ్రీ‌దేవి భౌతిక‌కాయాన్ని త్వ‌ర‌గా ఇండియాకు పంపటానికి తీవ్రంగా కృషి చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. అయితే.. అక్క‌డి చ‌ట్టాల్ని గౌర‌వించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. అందుకు త‌గ్గ‌ట్లుగా జ‌రిగే జాప్యం అనివార్య‌మ‌న్న మాట వినిపిస్తోంది.

శ్రీ‌దేవి మ‌ర‌ణ‌వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన 24 గంట‌ల త‌ర్వాత కూడా ఆమె భార‌త్‌ కు తిరిగి రాక‌పోవ‌టం ఏమిటి? ఆమె మ‌ర‌ణ‌వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన కొద్దిసేప‌టి త‌ర్వాత అంచ‌నా ప్ర‌కారం ఆమె భౌతికాయం ఆదివారం ఉద‌యం 11 గంట‌ల‌కు వ‌చ్చేస్తుంద‌న్న అంచ‌నాలు వినిపించాయి. ఆ త‌ర్వాత అది కాస్తా మ‌ధ్య‌హ్నం ఒంటిగంట‌కు అన్నారు. కాసేప‌టికే స‌ర్దుకొని.. లేదు..లేదు.. సాయంత్రం ఐదారు గంట‌ల‌క‌న్నారు. మ‌ళ్లీ కాసేప‌టికే త‌మ గ‌త ప్ర‌క‌ట‌న‌ల్ని స‌వ‌రిస్తూ.. లేటు నైట్ వేళ వ‌చ్చేయ‌టం ప‌క్కా అన్నారు. కానీ.. ఈసారి టైం మార‌క త‌ప్ప‌లేదు. ఈసారి టైం మాత్ర‌మే కాదు.. డేట్ కూడా మార్చేస్తూ.. సోమ‌వారం ఉద‌యానికి వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించారు. ఈ ఆర్టిక‌ల్ రాసే స‌మ‌యానికి (సోమ‌వారం తెల్ల‌వారుజాము 5.30 గంట‌ల‌కు) ఆమె భౌతిక కాయం భార‌త్‌ కు చేర‌లేదు.

ఎందుకిలా అంటే.. దుబాయ్ చ‌ట్టాల కార‌ణంగా చెబుతున్నారు. దుబాయ్ లో చ‌నిపోయిన విదేశీయుల‌కు తొలుత పోస్ట్ మార్ట‌మ్ జ‌ర‌ప‌టం.. అనంత‌రం దాని విశ్లేష‌ణ పూర్తి చేయ‌టం.. ఆ త‌ర్వాత దుబాయ్ పోలీసులు రంగ ప్ర‌వేశం చేయ‌టం.. మ‌ర‌ణంలో ఎలాంటి సందేహాల‌కు అవ‌కాశం లేద‌ని తేల్చ‌టం.. విచార‌ణ‌ను పూర్తి చేయ‌టం.. ఆ త‌ర్వాత మాత్ర‌మే పార్థిప‌శ‌రీరాన్ని త‌మ దేశం విడిచి వెళ్లేలా చేయ‌టం అక్క‌డి రూల్స్‌. ఇందుకు శ్రీ‌దేవి సైతం మిన‌హాయింపు కాదు.

కాకుంటే.. సామాన్యుడు మ‌ర‌ణిస్తే.. రోజులు ప‌ట్టే తీరుకు భిన్నంగా శ్రీ‌దేవి మ‌ర‌ణవేళ‌.. రోజులో పూర్తి చేసేలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ అందిన స‌మాచారం ప్ర‌కారం చూస్తే ఆసుప‌త్రిలో శ్రీ‌దేవి మ‌ర‌ణాన్ని క‌న్ఫ‌ర్మ్ చేసిన త‌ర్వాత ఆమెకు పోస్ట్ మార్ట‌మ్ నిర్వ‌హించారు. అనంత‌రం ఆమె మ‌ర‌ణానికి సంబంధించి పోలీసు నివేదిక రావాల్సి ఉంది. దుబాయ్ చ‌ట్టాల ప్ర‌కారం ఈ నివేదిక రావ‌టానికి క‌నీసం 24 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని చెబుతున్నారు.

