Begin typing your search above and press return to search.

పెట్రోలు ధరల్లో ఇదేం మాయ

By:  Tupaki Desk   |   16 Nov 2015 5:30 PM GMT
పెట్రోలు ధరల్లో ఇదేం మాయ
X
అంతర్జాతీయంగా చమురు ధరల్లో పెరుగుదల లేకున్నా ఇండియాలో మాత్రం పెంచేస్తున్నారు. నిజానికి మన దేశంలో రిఫైన్ చేసిన తరువాత పెట్రోలు ధర రూ.20 కూడా పడకపోయినప్పటికీ వినియోగదారుడుకి చేరే ధర మాత్రం సుమారు రూ.65 ఉంటోంది. అంతర్జాతీయ పరిణామాలు గమనిస్తే అసలు పెట్రోలు ధర పెంచడానికే అవకాశం కనిపించడం లేదు. అయినా భారత్ లో మాత్రం తాజా మరోసారి పెట్రోలు ధర పెంచడం విచిత్రమే.

ప్రపంచంలో ప్రస్తుతం పెట్రోలు ఉత్పత్తి ఎలా ఉందన్న విషయం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సి ఉంటుంది. ఉత్పత్తవుతున్న పెట్రోలు నిల్వ చేయడానికి ఎక్కడా ఖాళీ లేనంతగా నిల్వలు ఉన్నాయట. చివరకు సూపర్ ట్యాంకర్లు - నౌకల్లోని ట్యాంకర్లూ నిండిపోయాయట. ఇంటర్నేషన్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఈఏ) అంచనా ప్రకారం గత నవంబరు 13 నాటికి ప్రపంచవ్యాప్తంగా నిల్వ ఉన్న చమురు 300 కోట్ల బ్యారెల్స్. నిల్వలు పేరుకుపోవడంతో ధర తగ్గింది.. అయినా ఎవరూ ఉత్పత్తి మాత్రం తగ్గించడం లేదట. రష్యా తన చమురు ఉత్పత్తి తగ్గించకపోవడంతో మిగతావారూ పోటీగా ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. అంతేకాదు.... పోటాపోటీగా ధరలు తగ్గిస్తున్నారు. తాజా మార్కెట్ ధరల ప్రకారం బ్యారెల్ చమురు ధర సుమారు 40 డాలర్లుగా ఉంది.

అయితే... అమెరికా,యూరప్ దేశాలలో చలి తీవ్రత ఈసారి తక్కువగా ఉండడంతో చమురు డిమాండు తగ్గింది. చైనా ఆర్థిక వ్యవస్థ కూడా నెమ్మదించడంతో కూడా పరిస్దితి తలకిందులైపోయింది. సంస్థల వద్ద చమురు నిల్వ సామర్థ్యం లేక నానా ఇబ్బందులుపడుతున్నాయి. అద్దె ట్యాంకర్లలో నిల్వ చేయాలంటే ధర బాగాఎక్కువ. 20 లక్షల బ్యారెల్స్ నిల్వ సామర్ద్యమున్న సూపర్ ట్యాంకర్ ఒక రోజు అద్దె లక్ష డాలర్లు.. అంటే రోజుకు 66 లక్షల రూపాయలన్నమాట. అమెరికా - గల్ఫ్ దేశాల రేవులు ఎక్కడ చూసిన చమురు నౌకలే కనిపిస్తున్నాయట. వాటిని అన్ లోడ్ చేయాలంటే భూమి పై సూపర్ ట్యాంకర్లు తగినన్ని ఉండాలి. కానీ, అవి లేవు. అలా అని రేవులోనే ఉంటే రోజువారీ అద్దె పెరిగిపోతుంది. సూపర్ ట్యాంకర్ల నుంచి లారీలు - సాధారణ ట్యాంకర్ల లో తరలించడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రేవుల్లో ఉన్న నౌకల్లోని చమురు అన్ లోడ్ చేయడానికే కనీసం మూడు వారాల టైం పడుతుందట. అంత వరకు అద్దె భరించడం ఆయిల్ కంపెనీలకు కష్టమవుతోంది. అమెరికా - గల్ఫ్ దేశాల్లోని ఓడరేవుల్లో పెద్ద సంఖ్యలో చమురు నౌకలు అన్ లోడింగు కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి అలా ఉంటే ఇండియాలో మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అద్దెలు పెరిగిన కారణాన్ని చూపించి పెట్రోలు ధరలు పెరిగాయంటూ దేశంలో పెట్రోలు ఉత్పత్తుల ధరలు పెంచేశారు. కోరినంత సరకు దొరుకుతుండడంతోపాటు, అసలు గిరాకీయే లేని పరిస్థితుల్లో ధరలు పెంచడాన్ని ఏమనుకోవాలో మరి.