Begin typing your search above and press return to search.

జగన్ కు వ్యూహకర్త కావలెను?

By:  Tupaki Desk   |   13 July 2016 11:04 AM GMT
జగన్ కు వ్యూహకర్త కావలెను?
X
ఏపీ విపక్ష నేత - వైసీపీ అధినేత జగన్ మోహనరెడ్డికి ఆ పార్టీలో పెద్ద లోటు ఏర్పడింది. సీనియర్ లీడర్లున్నారు.. జగన్ అంటే ప్రాణమిచ్చే వారున్నారు. కానీ... సరైన వ్యూహకర్త మాత్రం లేని లోటు ఆ పార్టీని వెంటాడుతోంది. చాలాకాలంగా వైసీపీని వెన్నాడుతున్న సమస్య ఇది. ఆ కారణంగానే టీడీపీ వల వేసి తమ ఎమ్మెల్యేలను ఎత్తుకుపోతున్నా జగన్ ఏమీ చేయలేకపోయారు. రాజకీయాల్లో ఆరితేరినవారి అండ లేకపోవడంతో జగన్ కొన్ని విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. నిజానికి తలపండిన నేతలు జగన్ వెంట ఉన్నా వారిని సరిగా ఉపయోగించుకోవడంలో జగన్ విఫలమయ్యారు. అంతా నా ఇష్టం అంటూ వారి మాటలను లెక్క చేకుండా వారిని దూరం చేసుకున్నారు. అలాంటి వారిలో మైసూరా రెడ్డి ఒకరు. అపర చాణుక్యుడిగా పేరున్న మైసూరా ఇటీవల జగన్ పార్టీ నుంచి బయటకొచ్చేశారు. వైఎస్ కు కుడి భుజంలా ఉన్న కేవీపీ రామచంద్రరావు కూడా జగన్ కు అండగా లేరు. జ్యోతుల నెహ్రూ వంటి సీనియర్లూ దూరమయ్యారు. పార్టీలో బొత్స - ధర్మాన వంటి నేతలున్నా కూడా వారు అంతగా కీలకంగా లేరు. విజయసాయిరెడ్డి మేధావే అయినా రాజకీయ ఎత్తుగడలు వేయలేరు. పార్టీలో యాక్టివ్ గా ఉన్నవారంతా రాజకీయ అనుభవం తక్కువ ఉన్నవారు, జగన్ లా దూకుడు ఉన్నవారు మాత్రమే . దీంతో జగన్ కొన్ని సందర్భాల్లో సరైన మార్గదర్శనం లేక దెబ్బతింటున్నాడు.

దీంతో జగన్ ఇప్పుడు తమ పార్టీకి మంచి వ్యూహకర్త కావాలని కోరుకుంటున్నారట. ఆ పాత్రకు సరైన వ్యక్తి ఎవరని ఆలోచించగా ఆయనకు తన తండ్రికి మిత్రుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ సరైన వ్యక్తిగా కనిపించారని చెబుతున్నారు. మేధావిగా - మాటకారిగా పేరున్న ఉండవల్లి పట్టు పడితే ఉడుం పట్టే. అలాంటి నేతను వైసీపీలోకి తేవాలని జగన్ కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే... రాజశేఖరరెడ్డికి ఎంతగా క్లోజ్ అయినా జగన్ కు మాత్రం అండగా లేరు. ఉండవల్లి. అలాంటి ఉండవల్లిని తనకు అండగా మార్చుకోవాలని జగన్ కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

పెద్దగా ప్రజాబలం లేకపోయినా.. క్షేత్ర స్థాయిలో అంత బలం లేకపోయినా ఉండవల్లి మంచి క్రేజ్ ఉన్న నేత. లాయర్ అయిన ఆయన లా పాయింట్లు బాగా తెలిసిన వాడు.. అందుకే వైఎస్ గతంలో తన మీడియా శత్రువు రామోజీని దెబ్బ తీసేందుకు ఉండవల్లిని అస్త్రంగా మలచుకున్నాడు. అసలు మార్గదర్శి ఇష్యూతోనే ఉండవల్లి హైలెట్ అయ్యాడన్న సంగతీ తెలిసిందే. ఇది గతం.. ఇప్పుడు ఉండవల్లి యాక్టివ్ పాలిటిక్స్ లో లేరు. ఆయన తెలివితేటలను వైసీపీ కోసం ఉపయోగించుకోవాలని జగన్ అనుకుంటున్నారట. తాజాగా జగన్ వెళ్లి ఉండవల్లిని కలవడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. తల్లిని కోల్పోయిన ఉండవల్లిని పరామర్శించేందుకు జగన్ వచ్చారని చెబుతున్నా కూడా వ్యూహకర్త వేటలోనే ఆయన వెళ్లారని సమాచారం. ఉండవల్లిని పార్టీలోకి ఆహ్వానించేందుకే జగన్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది. మరి ఉండవల్లి ఏమంటారో చూడాలి.