Begin typing your search above and press return to search.

మోడీ టీమ్ లోకి జయ.. ఎవరికి లాభం

By:  Tupaki Desk   |   7 Jun 2016 10:44 AM GMT
మోడీ టీమ్ లోకి జయ.. ఎవరికి లాభం
X
కేంద్ర కేబినేట్ లో అన్నా డీఏంకే చేరనుందన్న స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. జయ నేతృత్వంలోని అన్నాడీఎంకేని కేంద్ర కేబినెట్ లోకి తెచ్చేందుకు ప్రధాని మోడీ స్వయంగా ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. ఆ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చాయని, ఈ నెలాఖరులోని మోడీ - జయ మధ్య జరిగే భేటిలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

కాగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో ఇప్పటికే తెలుగుదేశం - అకాలీదళ్ వంటి పార్టీలు ఉన్నాయి. దక్షిణాది నుంచి తెలుగుదేశం పార్టీ ఒక్కటే కేంద్రంలో ఉన్నప్పటికీ ఆ పార్టీతో అంత సామరస్య వాతావరణం లేదు. కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు చెందిన పార్టీగా టీడీపీ ఏపీ ప్రయోజనాల కోసం నిత్యం కేంద్రంపై ఒత్తిడి పెంచుతోంది. దీంతో బీజేపీ - టీడీపీ పొత్తు ఎప్పుడైనా తెగే ప్రమాదముందన్న అనుమానాలు బీజేపీలో ఉన్నాయి. దీంతో ప్రత్యామ్నాయంగా మరో బలమైన పార్టీని ప్రభుత్వంలో చేర్చుకోవాలని కొన్నాళ్లుగా బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఆ క్రమంలో తమిళనాడులో ఎన్నికల ముందు నుంచే జయతో కలిసి పనిచేయాలని బీజేపీ ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. అయినప్పటికీ తమ అవసరాల రీత్యా మోడీ తన ప్రయత్నాలను అపకుండా కొనసాగించారు. ఫలితంగా ఎన్నికల అనంతరం ఘన విజయం సాధించిన జయలలితను కేంద్రంలో చేర్చుకోవడానికి మార్గమేర్పరిచనట్లుగా తెలుస్తోంది. అన్నా డీఏంకేకు ప్రస్తుతం తమిళనాడు నుంచి 12 మంది, పుదుచ్ఛేరి నుంచి ఒక ఎంపీ ఉన్నారు. దీంతో రాజ్యసభలో ఎన్డీఏ బలం 62కు చేరుతుంది. ప్రస్తుతం ఎన్డీఏ బలం 49 కాగా - కాంగ్రెస్ బలం 64. అన్నా డీఏంకే చేరికతో రాజ్యసభలో జీఎస్ టీ బిల్లు ఆమోదం మరింత సులభమౌతంది. జయలలిత తమ కూటమిలో చేరికతో కాంగ్రెస్ తమకు మద్దతు ఇవ్వడం వినా.. మరో గత్యంతరం లేదని ఎన్డీఏ నేతలు అంటున్నారు.

మరోవైపు జయలలితను కేంద్ర ప్రభుత్వంలో చేర్చుకోవడం వెనుక ఇంకో కారణం కూడా కనిపిస్తోంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిన తరుణంలో.. బీజేపీకి ప్రత్యామ్నాయంగా తృతీయ కూటమి ఏర్పాటు అవకాశాలు ఎప్పుడైనా ఏర్పడొచ్చు. అలాంటిది జరిగితే జయ వంటివారు అందులో కీలకమవుతారు. ఆ ప్రమాదాన్ని తప్పించడానికి ఆమెను కేంద్రంలోకి తెస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ నెలాఖరులో స్పష్టత వస్తుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.