Begin typing your search above and press return to search.

మ‌హిళా స‌ద‌స్సుకు క‌విత‌క్క ఎందుకు రాన‌ట్లు?

By:  Tupaki Desk   |   1 Dec 2017 9:54 AM GMT
మ‌హిళా స‌ద‌స్సుకు క‌విత‌క్క ఎందుకు రాన‌ట్లు?
X
ఒక స‌ద‌స్సు కోసం ఒక రాష్ట్ర స‌ర్కారు కిందామీదా ప‌డి ప‌ని చేయ‌టం మామూలే. కానీ.. ఒక మంత్రి త‌న శాఖ పేరును సైతం మ‌ర్చిపోయేలా ప‌ని చేసిన స‌ద‌స్సు ఏదైనా ఉందంటే ఆది జీఈఎస్‌ గా చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుమారుడు.. ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ జీఈఎస్ కోసం ఎంత ప్ర‌త్యేక శ్ర‌ద్ద ప్ర‌ద‌ర్శించారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

ఎందుకంటే.. జీఈఎస్ కోసం తామెంత క‌ష్ట‌ప‌డిన విష‌యాన్ని అన్యాప‌దేశంగా చెప్పేశారు. స‌ద‌స్సు రెండో రోజున జ‌రిగిన చ‌ర్చావేదిక మీద త‌న‌ను తాను ప‌రిచ‌యం చేసుకునే సంద‌ర్భంగా త‌న పేరు తార‌క రామారావు అని.. తాను ఐటీ మినిస్ట‌ర్ అని చెప్పుకున్నారు. ఆ రోజు స‌ద‌స్సుకు ట్రంప్ కుమార్తె ఇవాంక‌.. ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందాకొచ్చ‌ర్‌.. బ్రిట‌న్ మాజీ ప్ర‌ధాని టోనీ బ్లెయిర్ స‌తీమ‌ణి చెర్రీ బ్లెయిర్‌.. డెల్‌ సీఈవో క్వింటోస్ పాల్గొన్నారు. వీరి చ‌ర్చ కార్య‌క్ర‌మంలో కేటీఆర్ మెంటార్ గా వ్య‌వ‌హ‌రించారు. ఈ సంద‌ర్భంగా స‌ద‌స్సు కోసం త‌న మంత్రిత్వ శాఖ పేరు కూడా మారిపోయింద‌ని.. ఐటీ కాస్తా ఇవాంకా.. ట్రంప్ శాఖ‌గా మారిందంటూ న‌వ్వుతూ చ‌మ‌త్క‌రించారు.

జీఈఎస్ కోసం కేటీఆర్ ఎంత‌గా శ్ర‌మించారో ఆయ‌న మాట‌లే నిద‌ర్శ‌నం. దీనికి త‌గ్గ‌ట్లే స‌ద‌స్సు అనుకున్న దాని కంటే బాగా జ‌ర‌గ‌టం.. తెలంగాణ స‌ర్కారుకు మంచి పేరు రావ‌టం జ‌రిగింది. ఇదిలా ఉంటే.. ఈ స‌ద‌స్సుకు ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కోడ‌లు బ్రాహ్మ‌ణి.. చెర్రీ స‌తీమ‌ణి ఉపాశ‌న‌తో స‌హా ప‌లురంగాల‌కు చెందిన మ‌హిళ‌లు హాజ‌ర‌య్యారు. అంద‌రూ వ‌చ్చినా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుమార్తె క‌విత ఎక్క‌డా క‌నిపించలేదు.

క‌విత ఎందుకు రాలేద‌న్న మాట‌కు.. ఆమె బిజినెస్ ఉమెన్ కాదు క‌దా? అన్న ప్ర‌శ్న వేస్తారు. నిజ‌మే.. ఆమె పారిశ్రామిక‌వేత్త కాదు.. కానీ.. ఒక అంత‌ర్జాతీయ మ‌హిళా స‌ద‌స్సుకు తెలంగాణ రాష్ట్ర స‌ర్కారులో డైన‌మిక్ ఎంపీగా ఉండే క‌విత క‌నిపించ‌క‌పోవ‌టానికి కార‌ణం ఏమిట‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. క‌విత కూడా స‌ద‌స్సుకు హాజ‌రైతే అంత‌ర్జాతీయ స‌ద‌స్సు కాస్తా కుటుంబ స‌ద‌స్సుగా మార్చేశార‌న్న విమ‌ర్శ వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని.. అందుకే ఆమెను జీఈఎస్ ఛాయ‌ల‌కు వెళ్ల‌కూడ‌ద‌ని చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ మాట‌లో నిజం సంగ‌తి ఎలా ఉన్నా.. ఒకే వేదిక మీద తండ్రి ముఖ్య‌మంత్రి హోదాలో.. కొడుకు మంత్రి హోదాలో.. ఎంపీగా ఉన్న కుమార్తె హాజ‌రైతే రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు ఎదుర్కొనే అవ‌కాశం ఉంది. అందుకే.. క‌విత‌ను జీఈఎస్‌ కు దూరంగా ఉంచిన‌ట్లుగా తెలుస్తోంది.