Begin typing your search above and press return to search.

ఈట‌ల పాద‌యాత్ర అందుకే ఆగిందా?

By:  Tupaki Desk   |   25 Sep 2021 12:30 PM GMT
ఈట‌ల పాద‌యాత్ర అందుకే ఆగిందా?
X
భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు రావ‌డంతో టీఆర్ఎస్‌లో తిరుగుబావుటా ఎగ‌రేసి ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుంజుకున్న ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌స్తుతం ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు? ఆయ‌న రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక‌లో గెలిచేందుకు ఎలాంటి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నారు? అనే ఆస‌క్తి పెరుగుతోంది. ఈ ఎన్నిక‌ల్లో విజ‌యాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల ఆశీస్సులు పొందేందుకు ప్రారంభించిన ప్ర‌జా దీవెన యాత్ర మ‌ధ్య‌లోనే ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ పాద‌యాత్ర మ‌ళ్లీ మొద‌ల‌వుతుందా? ఇప్పుడు ఎందుకు దానిపై ఆయ‌న దృష్టి పెట్ట‌డం లేదు? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

త‌న‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండాలి అంటే ఈ ఉప ఎన్నిక‌లో విజ‌యం ఈట‌ల‌కు అత్యావ‌శ్య‌కం. ఈ ఎన్నిక‌ల్లో గెలిచి త‌నకు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంద‌ని చాట‌డంతో పాటు కేసీఆర్ అహంకారాన్ని దెబ్బ‌తీశాన‌నే ఆనందం పొందాల‌ని ఆయ‌న ఆరాట‌ప‌డుతున్నారు. మ‌రోవైపు ఈట‌ల‌ను ఓడించాల‌ని కేసీఆర్ ఎన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తున్నారో రాజ‌కీయ వ‌ర్గాల్లో అంద‌రికీ తెలుసు. ఈ నేప‌థ్యంలో విజ‌య‌మే ల‌క్ష్యంగా జులై 19న ఈట‌ల క‌మాల‌పూర్ మండలం బ‌త్తివానిప‌ల్లె నుంచి పాద‌యాత్ర ప్రారంభించారు. షెడ్యూల్ ప్ర‌కారం అయిదు మండ‌ల‌ల్లోని 126 గ్రామాల మీదుగా 23 రోజుల పాటు ఈ యాత్ర సాగాల్సింది. కానీ 12 రోజుల పాటు 70 గ్రామాల మీదుగా 222 కిలోమీట‌ర్ల యాత్ర పూర్త‌యిన త‌ర్వాత ఈట‌ల అనారోగ్యానికి గురి కావ‌డంతో హైద‌రాబాద్ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా.. ఆయ‌న మోకాలికి వైద్యులు శ‌స్త్రచికిత్స చేశారు.

ఆప‌రేష‌న్ త‌ర్వాత హుజూరాబాద్ చేరుకున్న ఈట‌ల పాద‌యాత్ర‌ను త్వ‌ర‌లోనే కొన‌సాగిస్తాన‌ని ప్ర‌క‌టించారు. కానీ జులై 30న బ్రేక్ ప‌డ్డ పాద‌యాత్ర ఇప్ప‌టికీ తిరిగి మొద‌లు కాలేదు. ఓ వైపు రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ తెలంగాణ వ్యాప్తంగా పాద‌యాత్ర చేస్తుండ‌డంతో ఇప్పుడు ఆ పార్టీ కీల‌క నేత‌లు ప్ర‌జ‌ల దృష్టి మొత్తం దాని మీదే ఉంది. వ‌చ్చే నెల 2న హుజూరాబాద్‌లో బండి సంజ‌య్ తొలి విడ‌త పాద‌యాత్ర ముగుస్తుంది. మ‌రోవైపు క‌రోనా కార‌ణంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక పండ‌గ‌ల సీజ‌న్ త‌ర్వాత అంటే న‌వంబ‌ర్‌లోనో లేదా డిసెంబ‌ర్‌లోనో జ‌రిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో బండి సంజ‌య్ పాద‌యాత్ర ముగిసిన త‌ర్వాత ఉప ఎన్నిక ద‌గ్గ‌ర ప‌డ్డాక ఈట‌ల మ‌ళ్లీ పాద‌యాత్ర‌ను ప్రారంభించే వీలుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇక టీఆర్ఎస్ పార్టీ ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి గ్రామంలో స‌మావేశాలు నిర్వహిస్తూ ప్ర‌జ‌ల‌కు త‌మ‌వైపుగా తిప్పుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ఈ ఎన్నిక‌లో పార్టీని గెలిపించే బాధ్య‌త‌ను భుజాల‌కెత్తుకున్న హ‌రీష్‌రావు.. ఈట‌ల‌పై విమ‌ర్శ‌ల్లో జోరు పెంచారు. ఈ ప‌రిస్థితుల్లో ఇప్పుడు పాద‌యాత్ర నిర్వ‌హించ‌డం ఈట‌ల‌కు క‌లిసి రాద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పాద‌యాత్ర కొన‌సాగిస్తే ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డానికి వీలుండ‌దు. ఈ నేప‌థ్యంలో ఓ నెల త‌ర్వాత ఈట‌ల మ‌ళ్లీ పాద‌యాత్ర మొద‌లెడ‌తార‌ని లేదు అస‌లు ఆయ‌న మ‌ళ్లీ పాద‌యాత్ర చేసే అవ‌కాశ‌మే లేద‌ని భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.