Begin typing your search above and press return to search.

విమాన ప్రమాదం.. అంతుచిక్కని కారణాలు!

By:  Tupaki Desk   |   30 Oct 2018 7:22 AM GMT
విమాన ప్రమాదం.. అంతుచిక్కని కారణాలు!
X
ఇండోనేషియా విమాన ప్రమాదంలో 188మందికి పైగా అసువులు బాసారు. ఒక శిశువు, ఇద్దరు చిన్నారులు - ఇద్దరు పైలెట్లు - ఆరుగురు సిబ్బందితో సహా 188 మంది సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. టేకాఫ్ అయిన 2 నిమిషాలకే ఇంజిన్ లో తేడా వచ్చి 2వేల అడుగుల ఎత్తులో ఉండగా ఆకస్మికంగా 500 అడుగుల మేర కిందకు దిగుతూ ఎడమవైపుకు విమానం జారిపోయింది. మళ్లీ పుంజుకొని 5వేల అడుగుల ఎత్తు వరకు ఎగిరింది. అప్పటికి విమానం గాల్లోకి లేచి 13 నిమిషాలైంది. 13 నిమిషాల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. రాడార్ నుంచి విమానం మాయమైంది. విమానం మాయమయ్యేటప్పటికి 3650 అడుగుల ఎత్తులో కనిపించినట్టు అధికారులు గుర్తించారు. ఆ సమయంలో ఇండోనేషియా సముద్ర తీరానికి 15 కిలోమీటర్ల దూరంలో విమానం ఉన్నట్టు డేటాలో సూచిస్తోంది.

అయితే విమాన ప్రమాదాన్ని గుర్తించిన పైలెట్ విమానాన్ని తిరిగి జకార్తలోని సోకర్నో-హట్లో ఎయిర్ పోర్టుకు తీసుకొస్తానని ఏటీసీ అనుమతి కోరాడు. అంతలోనే సంబంధాలు తెగిపోయాయని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత క్షణాల్లోనే జావా సముద్రంలో విమానం కూలిపోయింది. జకార్తా రేవు నుంచి బయలుదేరుతున్న ఒక షిప్ లోని వారు ఈ ప్రమాదాన్ని కళ్లారా చూశారట..

ప్రమాదం జరగగానే అధికారులు వెంటనే సహాయక సిబ్బందిని బోట్లలో జావా సముద్రంలోకి పంపారు. కొన్ని గంటల పాటు వెతికినా జాడ దొరకలేదు. ఆ తర్వాత సముద్రంలో తేలిన కొన్ని మృతదేహాలు - చమురు తట్టు - విమాన శకలాలు - బూట్లు - ఐడీ కార్డులు - లగేజీలు తేలడంతో విమానం కూలిందని నిర్ధారణకు వచ్చారు. కొన్ని శకలాలు సమీపంలోని చమురు శుద్ధి కర్మాగారాన్ని చేరడంతో విమానం కూలిన విషయాన్ని ధృవీకరించారు. ఎవరైనా బతికి ఉన్నారేమోనని 40మంది డైవర్లు - 150మందితో హెలీక్యాప్టర్ ద్వారా గాలించినా ఫలితం రాలేదు.అయితే ఈ ప్రమాదానికి నిర్ధిష్ట కారణమేంటనేది తెలియరావడం లేదు. విమానం కాక్ పిట్ వాయిస్ రికార్డర్ - డేటా ఫ్లైట్ రికార్డర్ తో కూడిన ‘బ్లాక్ బాక్స్’ దొరికితే అందులో రికార్డ్ అయిన మాటలను బట్టి ప్రమాదానికి కారణాలు తెలుస్తాయి. అయితే ఈ బోయింగ్ 737 కంపెనీకి చెందిన విమానం కొత్తదిగా ఆగస్టులోనే కొని అందుబాటులోకి తీసుకొచ్చారట.. ఈ విమానం కూలిపోవడం అసాధ్యమని.. ఎలా జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు.