Begin typing your search above and press return to search.

జేసీ బెదిరింపు వెనుక ఎన్నిక‌ల మ‌ర్మం ఉందా?

By:  Tupaki Desk   |   22 Sep 2017 4:36 AM GMT
జేసీ బెదిరింపు వెనుక ఎన్నిక‌ల మ‌ర్మం ఉందా?
X
జేసీ దివాకర్‌ రెడ్డి...తెలుగు రాష్ర్టాల్లో త‌ర‌చూ మీడియాలో క‌నిపించే అతికొద్దిమంది రాజ‌కీయ‌వేత్త‌ల్లో ఒక‌రు. ఎమ్మెల్యేగా ఉన్నా....మంత్రిగా ఉన్న ఎంపీగా ఉన్నా...కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం అయినా జేసీ విధానం ఓకేలాగే ఉంటుంది. సంచలనాలకు ఆయ‌న కేరాఫ్ అడ్ర‌స్‌. త‌న‌దైన శైలిలో కామెంట్లు చేసే అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ ఖాతాలో ఎన్నో సంచ‌ల‌నాలు ఉన్నాయి. అనంతపురం నగరంలో రోడ్ల విస్తరణ - పారిశుద్ధ్యం - పందుల నిరోధం - డ్రైనేజీల శుభ్రత విషయంలో స్థానిక ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి - మేయర్ మదమంచి స్వరూపతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. కొద్దికాలం క్రితం విశాఖ ఎయిర్‌ పోర్టులో బోర్డింగ్ పాస్ విషయంలో అక్కడి ఉద్యోగిపై చేయి చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై పలు విమానయాన సంస్థలు నిషేధం విధించడం ఆ తరువాత ఆ సమస్య సద్దుమణగింది. త‌న సంచల‌నాల‌కు కొన‌సాగింపుగా ఈసారి ఏకంగా తన పదవికి రాజీనామా చేస్తానంటూ ప్ర‌క‌టించారు.

సొంత ఇలాకాలో కూడా జేసీ హ‌ల్‌చ‌ల్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. గతంలో అనంతపురం నగరంలో రోడ్ల విస్తరణ - పారిశుద్ధ్యం పనులపై ఏకంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట టెంట్ వేసి ధర్నా చేశారు. తర్వాత సీఎం ఆదేశాలతో ముగ్గురు మంత్రుల కమిటీ వేసి ఆ వేడిని చల్లార్చారు. రోడ్ల విస్తరణ అంశం కూడా మరుగున పడిపోయింది. దీంతో వివాదాలు సద్దుమణిగి ప్రశాంతత నెలకొందనుకుంటున్న తరుణంలో మళ్లీ జేసీ దివాకర్‌ రెడ్డి తెరపైకి రావడం విశేషం. రాజీనామాలోనూ జేసీ త‌న‌దైన శైలి ట్విస్టులు పెట్టారు. గతంలో కూడా అనేక మార్లు రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించినా, ఈసారి చాలా కఠినంగానే తన నిర్ణయాన్ని వెల్లడించారు. తాను పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, కానీ రాజకీయాల్లో కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. అయితే ఏపార్టీలోనూ చేరనని, టీడీపీలోనే ఉంటానని కూడా పేర్కొన్నారు. అయితే తన పదవికి రాజీనామా చేస్తానంటూ అస్త్రం సంధించడం ఆషామాషీగా ఏమీ కాద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో ముఖ్యంగా అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం - అనంతపురం నగరంలో పట్టు కోసమే ఆయన ఈ ప్రకటన చేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రానున్న 2019 ఎన్నికల్లో తన కుమారుడిని అనంతపురం నుంచి తన స్థానంలో పోటీ చేయించాలని పావులు కదుపుతున్నారు. అలాగే తాడిపత్రి నుంచి తన సోదరుడు - ప్రస్తుత ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌ రెడ్డిని మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరితో విభేదాలుండటంతో రాజకీయంగా పట్టు కోల్పోకూడదని జేసీ దివాకర్‌ రెడ్డి రాజీనామా అస్త్రాన్ని సంధించినట్లు తెలుస్తోంది. దీనికి అభివృద్ధి, ప్రజల సమస్యలను సాకుగా చూపుతున్నారన్న విమర్శలు లేకపోలేదు.

అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రానున్న ఎన్నికల్లో సైతం తన ఆధిపత్యాన్ని కొనసాగించాలన్న లక్ష్యం, ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం తనకు సహకరించేలా చేసుకోవడం రాజకీయ వ్యూహంలో భాగమేనని వారు భావిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో అనంతపురం అసెంబ్లీకి వైకుంఠం ప్రభాకర్‌ చౌదరికి అవకాశం లేకుండా చేయడం కూడా ఆయన వ్యూహమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన కుమారుడు జెసి పవన్‌కుమార్‌రెడ్డిని ఎంపిగా గెలిపించుకున్నా, తాను పార్టీకి సలహాదారుడిగానో, విధేయుడిగానో ఉన్నా, ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవడం కూడా వ్యూహంలో భాగమై ఉండొచ్చన్న అనుమానాలు లేకపోలేదు. కాగా, ఎంపీగా హూందాగా ప్రవర్తించడం లేదన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు వద్ద కూడా ఆయనకు తగిన గౌరవం దక్కలేదని, అందుకే ఇలా చేశారని సొంత పార్టీ నేత‌లు చర్చించుకుంటున్నారు.