పోస్ట్ మార్టం పూర్తి అయిపోవ‌టంతో శ్రీ‌దేవి భౌతిక‌కాయాన్ని దుబాయ్ లోని పోలీసు ప్ర‌ధాన కార్యాల‌యంలోని మార్చురీలో ఉంచారు. పోలీసు నివేదిక వ‌చ్చాక మ‌రికొన్ని ఫార్మాలిటీస్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. దుబాయ్ ప్ర‌ముఖ మీడియా సంస్థ అయినా ఖ‌లీజా టైమ్స్ రిపోర్ట్ ప్ర‌కారం శ్రీ‌దేవిని భార‌త్‌ కు త‌ర‌లించ‌టానికి ముందు పూర్తి చేయాల్సినముఖ్య‌మైన ఆరు అంశాల్ని ఉటంకిస్తున్నారు. ఆ వార్తా క‌థ‌నం ప్ర‌కారం..

1. శ్రీ‌దేవి మ‌ర‌ణాన్ని తెలియ‌జేసే ఫోరెన్సిక్ రిపోర్ట్ చేతికి వ‌చ్చాక ఆమె శ‌రీరాన్ని ఎంబ్లామింగ్ (శ‌రీరం చెడిపోకుండా ఉంచే ప్ర‌క్రియ‌) చేస్తారు. ఇందుకోసం 90 నిమిషాలు ప‌ట్ట‌నుంది.

2. అనంత‌రం పోలీసులు శ్రీ‌దేవి డెత్ స‌ర్టిఫికేట్‌ ను జారీ చేస్తారు.

3. ఇండియ‌న్ కాన్సులేట్ దుబాయ్ ఆమె పాస్ పోర్ట్‌ ను ర‌ద్దు చేస్తారు

4. ఇమ్మిగ్రేష‌న్ శాఖ అడ్మినిస్ట్రేటివ్ ప్రోసీజ‌ర్స్ ను పూర్తి చేయాలి

5. శ్రీ‌దేవి పార్థిప‌దేహాన్ని వారి కుటుంబానికి అప్ప‌గించేందుకు ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ అనుమ‌తి ఇవ్వాల్సి ఉంటుంది

6. అనంత‌రం ఎయిర్ పోర్ట్‌ కు శ్రీ‌దేవి భౌతిక‌కాయాన్ని త‌ర‌లిస్తారు. ఇప్ప‌టికే సిద్ధంగా ఉన్న ప్రైవేట్ చాఫ్ట‌ర్ లో ఇండియాకు నిర్జీవ అతిలోక సుంద‌రిని తీసుకురానున్నారు.

ఇదంతా చూస్తే.. మిగిలిన మీడియా వ‌ర్గాలు చెబుతున్న‌ట్లుగా సోమ‌వారం ఉద‌యానికి శ్రీ‌దేవి భౌతిక‌కాయం ఇండియాకు తిరిగి వ‌చ్చేట‌ట్లు క‌నిపించ‌టం లేదు. దుబాయ్ లోని కొంద‌రు మీడియా మిత్రుల‌తో మాట్లాడిన‌ప్పుడు అర్థ‌మైందేమంటే.. ఈ రోజు మ‌ధ్యాహ్నానానికి పార్థిప‌దేహం తిరిగి వ‌స్తే అదే గొప్ప‌గా చెబుతున్నారు. నిబంద‌న‌ల్ని ప‌క్కా పాటించే దుబాయ్ దేశంలో.. ఎవ‌రు మ‌ర‌ణించినా ఒక్క‌టే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తార‌ని చెబుతారు. ఈ లెక్క‌న చూస్తే.. సోమ‌వారం సాయంత్రానికి శ్రీ‌దేవి ముంబ‌యికి చేరుకునే అవ‌కాశం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఒక‌వేళ‌.. అంత‌కంటే ముందు వ‌స్తే.. త్వ‌ర‌గా వ‌చ్చిన‌ట్లేన‌న్న‌ది దుబాయ్ మీడియా మిత్రుల మాట‌.