Begin typing your search above and press return to search.

టీడీపీ ఎమ్మెల్యేల గ్రేడింగ్ అస‌లు గుట్టు ఇదే

By:  Tupaki Desk   |   8 Oct 2016 6:25 AM GMT
టీడీపీ ఎమ్మెల్యేల గ్రేడింగ్ అస‌లు గుట్టు ఇదే
X
ఏపీలో అధికార టీడీపీ ఎమ్మెల్యేల‌కు మూడు రోజుల పాటు కేఎల్ వ‌ర్సిటీలో శిక్ష‌ణ త‌ర‌గ‌తులు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ శిక్ష‌ణ త‌ర‌గ‌తుల అనంత‌రం ఎమ్మెల్యేల‌కు చంద్ర‌బాబు సీల్డ్ క‌వ‌ర్ రిపోర్టు అంద‌జేశారు. ఈ సీల్డ్ క‌వ‌ర్ రిపోర్టులు ఇప్పుడు ఏపీలో పెద్ద హాట్ టాపిక్‌ గా మారాయి. ఏ ఎమ్మెల్యేకు ఏ గ్రేడ్ వ‌చ్చింది ? ఏ ఎమ్మెల్యే ప‌నితీరు ఎలా ఉంది ? అనే వివ‌రాల‌ను ఆ ఎనిమిది పేజీల రిపోర్టులో పొందుప‌రిచార‌ట‌.

ఇక ఈ రిపోర్టు వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తే అందుకు సంబంధిత ఎమ్మెల్యే - ఇన్‌ చార్జ్‌ ల‌ను బాధ్యులుగా చేస్తామ‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించ‌డంతో ఈ వివ‌రాలు బ‌య‌ట‌కు రాకుండా ఎమ్మెల్యేలు జాగ్ర‌త్త ప‌డుతున్నారు. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఎనిమిది పేజీల నివేదిక‌లో తొలి పేజీలో ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ఓట‌ర్ల వివ‌రాల‌తో పాటు ఎమ్మెల్యేల‌కు వ‌చ్చిన గ్రేడింగ్ వివ‌రాలు పొందుప‌రిచార‌ట‌.

ఇక రెండో పేజీలో ఎమ్మెల్యేలు - నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ చార్జ్‌ ల బ‌లాలు - బ‌ల‌హీన‌త‌లు - మూడో పేజీలో నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ స్థితిగ‌తులు పేర్కొన్న‌ట్టు స‌మాచారం. ఇక ఆరో పేజీలో ఎమ్మెల్యే అవ్వ‌క ముందు, ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యాక ఎంత తేడాతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న వివ‌రాలు పొందు ప‌రిచార‌ట‌. ఇక ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నా స్పందించ‌క‌పోవ‌డంపై కూడా కొంద‌రు ఎమ్మెల్యేలు - ఇన్‌ చార్జ్‌ ల‌కు చీవాట్లు పెట్టే కామెంట్లు కూడా రాసినట్టు స‌మాచారం.

ఇక గ్రేడ్‌ ల విష‌యానికి వ‌స్తే టాప్ ప‌నితీరు క‌న‌పరిచిన వారికి ఏ గ్రేడ్‌ - కాస్త ప‌నితీరు ప‌ర్వాలేద‌నుకునే వారికి బీ గ్రేడ్‌ - వెన‌క‌బ‌డిన వారికి సీ గ్రేడ్‌ - ప‌నితీరు అధ్వానంగా ఉన్న వారికి డీ గ్రేడ్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఇక ఎమ్మెల్యేల సంగ‌తి కాస్తో కూస్తో ఓకే అనేలా ఇన్‌ చార్జ్‌ల్లో చాలా మందికి డీ గ్రేడ్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

చాలామంది ఇన్‌ చార్జ్‌ ల‌కు డీ గ్రేడ్ రావ‌డంతో ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌త్యామ్నాయ వ్య‌క్తుల‌కోసం కూడా అధిష్టానం అన్వేష‌ణ చేస్తోంద‌ని పార్టీలోని అంత‌ర్గ‌త స‌మాచారం. ఇక మంత్రుల్లో కూడా కొంద‌రికి డీ గ్రేడ్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. కేబినెట్ ప్రక్షాళ‌న జ‌రిగితే స‌ద‌రు మంత్రుల‌పై వేటు క‌త్తి వేలాడుతున్న మంత్రుల‌కే డీ గ్రేడ్ వ‌చ్చిన‌ట్టు కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ రిపోర్టులు లీక్ అవ్వ‌కూడ‌ద‌ని బాబు ఆంక్ష‌లు పెట్ట‌డంతో ఏ గ్రేడ్ వ‌చ్చిన వారు సైతం త‌మ వివ‌రాలు వెల్ల‌డించ‌డం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/