Begin typing your search above and press return to search.

‘భార్య’ గురించి ట్రంప్ మాట విన్నారా?

By:  Tupaki Desk   |   16 Jun 2016 7:27 AM GMT
‘భార్య’ గురించి ట్రంప్ మాట విన్నారా?
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రపం బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా ఖరారైతే.. సదరు అభ్యర్థికి సంబంధించిన పాత విషయాలు చాలానే బయటకు వస్తాయి. ఏయే సందర్భంలో.. ఎలా మాట్లాడింది? అదే విషయం మీద ఆ తర్వాత ఎలా మాట్లాడింది లాంటి ఎన్నో విషయాల్ని బయటకు తీసుకురావటంతో పాటు.. బరిలో ఉన్న అభ్యర్థి వ్యవహారశైలి అర్థమయ్యే విషయాలు చాలానే బయటకు వస్తుంటాయి.

అసలే నోటి తీత ఎక్కువగా ఉండే ట్రంప్ ఎలా మాట్లాడతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన తరచూ మీడియాలో కనిపిస్తూ ఉంటారు. తాజాగా ఆయనకు చెందిన పాత ఇంటర్వ్యూ ఒకటి బయటకు వచ్చింది. భార్యలకు బిజినెస్ పనులు అప్పగించటం ఏమాత్రం మంచిది కాదంటూ ఆయన చేసే వ్యాఖ్యలతో కూడిన ఇంటర్వ్యూతో పాటు.. తన వైవాహిక జీవితంలో తన మాజీ భార్య ఇవానాతో ఎందుకు తెగతెంపులు చేసుకోవాల్సి వచ్చిందన్న విషయాన్ని అందులో పేర్కొనటం విశేషం.

1994లో ఏబీసీ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. భార్యలకు పని అప్పగించటం చాలా ప్రమాదకరంగా చెప్పుకొచ్చారు. తన మాజీ భార్య ఇవానాకు తన వ్యాపార బాధ్యతలు అప్పగించిన తర్వాతే తమ వైవాహిక బంధం విచ్చిన్నమైందని ఆయన పేర్కొనటం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ.. అట్లాంటిక్ సిటీలోని కాసినోస్ లో ఆమెను మేనేజర్ గా నియమించానని.. అప్పటి నుంచి ఆమెలో చాలా మార్పు రావటమే కాదు.. చివరకు విడాకుల వరకూ విషయం వెళ్లిందని పేర్కొన్నారు.

‘‘మీ బిజినెస్ లో భార్యకు పని అప్పగించటం చాలా డేంజర్. తెలివితక్కువతనం కూడా. గతంలో ఇలా చేయటం వల్లే ఇవానాతో నా వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చాయి. బిజినెస్ కు సంబంధించిన కొన్ని విషయాల గురించి ఆమె పెద్ద పెద్దగా మాట్లాడేది. అరిచేది కూడా. ఇవేమీ నాకు నచ్చేవి కావు. భార్యగా ఉన్నప్పుడు ఇవానా చాలా సున్నితంగా వ్యవహరించేది. కానీ.. కంపెనీలో పని అప్పగించిన తర్వాత ఆమెలో సున్నిత స్వభావం మిస్ అయ్యింది’’ అంటూ చెప్పుకొచ్చారు. ఇవానా తర్వాత ట్రంప్ మరికొందరిని పెళ్లాడటం గమనార్హం.