Begin typing your search above and press return to search.

జగన్ అంటే గొట్టిపాటికి విరక్తి వచ్చేసిందా?

By:  Tupaki Desk   |   26 April 2016 9:18 AM GMT
జగన్ అంటే గొట్టిపాటికి విరక్తి వచ్చేసిందా?
X
గొట్టిపాటి రవికుమార్... చూడ్డానికి చిన్నోడే కానీ, ఎమ్మెల్యేగా పదమూడేళ్ల సీనియారిటీ ఉన్న నేత.. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో గొట్టిపాటి రవికుమార్ ది కీలక పాత్రే. యువకుడిగానే ఉన్న రవికుమార్ ఇప్పటికే మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత ఓడిపోనేలేదు. అంతేకాదు.. 2009లో టీడీపీ సీనియర్ నేత కరణం బలరాంను మట్టి కరిపించిన గొట్టిపాటి... మొన్నటి ఎన్నికల్లో కరణం కుమారుడు వెంకటేశ్ ను ఓడించారు.

బలమైన కరణం బలరాం రాజకీయాలను ఎదుర్కొని ఆయనపైన, ఆయన తనయుడినపైన గెలవడం చిన్న విషయం కాదు. దీంతో బలరాం - గొట్టిపాటిల మధ్య రాజకీయ వైరం ఉంది. టీడీపీలో సీనియర్ నేత అయిన బలరాంతో తీవ్ర విభేదాలున్నా కూడా గొట్టిపాటి అదే టీడీపీలోకి ఎందుకు వెళ్లారన్న ప్రశ్న చాలామందికి వస్తోంది. దీనికి కారణం జగన్ తీరేనట... మూడు సందర్భాల్లో జగన్ తీరు వల్ల గొట్టి పాటి హర్టయ్యారట. ఆ కారణంగానే తన ప్రత్యర్థి ఉన్నప్పటికీ టీడీపీలోకి వెళ్లడానికి ఆయన సిద్ధమయ్యారని తెలుస్తోంది.

ఇప్పటిదాకా వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన వారిలో చాలామంది గతంలో టీడీపీలో ఉన్నవారే. అయితే గొట్టిపాటికి మాత్రం ఇప్పటివరకు అసలు టీడీపీతోనే సంబంధాలు లేవు. 2004లో మార్టూరు నుంచి ఎన్నికైన గొట్టిపాటి 2009లో అద్దంకికి మారారు. అక్కడి నుంచి 2004లో కరణం బలరాం, 2009లో కరణం కుమారుడిని చిత్తుచేసిన గొట్టిపాటికి బలరాం కుటుంబంతో రాజకీయవైరం పెరిగిపోయింది.

ఇటీవల సాగర్ నీటి విషయమై తన నియోజకవర్గ పరిధిలో పర్యటనకు వచ్చిన మంత్రికి వినతి పత్రం అందించేందుకు గొట్టిపాటి తన అనుచర గణంతో తరలివెళ్లారు. ఆ సందర్భంగా గొట్టిపాటి - కరణం వర్గాల మధ్య పెద్ద ఘర్షణే చోటుచేసుకుంది. గొట్టిపాటి కారుపై కరణం వర్గం దాడికి దిగింది. అయితే... ఈ దాడిపై మిగతా టీడీపీ నేతలు గొట్టిపాటికి మద్దతుగా నిలిచి, కరణం వర్గం తీరును ప్రశ్నించారు. అది గొట్టిపాటిని టీడీపీకి అనుకూలంగా ఆలోచించేలా చేసింది. టీడీపీ వాళ్లు ఆ పార్టీ నేతను వ్యతిరేకించి తనకు మద్దతిచ్చినా కూడా సొంత పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కనీసం తనను పలకరించకపోవడంతో గొట్టిపాటి చాలా బాధపడ్డారట.

అంతేకాదు... మూడు దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికైన గొట్టిపాటిని జగన్ సీనియర్ ఎమ్మెల్యేగా చూడడం లేదట... అసలు గొట్టిపాటిని పట్టించుకోవడం లేదట. ఇటీవల ఓ సందర్భంలో అద్దంకి నియోజకవర్గానికి చెందిన పార్టీ నేత ఇంటిలో జరిగిన ఓ వివాహానికి వచ్చిన జగన్ తాను వస్తున్న విషయాన్ని గొట్టిపాటికి మాటమాత్రంగానైనా చెప్పలేదు. అది కూడా గొట్టిపాటి మనసును గాయపరిచింది.

మరోవైపు ప్రకాశం జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీకి మెజారిటీ స్థానాలు దక్కడంలో గొట్టిపాటిదే కీలక భూమిక. అయితే తన బాబాయి - ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి అత్యంత ప్రాధాన్యమిచ్చిన జగన్ జడ్పీలో మెజారిటీకి కారణమైన గొట్టిపాటిని కనీసం భుజం కూడా తట్టలేదు. ఈ అన్ని కారణాల వల్ల గొట్టిపాటికి జగన్ అంటే విరక్తి వచ్చేసిందట. ఆ కారణంగానే ఆయన టీడీపీలోకి వెళ్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.