Begin typing your search above and press return to search.

ఆ ఒక్కటే రోజాకు మంత్రి పదవిని దూరం చేసింది

By:  Tupaki Desk   |   8 Jun 2019 4:49 AM GMT
ఆ ఒక్కటే రోజాకు మంత్రి పదవిని దూరం చేసింది
X
కాబోయే హోమ్ మంత్రి రోజా.. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో .. సాధారణ మీడియాలో హైలెట్ అయిన రోజాకు జగన్ తన కేబినెట్ లో మంత్రి పదవిని ఇవ్వకపోవడంతో ఫోకస్ అంతా ఆమె పైనే నెలకొంది.. పాపం రోజా అంటూ తెలిసిన వాళ్లు అంతా నిట్టూర్చారు. కానీ రోజా త్యాగం వెనుక పెద్ద కథ ఉంది.. సామాజిక సమీకరణాలే ఆమె పదవికి శాపంగా మారాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో మహిళా హోమ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేయడంతో జగన్ కేబినెట్ లో రోజాను జగన్ హోమ్ మంత్రి చేస్తారని అంతా భావించారు. కానీ ప్రతిపక్షాలకు ఆయుధం ఇవ్వకూడదని.. అదే సమయంలో పచ్చ మీడియా చేతికి చిక్కకూడదని.. స్వయంగా రెడ్డి అయిన తన సామాజికవర్గానికి పెద్ద పీట వేయద్దనే జగన్ ఈ సాహసోపేత నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

టీడీపీ అధికారంలో ఉండగా రోజా చేయని పోరాటం లేదు. ఫైర్ బ్రాండ్ గా అసెంబ్లీలో.. బయట చంద్రబాబును చెడుగుడు ఆడేశారు. పదునైన విమర్శలతో అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశారు. అసెంబ్లీలో ప్రవేశించకుండా చంద్రబాబు సస్పెన్షన్ విధించినా పోరాడారు. వైసీపీలో అంత పోరాట పటిమ కనబర్చిన రోజాకు మంత్రి పదవి లేకపోవడం వైసీపీ వర్గాల్లోనే కాదు.. సామాన్యుల్లోనూ కాసింత నిరాశకు గురిచేసింది. కానీ రోజా త్యాగం వెనుక సామాజిక కోణం ఉంది..

మొన్నటికి మొన్న పార్లమెంటరీ పక్ష నేతల పోస్టులను జగన్ రెడ్డిలకే ఇచ్చారు. విజయసాయిరెడ్డిని పార్లమెంటరీ పక్ష నేతగా.. మిథున్ రెడ్డిని లోక్ సభాపక్ష నేతగా నియమించారు. ఇక అధికారుల బదిలీలు - సీఎం పేషీలోనూ రెడ్డి అధికారులను తీసుకున్నారని ఎల్లో మీడియా - ప్రతిపక్షాలు కోడై కూశాయి. అందుకే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని.. ఆయా వెనుకబడిన వర్గాలు ఇచ్చిన అందలాన్ని మిస్ చేసుకోకూడదని జగన్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అందుకే కేబినెట్ లో రెడ్లకు కేవలం 4 పదవులే ఇచ్చారు. అందుకే రోజాకు మంత్రివర్గంలో స్థానం లేకుండా పోయింది.

స్వయంగా రెడ్డి సామాజికవర్గమైన జగన్ తన సామాజికవర్గాన్ని దూరం పెట్టడం నిజంగా సాహసోపేత నిర్ణయంగా చెప్పవచ్చు. ఇందులో అత్యధికంగా బీసీలకు ఏడు - ఎస్సీలకు ఐదు - రెడ్లు - కాపులకు కేవలం 4 చొప్పున మంత్రి పదవులు ఇచ్చారు. ఈ కారణంగానే అగ్రవర్ణాలైన రోజా - ధర్మానా ప్రసాద్ రావు - ఆనం రాంనారాయణరెడ్డి లాంటి వాళ్లు మంత్రి పదవులు దక్కించుకోలేకపోయారు. అయితే రెండున్నరేళ్ల తర్వాతైనా రోజా సహా ఈ ఫైర్ బ్రాండ్లకు మంత్రి యోగం దక్కుతుందని ఆశిద్ధాం..