Begin typing your search above and press return to search.

ఢిల్లీలో జ‌గ‌న్ కు ప్రాధాన్య‌త అందుకేనా?

By:  Tupaki Desk   |   8 Aug 2022 10:47 AM GMT
ఢిల్లీలో జ‌గ‌న్ కు ప్రాధాన్య‌త అందుకేనా?
X
ఏపీ ముఖ్య‌మంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌ద్ద ప‌ర‌ప‌తి పెరిగిందా.. ఆయ‌న‌కు మంచి ప్రాధాన్య‌త ల‌భిస్తోందా అంటే అవుననే రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. త‌న‌పైన ఉన్న సీబీఐ, ఈడీ కేసుల భ‌యం వ‌ల్ల‌నైతేనేమి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సఖ్య‌త‌గా ఉండాల‌నుకునే వైఖ‌రి వ‌ల్ల అయితేనేమి అధికారంలోకి వ‌చ్చిన మొద‌టి రోజు నుంచే కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంతో వైఎస్ జ‌గ‌న్ స‌న్నిహిత సంబంధాలు నెర‌పుతున్నార‌ని గుర్తు చేస్తున్నారు.

బీజేపీ ప్ర‌భుత్వం పార్ల‌మెంటు రెండు స‌భ‌ల్లో వివిధ బిల్లులు ప్ర‌వేశ‌పెట్టిన‌ప్పుడు వైఎస్సార్సీపీ దాదాపు అన్ని సంద‌ర్భాల్లోనూ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింద‌ని చెబుతున్నారు. అంతేకాకుండా ఇటీవ‌ల రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ బీజేపీ అడిగిందే త‌డ‌వుగా వైఎస్ జ‌గ‌న్ త‌మ పార్టీ మ‌ద్ద‌తును బీజేపీ అభ్య‌ర్థుల‌కు ప్ర‌క‌టించారు.

అంతేకాకుండా గ‌తంలో కోవిడ్ స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ తీరును త‌ప్పుబ‌డుతూ జార్ఖండ్ ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్ ట్వీట్ చేస్తే.. దానికి జ‌గ‌న్ ఇలాంటి స‌మ‌యంలో మ‌నం మోడీకి అండ‌గా నిల‌బ‌డాలంటూ సోరెన్ కు రిప్లై ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఇలా అన్ని ర‌కాలుగా జ‌గ‌న్ ప్ర‌ధాని మోడీకి మ‌ద్ద‌తిస్తుండ‌టంతో ఆయ‌న కూడా జ‌గ‌న్ కు అంతే ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని చెప్పుకుంటున్నారు.

తాజాగా ఇది జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లోనూ క‌నిపించింద‌ని అంటున్నారు. నీతిఆయోగ్ స‌మావేశంలో పాల్గొన‌డానికి జ‌గ‌న్ తాజాగా ఢిల్లీ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశానికి కేసీఆర్, నితీష్ కుమార్ త‌ప్ప అన్ని రాష్ట్రాల సీఎంలు హాజ‌ర‌య్యారు.

అయితే వారంద‌రితో పోలిస్తే జ‌గ‌న్ కు మోడీ ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చార‌ని చెప్పుకుంటున్నారు. సీఎం జ‌గ‌న్ ను ఆప్యాయంగా ప‌ల‌క‌రించ‌డంతోపాటు భోజ‌నాలు చేసేట‌ప్పుడు కూడా ఆయ‌న‌తో మోడీ గంట‌కు పైగా ప్ర‌త్యేకంగా సంభాషించార‌ని వైఎస్సార్సీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

కాగా గ‌తంలో ఇదే ర‌క‌మైన ట్రీట్మెంట్ చంద్ర‌బాబుకు ల‌భించేద‌ని విశ్లేష‌కులు గుర్తు చేసుకుంటున్నారు. యునెటైడె ఫ్రంట్ హ‌యాంలో దేవ‌గౌడ‌, గుజ్రాల్ ప్ర‌ధాన‌మంత్రులుగా ఉన్న‌ప్పుడు ఫ్రంట్ క‌న్వీన‌ర్ గా చంద్ర‌బాబు చ‌క్రం తిప్పార‌ని నాటి ప‌రిణామాల‌ను విశ్లేష‌కులు వివ‌రిస్తున్నారు. చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లిన ప్ర‌తిసారీ ఆయ‌న‌కు మంచి ప్రాధాన్య‌త లభించేద‌ని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి ప్రాధాన్య‌తే జ‌గ‌న్ కు ల‌భిస్తోంద‌ని భావిస్తున్నారు.