Begin typing your search above and press return to search.

కొత్త నోట్లు దాస్తే దొరికిపోవడం ఖాయం

By:  Tupaki Desk   |   14 Dec 2016 7:07 AM GMT
కొత్త నోట్లు దాస్తే దొరికిపోవడం ఖాయం
X
ప్రభుత్వం 500 - 1000 నోట్లను రద్దు చేసిన తరువాత దేశంలో ఎన్నో మార్పులు అవినీతి - నల్లధనం అంతానికే ఆ నోట్లను రద్దు చేశామని చెబుతూ కొత్తగా 2 వేల నోటును తీసుకొచ్చారు. అయితే... అక్రమార్కులకు అడ్డేముంది.. కొత్త నోట్లు జనానికి దొరక్కపోయినా తాము మాత్రం కోట్లకు కోట్లుగా సంపాదిస్తున్నారు. ప్రతిరాష్ట్రంలోనూ కొత్త నోట్లు దాచినవారు దొరికిపోతున్నారు. తమిళనాడులో శేఖరరెడ్డి ఇంట్లో ఎన్ని కోట్లు దొరికాయో తెలిసిందే. ఆదాయపన్ను శాఖ - అవినీతి నిరోధక శాఖ - ఎన్ ఫోర్సుమెటు డైరెక్టరేట్ ఇలా అంతా కలిసి దాడులు చేస్తూ గుట్టలుగా ఎవరి వద్దయినా కొత్త నోట్లు ఉంటే పట్టుకుంటున్నారు. దీంతో కొత్త 2 వేల నోటుపై ఎన్నో కొత్తకొత్త ప్రచారాలు వస్తున్నాయి. అందులో జీపీఎస్ ఎనేబుల్ చేసిన ఎలక్ర్టానిక్ చిప్ ఉందని - ఫాస్పరస్ 32 ఐసోటోప్ ఉందని.. అందుకే పెద్ద సంఖ్యలో ఈ నోట్లు ఎక్కడైనా ఉంటే అధికారులు దాన్ని ట్రేస్ చేయగలుగుతున్నారన్న ప్రచారం ఒకటుంది. ప్రభుత్వం - అధికారులు దాన్ని ఖండిస్తున్నా ప్రజల్లో చాలామంది అలాంటివి నమ్ముతున్నారు. అయితే... కొత్త నోట్లను పట్టుకోవడానికి చిప్ లు - ఐసోటోప్ లు అవసరం లేదు... కొత్త నోట్లు ప్రెస్ నుంచి బయటకొచ్చింది మొదలు అది ఎటు పోతుందో జాగ్రత్త పరిశీలిస్తే చాలు పట్టుకోవచ్చంటున్నారు విశ్లేషకులు.

2015లో దేశంలో అక్రమార్కులపై దాడులు చేసి 330 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో కొంత మాత్రమే నగదు. ఈ ఏడాది కూడా డీమానిటైజేషన్ ముందు వరకు నగదు - ఆస్తులు కలిసి 102 కోట్లు జప్తు చేశారు. కానీ.. పెద్ద నోట్ల రద్దు తరువాత మాత్రం అంతకు ఎన్నో రెట్లు కొత్త కరెన్సీ పట్టుకున్నారు. ఈ కొద్ది వారాల్లోనే ఇంతగా ఎలా పట్టుకుంటున్నారు.. కచ్చితంగా అందులో చిప్ లు ఉన్నాయనేవారు ఉన్నారు. కానీ... బ్యాంకుల లింకేజీ విధానం పరిశీలిస్తే ఇదంతా కాదని.. సాధారణ విధానాల్లోనే తెలిసిపోతోందని - కాదంటే ఇంతకుముందు కంటే ఇప్పుడు బాగా దృష్టి పెట్టారని అర్థమవుతోంది.

