Begin typing your search above and press return to search.

మనోళ్లే ప్రముఖ కంపెనీలకు సీఈవోలు అవుతున్నారెందుకు?

By:  Tupaki Desk   |   26 Aug 2019 4:53 AM GMT
మనోళ్లే ప్రముఖ కంపెనీలకు సీఈవోలు అవుతున్నారెందుకు?
X
ఒక సత్య నాదెళ్ల.. మరో సుందర్ పిచాయ్.. ఇంకో ఇంద్రానూయి.. శాంతన్ నారాయణ్.. ఫ్రాన్సిస్ కో డిసౌజా.. అజయ్ పాలసీ బంగా.. దినేశ్ పాలీవాలీ..ఇలా చెప్పుకుంటే చాలానే పేర్లు వస్తాయి జాబితాలోకి. ఈ అన్ని పేర్లలో ఒక కామన్ అంశం భారతీయత. వీరంతా భారతీయులు.. భారత మూలాలున్న వారు కావటం ఒక విశేషమైతే.. ప్రపంచంలో అతి పెద్ద కంపెనీల్లో వీరి కీ రోల్ పోషించటం మరో అంశంగా చెప్పాలి.

2000 ముందు వరకూ ప్రపంచ ప్రముఖ కంపెనీల్లో కీలకభూమిక పోషించింది చాలా తక్కువ. కానీ.. 2004 తర్వాత మాత్రం సీన్ మారిపోయింది. ఒకరి తర్వాత మరొకరు చొప్పున భారతీయ మూలాలున్న వారందరికి ప్రఖ్యాత కంపెనీల పగ్గాలు చేతికి అందాయి. వారిని అత్యున్నత స్థానాల్లో నియమిస్తూ ఆయా కంపెనీలు నిర్ణయాలు తీసుకున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఉన్నా.. మేధోపరంగా తిరుగులేని సామర్థ్యం ఉందని చెప్పుకునే దేశాలు లేకపోలేదు. చైనా.. జపాన్.. జర్మనీ.. రష్యా లాంటి దేశాలు ఉన్నప్పటికీ.. ఆ దేశస్తుల కంటే భారతీయుల్నే ప్రముఖ కంపెనీలు సీఈవోలుగా ఎందుకు నియమిస్తున్నారన్నది ఒక ప్రశ్న.

దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటన్నది ఆసక్తికర చర్చగా మారుతోంది. మల్టీ నేషనల్ కంపెనీలకు భారతీయుల పని విధానం.. వారు వ్యవహరించే తీరుతో పాటు.. ఐటీ రంగాల్లో మనోళ్లు వేసే ముద్రపై వారికి నమ్మకం అంతకంతకూ పెరగటం ఒక కారణమైతే.. హార్డ్ వర్క్ తో పాటు.. సమయానికి తగ్గట్లు స్మార్ట్ వర్క్ లోనూ భారతీయులు మొనగాళ్లన్న నమ్మకం కూడా అత్యున్నత స్థానాల్లో కూర్చోబెట్టటానికి కారణంగా చెప్పొచ్చు.

ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవటంతో ఇండియన్ బ్రెయిన్స్ మీద పలు ప్రముఖ కంపెనీల అధినేతలకు గురి పెరుగుతోంది. ఇదే.. మరింత మంది భారతీయులకు వరుస పెట్టి అవకాశాలు లభిస్తున్నట్లుగా చెప్పాలి. ప్రముఖ కంపెనీలకు సీఈవోలుగా మనోళ్లు ఎంపిక కావటానికి వెనుకున్న అసలు కారణం ఇదేనని చెబుతున్నారు.