Begin typing your search above and press return to search.

షర్మిల అన్నేళ్లు దీక్ష చేసింది ఎందుకు..?

By:  Tupaki Desk   |   27 July 2016 4:55 AM GMT
షర్మిల అన్నేళ్లు దీక్ష చేసింది ఎందుకు..?
X
‘‘మీరు మీ ఇంట్లో ఉంటే.. సాయుధులైన సైన్యం మీ ఇంటిని చుట్టుముట్టి.. మీ తలుపు కొట్టి.. మీ అనుమతి ఉన్నా లేకున్నా ఇంటి మొత్తాన్ని చిందరవందర చేసేస్తూ.. తనిఖీలు చేయటం.. సందేహం వస్తే అదుపులోకి తీసుకోవటం.. తేడాగా అనిపిస్తే కాల్చేయటం’’ లాంటి రూల్ ఉంటుందంటే ఎలా ఫీలవుతారు. ఇదెక్కడి న్యాయం సామి అని అడిగేయం. సరిగ్గా అలాంటి చట్టం మీద నిరసన గళం విప్పి.. పదహారేళ్లుగా నిరసన చేస్తోంది ఉక్కు మహిళ ఇరోమ్ చాను షర్మిల. పదహారేళ్లుగా మంచినీళ్లు తాగకుండా దీక్ష చేస్తున్న ఈ మణిఫూర్ మహిళ.. వచ్చే నెల 9న తాను దీక్ష విరమిస్తున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈశాన్య భారతానికి చెందిన ఈ మహిళ గురించి వార్తలు చదివే వారికి సుపరిచితురాలు. మిగిలిన వారికి ఆమె ముఖం కొత్తే. మంచినీళ్లు తాగకుండా.. కన్న తల్లిని చూడకుండా.. తల దువ్వుకోకుండా.. అద్దంలో ముఖం చూసుకోకుండా పదహారేళ్లుగా నిరసన దీక్ష చేస్తున్న షర్మిలా వచ్చే నెల 9న తన దీక్షను విరమిస్తానని ప్రకటించటం సంచలనంగా మారింది. ఒక్కసారిగా మీడియా పతాక శీర్షికల్లో ఎక్కిన ఈమెకు సంబంధించిన వివరాల కోసం పలువురు ఆసక్తిగా వెతికే పరిస్థితి.

షర్మిలకు సంబంధించి చాలామంది అడిగే ప్రశ్న.. ఆమె ఎందుకు ఇన్నేళ్లుగా నిరశన చేస్తున్నారని? 2000 సంవత్సరం నవంబరు నెలలో పది మంది మణిపూర్ పౌరులను అస్సాం రైఫిల్స్ విభాగ సైనికులు కాల్చి చంపారు. ఈ ఘటన షర్మిలను తీవ్రంగా కలిచివేసింది. ఈశాన్య భారతంతో పాటు.. కొన్ని రాష్ట్రాల్లో అమలుచేసే ‘‘సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం’’ మీద ఆమె పోరు మొదలెట్టారు. మారుమూల ప్రాంతంలో జరుగుతున్న దీక్ష కావటం.. రెచ్చగొట్టే ప్రసంగాలు లేకపోవటం.. రాజకీయ జోక్యం పరిమితంగా ఉండటంతో ఆమె నిరశన కొనసా...గుతూనే ఉంది కానీ.. పరిష్కారం మాత్రం లభించని పరిస్థితి. నిరశనతో సాధించలేనిది రాజకీయంగా సాధించాలన్న లక్ష్యంతోనే ఆమె తన పదహారేళ్ల దీక్షను ముగిస్తున్నారు. ఉద్యమకారిణిగా సాధించలేని ప్రత్యేక చట్టాన్ని మార్చాలన్న డిమాండ్ ను షర్మిల రాజకీయంగా అయినా మార్చగలుగుతారో చూడాలి?