Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఎందుకంత ఫైర్ అవుతున్నారు?

By:  Tupaki Desk   |   30 May 2017 11:30 AM GMT
కేసీఆర్ ఎందుకంత  ఫైర్ అవుతున్నారు?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట‌ల్లో చురుకుద‌నం ఎంత ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. ఆయ‌న నోటి నుంచి వ‌చ్చే మాట‌ల తీవ్ర‌త‌కు ఎంత‌టి వారైనా స‌రే కుదేలు కావాల్సిందే. అడ్డ‌దిడ్డంగా మాట్లాడినా.. అలాంటి భావ‌న అస్స‌లు అనిపించ‌క‌.. లాజిక్ గానే మాట్లాడిన‌ట్లుగా ఫీల‌య్యేలా చేయ‌గ‌ల నైపుణ్యం కేసీఆర్ సొంతం. కాబ‌ట్టే.. ఆయ‌నేం మాట్లాడినా.. నిజ‌మే క‌దా? అనిపిస్తుందే త‌ప్పించి.. ఇలా మాట్లాడ‌తారేంట‌న్న భావ‌న అస్స‌లు క‌ల‌గ‌దు. గ‌డిచిన కొద్దిరోజులుగా కేసీఆర్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.

ఎందుకిలా అంటే కార‌ణం లేక‌పోలేదు. గ‌డిచిన మూడేళ్లుగా ఒక్కొక్క ఇటుక‌.. ఇటుక పేర్చుకుంటూ వ‌స్తున్న కేసీఆర్‌.. తెలంగాణ‌లో త‌న‌కు తిరుగులేని రీతిలో బ‌లాన్ని సంపాదించారు. ప్ర‌జ‌ల్లో త‌న ప‌ట్టును మ‌రింత పెంచుకున్నారు. అదే స‌మ‌యంలో విప‌క్షాలు ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించాయి. కొన్ని అంశాలు త‌ప్పించి.. విప‌క్ష నేత‌లు ప‌లువురు ఎన్నిక‌ల‌కు చాలా స‌మ‌యం ఉంద‌న్న ఉద్దేశంతో కామ్ గా ఉండిపోయారు.

అలాంటి వారంతా ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు. ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్లు మాత్ర‌మే టైం ఉండ‌టం.. మోడీ కానీ ముంద‌స్తుకు వెళితే.. ఆ స‌మ‌యంలో మ‌రో ఆరేడు నెల‌లు త‌గ్గే అవ‌కాశం ఉండ‌టంతో.. ఇప్పుడిప్పుడే ఎన్నిక‌ల వేడి నెమ్మ‌దిగా షురూ అవుతోంది. ఒక్కొక్క నేత యాక్టివ్ అవుతున్నారు.

ఇలాంటి వేళ‌లో.. అధికార‌ప‌క్షంపై మాట‌ల దాడి షురూ అవుతుంది. మొద‌ట్లోనే ఇలాంటి దాడుల్ని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన‌ట‌మే కాదు.. త‌మ‌పై విమ‌ర్శ‌ల‌కు దిగేందుకు సైతం కాసింత భ‌య‌ప‌డేలాంటి ప‌రిస్థితిని సృష్టించాల‌న్న‌ది కేసీఆర్ వ్యూహంగా చెప్పొచ్చు. అందుకే.. ఆయ‌న ఇప్ప‌టినుంచి 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. ఆ మాట‌కు వ‌స్తే.. ఆయ‌నీ కార్య‌క్ర‌మాన్ని మొద‌లు పెట్టి ఆర్నెల్ల‌కు పైనే అయ్యింది.

మిగిలిన రాజ‌కీయ పార్టీల మాదిరి కాకుండా.. ఎన్నిక‌ల‌కు చాలా ముందు నుంచి ఆయ‌న త‌న ఎన్నిక‌ల వ్యూహాన్ని అమ‌లు చేయ‌టం మొద‌లు పెట్టారు. ఇందులో భాగంగా త‌న ఓట్ బ్యాంక్‌ను కులాలు.. వ‌ర్గాలు.. ప‌లు రంగాల ఉద్యోగులుగా విభ‌జించుకొని మ‌రీ వ‌రాలు ఇవ్వ‌టం క‌నిపిస్తుంది. మ‌రింత ముందుగా ప్లానింగ్ చేసుకొని.. క‌ష్ట‌ప‌డి అమ‌లు చేస్తున్న‌వేళ‌.. నాలుగు విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతుంటే ఏ అధినేత‌కు మాత్రం ఆగ్ర‌హం రాకుండా ఉంటుంది. అందులోకి తెలంగాణ‌లో అధికారం త‌న‌కు మాత్ర‌మే ఉండాలి. వేరెవ‌రూ అందుకు అర్హులు కార‌న్న‌ది బ‌లంగా న‌మ్మే కేసీఆర్ లాంటి నేత సీన్లో ఉన్న‌ప్పుడు రాజ‌కీయాలు ఇదే తీరులో ఉంటాయి. అందుకే.. ఎవ‌రేం అన్నా.. కేసీఆరే సీన్లోకి నేరుగా వ‌చ్చేస్తున్నారు. దుమ్ము దులిపేస్తున్నారు. ప్ర‌త్య‌ర్థులు నోరు విప్ప‌టానికి భ‌య‌ప‌డేలా విరుచుకుప‌డుతున్నారు. నిజానికి ఇది ఆరంభం మాత్ర‌మే. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డే కొద్దీ ఇలాంటివి మ‌రింత పెర‌గ‌టం ఖాయం. తెలంగాణ రాజ‌కీయాల్లో రానున్న రోజుల‌న్నీ స్పైసీ డేసే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/