బ్యాంకులన్నీ ప్రతి రోజూ తమ బ్యాంకింగ్ కార్యకలాపాల వివరాలను అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. తమతమ శాఖల్లో ఎంత డిపాజిట్ అయింది.. ఎంత విత్ డ్రా అయింది, ఏఏ అకౌంట్ల మధ్య క్యాష్ ట్రాన్సఫర్ అయింది వంటివివరాలన్నీ రికార్డవుతాయి. బ్యాంకుల సర్వర్లు ఆర్బీఐతో లింక్ అయి ఉంటాయి. అంతేకాదు.. కేంద్రం ఆర్థిక శాఖ పరిధిలోనే నేరుగా పనిచేసే ఎకనమిక్ ఇంటిలిజెన్స్ కౌన్సిల్ లో భాగంగా పనిచేసే ఫైనాన్షియల్ ఇంటిలిజెన్సు యూనిట్ కు ఈ వివరాలన్నీ యాక్సెస్ ఉంటుంది. అసలు కథ అక్కడే మొదలవుతుంది. ఈ మొత్తం లావాదేవీలను ఫైనాన్షియల్ ఇంటిలిజెన్సు యూనిట్లు అత్యంత నిశితంగా పరిశీలిస్తాయి. ఎక్కడ ఏ అనుమానం వచ్చినా వెంటనే అప్రమత్తమవుతాయి. క్షేత్ర స్థాయిలో పనిచేసే ఐటీ - ఈడీ వంటి శాఖలకు సమాచారం ఇస్తాయి.

అంతేకాదు.... ఆర్బీఐ వద్ద కూడా కచ్చితమైన వివరాలుంటాయి. ఏ బ్యాంకుకు - ఏ బ్రాంచికి ఎంత క్యాష్ ఇచ్చాం.. ఏటీఎంలకు సరఫరా అవుతున్న తీరు.. రోజులో బ్రాంచిల్లో జరిగే విత్ డ్రాలు - ఏటీఎంల్లో తీసే నగదు వంటి వివరాలన్నీ అప్ డేట్ అవుతాయి. అంతేకాదు... ప్రస్తుతం కొత్త నోట్లు ముద్రణ కేంద్రాల నుంచి బయటకు పంపించేటప్పుడే ప్రతి నోటు నంబరును నమోదు చేసి.. ఏఏ నంబర్లు ఎక్కడకు పంపిస్తున్నామన్న వివరాలు రికార్డు చేస్తోంది. ప్రస్తుతం బ్యాంకులు - ఏటీఎంల నుంచి మాత్రమే కొత్త నోట్లు పొందే అవకాశం ఉంది. బ్యాంకు ఉద్యోగుల పాత్ర లేనిదే అవి దారి మళ్లే ఛాన్సు లేదు. దీంతో ఫైనాన్షియల్ ఇంటిలిజెన్సు యూనిట్ జాగ్రత్తగా గమనిస్తూ ఏఏ శాఖల పరిధిలో తక్కువ వ్యవధిలో భారీ మొత్తాలు ట్రాన్జాక్టవుతున్నాయో గుర్తించి నిఘా పెడుతున్నారు. ఆ బ్రాంచిలో సిబ్బంది సంఖ్య... కొత్త పరిమితుల నేపథ్యంలో రోజుకు ఎంత ట్రాన్జాక్ట్ చేసే సామర్థ్యం ఉంటుందన్న కచ్చితమైన అంచనాతో అక్కడ తేడా జరిగిందో లేదో పసిగడుతున్నాయి. ఆ సమాచారంతో ఐటీ - ఈడీ రంగంలోకి దిగుతున్నాయి. పరిశోధన జరిపి పట్టుకుంటున్నాయి. అదీ సంగతి. సో... జీపీఎస్ - చిప్ ఏదీ అవసరం లేకుండా నల్లధనవంతులకు బ్యాండ్ పడుతోంది.. అంతేకాదు.. కొద్దివారాలుగా అడ్డగోలుగా కమీషన్లతో కోట్లు సంపాదించేస్తున్న బ్యాంకు ఉద్యోగులకూ నెత్తి బొప్పి కట్టడం ఖాయం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/