Begin typing your search above and press return to search.

జగన్ ఎందుకంత కరకుగా ఉన్నారు..?

By:  Tupaki Desk   |   27 March 2020 4:49 AM GMT
జగన్ ఎందుకంత కరకుగా ఉన్నారు..?
X
వారంతా ఏపీకి చెందిన వారే. మొన్నటివరకూ ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా బస్సు ఎక్కటం.. గంటల వ్యవధిలో ఏపీలోకి వాలిపోయేవారు. కరోనా వేళ.. సీన్ మొత్తం మారిపోయింది. తెలంగాణ.. ఆంధ్రా రాష్ట్రాల మధ్య సరిహద్దులు పక్కాగా పని చేస్తున్నాయి. ఏపీ నుంచి తెలంగాణకు.. అదే రీతిలో తెలంగాణ నుంచి ఏపీకి ఎవరిని అనుమతించటం లేదు.

రెండు రోజుల క్రితం హైదరాబాద్ మహా నగరం నుంచి హాస్టల్స్ లో ఉండే ఐటీ ఉద్యోగులు.. విద్యార్థులు.. ఇతర రంగాలకు చెందిన ఉద్యోగులు ఏపీ సరిహద్దుల్లో ఉన్నారు. తెలంగాణ పోలీసుల అనుమతి పత్రాలు తీసుకొని.. ఏదోలా సొంతూరుకు వెళ్లిపోవాలన్న ఉద్దేశంతో ఏపీ సరిహద్దుల్లోకి చేరుకున్న వారిని..అనుమతి ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. మన పిల్లల్ని మనం వద్దంటే ఎలా? అన్న సెంటిమెంట్ డైలాగులు కొడుతూ.. ప్రభుత్వం మీద భావోద్వేగ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు.

ఎవరెన్ని చెప్పినా.. ఎంత ఒత్తిడి చేసినా.. ఏపీలోకి ఎవరిని అనుమతించేది లేదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. రెండు చేతులు జోడించి దండం పెడుతూనే.. ఎక్కడి వారు అక్కడే ఉండాలని తేల్చేశారు. ఎందుకింత కరకుగా జగన్ ఉన్నారంటే.. కరోనా వైరస్ తోనేనని చెప్పాలి. వేలాది మంది సరిహద్దుల్లో ఏపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్ననేపథ్యలో.. ఇలాంటివారిని రాష్ట్రంలోకి అనుమతించిన పక్షంలో వారంతా పద్నాలుగు రోజులు క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాల్సిందే.

ఒకవేళ అందుకు ఓకే అన్నా.. ఒకేసారి ఇంతమందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తే.. ఏపీ ప్రజలకు అవసరమైతే ఏం చేయాలన్నది ప్రశ్న. అందులోకి ఇప్పుడు కీలక సమయంలో ఉన్న వేళ.. ఏ మాత్రంరిస్క్ తీసుకోలేని పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చొరవ తీసుకొని.. మనోళ్లే కదా? అని అనుమతిస్తే.. కొత్తసమస్యలు ఉత్పన్నమయ్యే వీలుంది. అందుకే.. ఎవరు ఏమనుకున్నా.. ఎంత తిట్టుకున్నా.. ఎంత ఒత్తిడి తెచ్చినా ఏపీలోకి ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని సీఎం జగన్ కచ్ఛితంగా ఉన్నారు. కొందరి కోసం.. ఏపీలోని కోట్లాది మంది ఆరోగ్యాన్ని.. భద్రతను ప్రశ్నార్థం చేయలేమన్న ఆలోచనతోనే సీఎం జగన్ ఇంతలా ఉన్నారంటున్నారు. రెండు చేతులు జోడించి.. పరిస్థితిని అర్థం చేసుకోండి అన్న మాటే తప్పించి.. రాష్ట్రంలోకి రానిచ్చేది మాత్రం లేదని స్పష్టం చేయటం గమనార్హం.