Begin typing your search above and press return to search.

హ‌రికృష్ణ హ‌ల్‌ చ‌ల్ వెనుక లాజిక్ ఏంటో!!

By:  Tupaki Desk   |   5 April 2016 5:12 AM GMT
హ‌రికృష్ణ హ‌ల్‌ చ‌ల్ వెనుక లాజిక్ ఏంటో!!
X
గత కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న నందమూరి హరికృష్ణ ఒక్క సారిగా మళ్లీ తెరమీదకు వచ్చారు. న‌వ్యాంధ‌ప్ర‌దేశ్ రాజ‌ధాని విజయవాడలో ఆయ‌న‌ పర్యటించారు. ఈ ప‌ర్య‌టన సాధారణంగానే క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ రాజ‌కీయాల ప‌రంగా అటు తెలుగుదేశం పార్టీలో, ఇటు వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చోపచర్చలకు అవకాశం ఇచ్చింది. విజయవాడలో సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హరికృష్ణ హాజరయ్యారు. ప్రస్తుతం వైకాపాలో ఉన్న ఎమ్మెల్యే కొడాలి నానికి హరికృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. హరికృష్ణ నగరంలోకి రావడంతో నాని ఆయనను కలిశారు. అంతేకాదు... ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి వీరిద్దరూ కలిసి ఒకే కారులో వచ్చారు. అంతే.. ప్రసార మాధ్యమాలు ఈ కలయికపై రకరకాల కథనాలు ప్రసారం చేశాయి. ఇదే సభలో వేదికపై రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కూడా హరికృష్ణతో సన్నిహితంగా మెలిగారు. ఇది మరింత చర్చనీయాంశమైంది.

హరికృష్ణను వైకాపాలోకి రావల్సిందిగా ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ చాలాకాలం కిందటే ఆహ్వనించినట్టు భోగట్టా. ఒకానొక దశలో హరికృష్ణ కూడా అందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు వార్త‌లు వెలువ‌డ్డాయి. తాజాగా హరికృష్ణను కొడాలి నాని కలవడంతో తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. త్వరలోనే మన రాష్ట్రానికి సంబంధించి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. టీడీపీకి మూడు - వైకాపాకు ఒక స్థానం దక్కనుంది. ఇప్పటికే వైకాపాకు రానున్న ఒక సీటును విజయసాయిరెడ్డికి ఇవ్వబోతున్నట్టు సమాచారం. అవకాశం ఉంటే రెండో స్థానాన్ని దక్కించుకునేందుకు వైకాపా పావులు కదుపుతోంది. ఇందుకోసం హరికృష్ణను బరిలోకి దించాలన్న ఆలోచన చేస్తోందన్న కథనాలు తెరకెక్కాయి. హరికృష్ణతో నాని భేటితో ఈ కథనానికి మరింత బలం చేకూరినట్టయింది. హరికృష్ణ పార్టీలోకి వస్తే, రాజ్యసభ సీటు ఇవ్వలేకపోయినా, బాగా చూసుకుంటామంటూ ఆపార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం.

ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వైకాపా ఎమ్మెల్యేలకు టీడీపీ గాలం వేస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ కుటుంబం నుంచి హరికృష్ణను తమ పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా బాబుకు షాక్ ఇవ్వాలన్నది జగన్ వ్యూహమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే హరికృష్ణ వైకాపాలోకి వెళతారా? టిడిపిలోనే కొనసాగుతారా? అన్న ప్రశ్నలకు జవాబు లభించాలంటే కొంతకాలం వేచి చూడాలి. ఇదిలా ఉండగా హరికృష్ణతో భేటీ అయిన నాని టిడిపిలోకి వెళతారా? అంటూ కేవలం కొద్ది గంటల్లోనే ముమ్మర ప్రచారం సాగింది. దీనిపై నాని స్పష్టత ఇచ్చారు. తాను ఎప్పటికీ జగన్ వెంటే ఉంటానని, పార్టీ మారే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. హరికృష్ణతో తనకున్న సన్నిహిత సంబంధాలతోనే ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యానని ఆయన స్పష్టం చేశారు.